హాలీవుడ్‌  స్టార్ డేనియల్‌ క్రెయిగ్‌  తాజాగా నటిస్తున్న జేమ్స్ బాండ్ 25వ చిత్రం ‘నో టైమ్‌ టు డై’. క్యారీ జోజీ పుకునాగా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఈ పాటికే రిలీజ్ అవ్వాల్సింది. కానీ కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడింది. అయితే తాజాగా ఈ సినిమాను వచ్చే సంవత్సరం ఏప్రిల్‌ 2న విడుదల చేయనున్ననట్లు చిత్ర యూనిట్ తన ట్విట్టర్లో ప్రకటించింది.

  ‘‘ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌ అన్నింట్లో మా సినిమాను చూపించాలనుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యపడేలా లేదు. అందుకే విడుదలను వచ్చే ఏడాదికి వాయిదా వేశాం’ అన్నారు నిర్మాతలు.

గతంలో ఈ చిత్రాన్ని ఈ ఏడాది నవంబర్‌ 12న యూకే, యుఎస్‌ఏలో 20న, ఇండియాలో హిందీతో పాటు నవంబర్‌ 25న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ రిలీజ్ కు కరోనా అవకాసం ఇవ్వటం లేదు. ఇప్పుడు మరోసారి వాయిదా పడటంతో జేమ్స్ బాండ్ ప్రేక్షకులు కొంత నిరాశకు లోనయ్యారు. 

ఇయాన్ ప్రొడక్షన్స్, మెట్రో-గోల్డ్విన్-మేయర్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా మైఖేల్ జి.విల్సన్, బార్బరా బ్రోకలీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో విలన్ గా రామీ మాలెక్‌ నటిస్తున్నారు. ఇంకా లాషనా లించ్, బెన్ విషా, నవోమి హారిస్, జెఫ్రీ రైట్, క్రిస్టోఫ్ వాల్ట్జ్, రాల్ఫ్ ఫియన్నెస్ తదితరులు ఇతర పాత్రలో నటిస్తున్నారు.

 'నో టైమ్ టు డై' చిత్రంలో హీరో డేనియల్ జేమ్స్ బాండ్ పాత్రలో నటిస్తున్న చిత్రకథలో ప్రస్తుతం కరోనా పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంటుందని వార్తలొచ్చాయి. ఈ భూమ్మీద ఒక భయంకర వైరస్ దాడి చేయడం దాంతో ప్రజలంతా చనిపోతారట. ఆ వైరస్ బారి నుంచి మానవాళిని జేమ్స్ బాండ్ రక్షించడం వంటి ఆసక్తికరమైన అంశాలతో సినిమా ఉండనుందని చెప్పుకొంటున్నారు.