త్రివిక్రమ్ తో చేసిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన పవన్‌  కల్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో బోనీ కపూర్‌ సమర్పణలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ‘పింక్‌’ తెలుగు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, ‘మగువా మగువా’ సాంగ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచాయి. అయితే దాదాపు రెండేళ్ల తర్వాత పవన్‌ రీ ఎంట్రీ ఇస్తున్న ‘వకీల్‌ సాబ్‌’లో చాలా హైలెట్స్ ఉన్నాయని సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ, ఆయన విలనీ కేక పెట్టిస్తుందంటున్నారు.

పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ ల మధ్య వచ్చే ఓ సీన్ మేజర్ హైలెట్ అని, అందులో ప్రకాష్ రాజ్ ని ఉద్దేశిస్తూ చెప్పే డైలాగులు యావత్ సమాజానికి ఉద్దేశించి ఉంటాయని తెలుస్తోంది. ఆ డైలాగుల్లో పవన్ మహిళా సాధికారికత, మహిళా స్వేచ్చ, భధ్రత వంటివి మాట్లాడతారని చెప్తున్నారు. ఆ డైలాగులుకు థియోటర్స్ లో టప్పట్లు మారు మ్రోగుతాయని , పవన్ ఆ డైలాగులుని నాలుగైదు వెర్షన్స్ రాయించి, ఫైనలైజ్ చేసారని చెప్పుకుంటున్నారు.
 
 నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పవన్‌ అభిమానులు, సినీ ప్రేక్షకులు కోరుకునేలా ఓ పవర్‌ఫుల్‌ లాయర్‌ పాత్రలో పవన్‌  కల్యాణ్‌గారు కనిపించబోతున్నారు. కరోనా వైరస్‌ పరిస్థితులు కాస్త చక్కబడిన తర్వాత మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేసి, సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్‌ , కెమెరా: పి.ఎస్‌. వినోద్, కో ప్రొడ్యూసర్‌: హర్షిత్‌ రెడ్డి.