టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటి సీత కన్నుమూశారు. 87ఏళ్ల సీత వృద్ధాప్య సమస్యలతో కొంత కాలంగా బాధపడుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ లో నేడు ఈ సంఘటన చోటు చేసుకుంది. వందల చిత్రాలలో నటించి చిత్ర పరిశ్రమకు సేవలు చేసిన సీత మృతికి చిత్ర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబానికి ప్రఘాడ సానుభూతి తెలియజేశారు. సీత అంత్యక్రియలు నేడు హైదరాబాద్ మహాప్రస్థానం శ్మశానవాటికలో బంధువులు నిర్వహించనున్నారు. 

కాకినాడకు చెందిన సీత బాలనటిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆమె బంధువు రాజా శాండో చిత్ర పరిశ్రమకు చెందినవారు కావడంతో సినిమాలపై మక్కువ పెంచుకున్నారు. లెజెండరీ దర్శకుడు కే వి రెడ్డి దర్శకత్వం వహించిన యోగి వేమన సినిమాలో సీత బాలనటిగా  నటించారు. కే వి రెడ్డిని ఆకర్షించిన సీత, ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన అన్నీ చిత్రాలలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేశారు. ఆయన తెరక్కించిన మాయాబజార్, గుణసుందరి కథ, పెళ్ళినాటి ప్రమాణాలు, పెద్ద మనుషులు చిత్రాలలో సీత కామెడీ రోల్స్ చేశారు. 

1940లో మొదలైన సీత నటప్రస్థానం ఆరు దశాబ్దాలకు పైగా సాగింది. 250కి పైగా చిత్రాలలో సీత నటించారు. ఒక ప్రక్క సినిమాలలో నటిస్తూనే నాటక రంగంపై కూడా ఆసక్తి కొనసాగించారు. నటుడు నాగభూషణంతో కలిసి సీత వేల నాటక ప్రదర్శనలు ఇచ్చారు. ప్రతి వారం ఎదో ఒక నగరంలో ఒక నాటక ప్రదర్శన సీత ఇచ్చేవారట.