బాహుబలి చిత్రం తర్వాత రమ్యకృష్ణ క్రేజ్ రెట్టింపు అయ్యింది. ఆమె ఫొటో పోస్టర్ పై వేస్తే టిక్కెట్లు తెగే పరిస్దితి నెలకొంది. ఈ నేపధ్యంలో వరస ఆఫర్స్ తో దూసుకుపోతోంది. అయితే కథలో కీలకమైన పాత్రలు ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. తాజాగా ఆమె సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోంది. ఇప్పుడా పాత్ర గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ పాత్ర ఇప్పటిదాకా ఆమె చేసిన క్యారక్టర్స్ ని మించి ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా దేవకట్టా తన సినిమాల్లో పాత్రలకు అదిరిపోయే నేపధ్యం క్యారక్టరైజేషన్స్ ఇస్తూంటారు. అలాగే ఈ సారి రమ్యకృష్ణ పాత్రను సైతం సినిమాకు వెన్నుపూసలా నిలిచేలా డిజైన్ చేసారని చెప్తున్నారు. 

వివరాల్లోకి వెళితే...సాయిధరమ్ తేజ్ హీరోగా ‘ప్రస్థానం’ ఫేం దేవాకట్టా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొబ్బరికాయ కొట్టి ఈ సినిమాను ప్రారంభించారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ నటిస్తున్నట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో పవర్‌ఫుల్ పొలిటీషియన్ రోల్‌లో రమ్యకృష్ణ కనిపిస్తారట. సినిమాలో ముఖ్యమంత్రిగా ఆమె కనిపించనుందిట. ఆ పాత్రలో నెగిటివ్ ఛాయిలు ఉంటాయిని చెప్తున్నారు. అంతే కాదు ఆ పాత్రను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ను గుర్తు చేస్తుందంటున్నారు. 

ఇదే నిజమైతే మరోసారి రమ్యకృష్ణ నట విశ్వరూపాన్ని వెండితెరపై చూసేయొచ్చని అభిమానులు ఆశపడుతున్నారు. కాగా, పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ ఏలూరుకు చెందిన డాక్టర్ గా కనిపిస్తారట. రమ్యకృష్ణకు, సాయి కు మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు హైలెట్ గా ఉంటాయని చెప్తున్నారు.

 జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ, రమ్యకృష్ణ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 20 నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. ఏిలూరు,కొల్లేరు లంక ప్రాంతాల్లో ఎక్కువ భాగం షూటింగ్ జరగనుంది.