అభినయ సమేత...('అరవింద సమేత' రివ్యూ)
ఎన్టీఆర్ అంత చూసుకోకుండా ఎందుకు ఉంటారు అని సమాధానపడ్డారు. ఈ లోగా ఫ్యాక్షనిజం కథ కదా..ఇప్పుడు ఫ్యాక్షనిజం కథలు ఎవరు చూస్తారు, మిర్చి సినిమాకు ఆర్డర్ వేసారంటగా..సమర సింహారెడ్డి క్లైమాక్స్ ని రిపీట్ చేసారంటగా అనే టాక్ మొదలైంది.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం చాలా కాలం నుంచి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ క్షణాలు రానే వచ్చాయి. అయితే అజ్ఞాతవాసి వంటి డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్ నుంచి వస్తున్న సినిమా కావటంతో ...ఎలా ఉండబోతోందో అనే కంగారు అభిమానుల్లో కనిపించింది. అయితే ట్రైలర్, టీజర్ తర్వాత ఓ క్లారిటీ వచ్చేసింది. త్రివిక్రమ్ మళ్లీ ఫామ్ లోకి రావటానికి ఏదో మ్యాజిక్ చెయ్యబోతున్నాడని అర్దమైంది.
అయితే ఈ లోగా పాటలు రిలీజయ్యి...అవి ఎన్టీఆర్ చిత్రాల తరహాలో లేకపోవటంతో మళ్లీ డౌట్ పడ్డారు. ఎన్టీఆర్ అంత చూసుకోకుండా ఎందుకు ఉంటారు అని సమాధానపడ్డారు. ఈ లోగా ఫ్యాక్షనిజం కథ కదా..ఇప్పుడు ఫ్యాక్షనిజం కథలు ఎవరు చూస్తారు, మిర్చి సినిమాకు ఆర్డర్ వేసారంటగా..సమర సింహారెడ్డి క్లైమాక్స్ ని రిపీట్ చేసారంటగా అనే టాక్ మొదలైంది. ఇలాంటి చిత్రమైన అనుమానాలతో ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది.
మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకుందా లేక రొటీన్ ఫ్యాక్షనిజం కథగా మిగిలిపోనుందా..త్రివిక్రమ్ తిరిగి తన సత్తా చూపించారా...ఎన్టీఆర్ ఫెరఫార్మెన్స్ ఎలా ఉంది.. అసలు కథేంటి... మళ్లీ వెనక్కి వచ్చి కమిడయన్ చేస్తున్న సునీల్ క్యారక్టరైజేషన్ ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.
స్టోరీ లైన్ ఇదే..
ఫ్యాక్షన్ గ్రూప్ లీడర్ నారపరెడ్డి(నాగబాబు) ఒక్కగానొక్క కొడుకు వీరరాఘవరెడ్డి (ఎన్టీఆర్). నారపరెడ్డికి రైవల్ గ్రూప్ ..బసిరెడ్డి (జగపతిబాబు). తన తండ్రి తన కళ్లెదుటే ఫ్యాక్షన్ హత్యకు గురికావడంతో తట్టుకోలేని రాఘవ తాను కత్తి పడతాడు . కానీ తన జేజి(సుప్రియ పాఠక్) చెప్పిన మాటలకు ప్రభావితమై ఫ్యాక్షనిజానికి తమ ప్రాంతంలో చరమగీతం పాడాలని, శాంతి నెలకొల్పానుకుంటాడు. రాఘవ శాంతి పావురాలను ఎగరెయ్యాలనుకుంటే... రక్తం రుచి మరిగిన బసిరెడ్డి వాటిని నిర్దాక్షిణ్యంగా కోసుకు తినాలనుకుంటాడు.
ఈ క్రమంలో రాఘవ .. శాంతి కోసం కొంతకాలం తన ప్రాంతం విడిచి ఓ ఆరు నెలలు దూరంగా హైదరాబాద్ లో ఎవరికీ తెలియని ప్రాంతంలో ఓ అనామకుడిలా ఉండాలనుకుంటాడు. ఓ లాయర్ (పెద్ద నరేష్) ఇంట్లో ఉంటాడు. అక్కడ అరవింద (పూజ హెగ్డే) పరిచయం అవుతుంది. ఆమె రాయలసీమ ఫ్యాక్షనిజంపై డాక్యుమెంటరీ చెయ్యాలనుకుంటుంది. అయితే రాఘవ అటువంటి ఫ్యాక్షన్ కుటుంబాల నుంచి వచ్చినవాడు అని ఆమెకు తెలియదు. అయితే ఈ లోగా .. రాఘవ చేసిన చిన్న పొరపాటుతో అతను ఎక్కడున్నాడో ప్రత్యర్దులకు తెలిసిపోతుంది.
అప్పుడు వాళ్లు రంగంలోకి దిగుతారు. రాఘవకు ఆశ్రయం ఇచ్చిన అరవింద ఫ్యామిలిపై పడతాడు. అప్పుడు రాఘవ ఏం చేసాడు. బసి రెడ్డిలో మార్పు వచ్చిందా.. సీమలో శాంతి స్దాపన జరిగిందా... అరవిందకు అసలు తను ప్రేమికుడు ఓ ఫ్యాక్షన్ ఫ్యామిలీకి చెందిన వాడు అనే విషయం తెలిసి రాఘవను ఏక్సెప్టు చేసిందా, ఈ కథలో సునీల్ పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఫస్ట్ థింగ్స్..ఫస్ట్...
ఈ సినిమాలో ఎన్టీఆర్ మాత్రం మాస్ గా చెప్పుకోవాలంటే ఇరక్కొట్టాడనే చెప్పాలి. తన అభినయ సామర్ద్యంతో తెరపై చెలరేగిపోయాడు. స్టార్ ని ప్రక్కన పెట్టి నటుడిని బయటకు తెచ్చిన త్రివిక్రమ్ సాహసానికి మెచ్చుకోవాలి. టెంపర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఆ స్దాయిలో అద్బుతంగా చేసాడు. గుండెల నిండా విషాదం పెట్టుకుని ... దాన్ని తనలోనే దాచుకునే ప్రయత్నం చేస్తూ... పగవాడి ప్రాణాలు కూడా ప్రాణాలే అని ముందుకు వెళ్లే పాత్రలో జీవించాడు. అందుకే ఈ సినిమా .. ఎన్టీఆర్ కు అభినయ సమేత.
ఫన్ మిస్సైంది..
సాధారణంగా త్రివిక్రమ్ సినిమా అంటే...ఫన్, పంచ్ డైలాగులు ఆశిస్తాం.
పూర్తి సీరియస్ డ్రామాగా కథ,కథనం నడపటంతో ...ఎక్కడా రిలీఫ్ అన్నది లేకుండా పోయింది. అక్కడికీ సునీల్ ని సీన్ లోకి తెచ్చారు కానీ.. అతన్ని ఫన్ యాంగిల్ లో పెద్దగా వాడుకోలేదు. కథలో కలిపేసుకున్నారు. ఆ విషయం కొద్దిగా నిరాశపరుస్తుంది.
స్క్రీన్ ప్లే ...
సింగిల్ పాయింట్ ఎజెండాతో సినిమా సాగుతుంది. సబ్ ప్లాట్ లు లేకుండా మొదలెట్టిన పాయింట్ చుట్టూనే చివరి వరకూ తిరిగేలా స్క్రీన్ ప్లే ని డిజైన్ చేసారు.‘వాడిదైన రోజున ఎవడైనా కొట్టగలడు. అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పోడు’ అన్న పాయింట్ ని కథలో మెయిన్ గా పెట్టుకుని సంఘటనలు రాసుకున్నారు. ఇప్పటికే చాలా ఫ్యాక్షన్ సినిమాలు.. శాంతి కావాలంటూ తెలుగులో వచ్చాయి. అయితే వాటికి, ఈ సినిమాకు తేడా..... పూర్తి సీరియస్ టోన్ లో రియలిస్టిక్ ఎప్రోచ్ తో కథ చెప్పటమే. ఫ్యాక్షనిస్ట్ లు తమ పెళ్లాం, బిడ్డలు గురించి ఆలోచించమంటూ ఈ సినిమా సందేశం ఇస్తుంది.
అదిరిపోయింది
ఇక ఈ సినిమా ప్రారంభం మొదటి ఇరవై నిముషాలు స్టైల్ గా .. ఎక్సలెంట్ గా డిజైన్ చేసారు. రామ్ లక్ష్మణ్ లు మొదటి ఫైట్, ఇంటర్వెల్ ఫైట్ దుమ్ము రేపారు. అయితే ఆ స్దాయి ఎమోషన్, ఫైట్ చూసిన తర్వాత .. మిగతా కథ ఫ్యామిలికు షిప్ట్ అవటంతో తేలినట్లు అనిపించింది.
అలాగే... అరవింద సోదరుడిని కిడ్నాప్ జరిగినప్పుడు కేవలం ఒకే ఒక్క ఫోన్ కాల్ తో ఎదుటివారిలో భయం పుట్టించటం అనేది ఏ మాత్రం తేడా కొట్టినా కామెడీ అయ్యిపోతుంది.. తేలిపోతుంది. కానీ ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఆ సీన్ ని చాలా జాగ్రత్తగా డీల్ చేసి పండించారు.
విలనిజం...క్లైమాక్స్ కే..
ఇలాంటి యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాల్లో విలన్ పాత్రను హైలెట్ చేస్తూంటారు. జగపతిబాబు పాత్ర గెటప్, లుక్ చాలా క్రూరంగా డిజైన్ చేసారు కానీ ..సినిమా ప్రారంభంలోనే ... విలన్ ని పడుకోపెట్టేసారు. దాంతో విలన్ కు, హీరోకు క్లైమాక్స్ దాకా ఎదురుపడి మాట్లాడుకోవాల్సినంత పని ఉండదు. ఈ కథ ప్రకారం అదే కరెక్టేమో.
దెబ్బతింటారు
ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమా కదా అని .. ‘ఆది’, ‘సింహాద్రి’, ‘సాంబ’ స్దాయిలో .. ఎన్టీఆర్ పాత్రను ఊహించుకుని వెళితే దెబ్బ తింటారు. ఎమోషన్ తో మిక్స్ అయిన సినిమా అని అర్దం చేసుకుని చూడాలి.
టెక్నికల్ గా ..
త్రివిక్రమ్ సినిమాలు తొలి నుంచి టెక్నికల్ గా స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. అందుకు ఈ సినిమా ఏమీ మినహాయింపు కాదు. అలాగే ఈ సినిమాకు పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ ఓ కొత్త లుక్ తెచ్చింది. ఎన్టీఆర్‌ను డిఫెరెంట్ గా చూపించటం, ,యాక్షన్ ఎపిసోడ్స్ కొత్తగా అనిపించటానికి సినిమాటోగ్రఫీ చాలా కలిసొచ్చింది. త్రివిక్రమ్ మాటలు ఈ సారి మరింత రాటు తేలి... హృదయాలను హత్తుకునేలా ఉన్నాయి.
పాటల గురించి ఓ మాట..
పాటల్లో ... ‘అరవింద తన పేరు…’, ‘రెడ్డి ఇంకా చూడు‘జస్ట్ ఓకే అన్నట్లున్నాయి. పెనిమిటి పాట మాత్రం రిలీజ్ కు ముందు...మగవాడు..పెనిమిటి అని పాడటం అనే విమర్శలు ఎదుర్కొంది. ఆ పాట సినిమాలో వచ్చే సిట్యువేషన్ తో ఫెరఫెక్ట్ గా సింక్ అయ్యింది. ఇక తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది.
ఫైనల్ ధాట్
ఇది వన్ .. అండ్ ఓన్లీ ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో.
ఓవరాల్ రేటింగ్ : 3/5
నటీనటులు: ఎన్టీఆర్, పూజాహెగ్డే, జగపతిబాబు, సునీల్, నాగబాబు, ఈషారెబ్బ, సుప్రియ పాతక్, నవీన్ చంద్ర, దేవయాని, సితార, బ్రహ్మాజీ, రావు రమేష్ తదితరులు
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: పీఎస్ వినోద్
ఎడిటర్: నవీన్ నూలి
స్టంట్స్: రామ్-లక్ష్మణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పీడీవీ ప్రసాద్
నిర్మాత: ఎస్.రాధాకృష్ణ(చినబాబు)
దర్శకత్వం: త్రివిక్రమ్
బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్స్
విడుదల తేదీ: 11-10-2018
సంబంధిత వార్తలు
యూఎస్ ప్రీమియర్ షో టాక్: అరవింద సమేత
'అరవింద సమేత' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!
అరవింద సమేత కోసం స్పెషల్ హాలిడే ఇచ్చేశారు!
‘అరవింద సమేత’విడుదల.. టీడీపీ, వైసీపీ గొడవ