క్రేజీకి హిట్లు, ఫ్లాప్స్‌తో సంబంధం లేదని నిరూపిస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు టాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ.  'పెళ్లి చూపులు' చిత్రంతో యూత్ లో  గుర్తింపు తెచ్చుకున్న విజయ్ 'అర్జున్ రెడ్డి' చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ఆ తర్వాత కొన్ని ప్లాఫ్ లు వచ్చినా గీతగోవిందం, మహానటి, టాక్సీవాలా వంటి చిత్రాలు అతని స్టార్ డమ్ ని మరింతగా పెంచుకుంటూ పోయాయి.‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రంతో ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించాడు విజయ్‌ దేవరకొండ. ఈ సినిమా థియేటర్‌ దగ్గర బోల్తా పడినప్పటికీ అతడి క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. 

 కొద్ది రోజులు క్రితమే మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌-2019 జాబితాలో రౌడీ వరుసగా రెండో సారి ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచిన దేవరకొండ తాజాగా మరో అరుదైన రికార్డ్ ని క్రియేట్ చేసి అభిమానులను ఆనందపరిచాడు.  ఆ అరుదైన రికార్డు ఏమిటంటే... దక్షిణాదిన ఎక్కువమంది ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న హీరో గా విజయ్ దేవరకొండ నిలిచారు. వేరే ఏ హీరోకి లేనంతగా విజయ్ కు 70 లక్షలకు పైగా ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. 

అలాగని చాలా కాలం నుంచి విజయ్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాని నడుపుతున్నారా అంటే అంత లేదు. కేవలం రెండేళ్ల కిందటే ఇనిస్ట్రా ఎక్కౌంట్ ని ప్రారంభించారు. అయినప్పటికీ వేరే ఏ ఇతర హీరోలకు సాధ్యం కాని రీతిలో అత్యధిక ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. కాగా, సోషల్ మీడియా అకౌంట్లను నిర్వహించేందుకు విజయ్ దేవరకొండకు ప్రత్యేక టీమ్ ఉంది. 
 
ప్రస్తుతం పూరి జగన్నాథ్ తాజా చిత్రం  ‘ఫైటర్‌’ లో విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు వరల్డ్ ఫేమస్ లవర్ వంటి డిజాస్టర్ చిత్రం తర్వాత వస్తున్న చిత్రం కావటంతో ... ఈ సినిమాతో విజయ్ తిరిగి ఫామ్ లోకి వస్తాడా...వచ్చేందుకు అవకాసం ఉందా అనే లెక్కలు వేస్తున్నారు. పూరి జగన్నాథ్ కథలు అయితే బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతాయి. లేదా డిజాస్టర్స్ అవుతాయి. ఇస్మార్ట్ శంకర్ తో వరస ఫ్లాఫ్ ల నుంచి బయిటపడ్డ ఆయన ఎలాగైనా మరో హిట్ ని సొంతం చేసుకోవాలనే ఊపులో ఉన్నారు. 

పూరీ కనెక్ట్స్‌, పూరీ జగన్నాథ్‌ టాకీస్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్‌ పతాకంపై కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో  తెరకెక్కస్తున్న చిత్రం ‘ఫైటర్‌’. హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. జనవరి 13న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. ఎక్కువ శాతం షూటింగ్‌ ముంబైలోనే జరిగేలా ప్లాన్ చేసారు.