బాలీవుడ్ లో కొనసాగుతున్న డ్రగ్స్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారగా అధికారులు మరింత లోతుగా విచారణ సాగిస్తున్నారు. తాజాగా ఈ డ్రగ్స్ కేసులో శృతి మోడీ, మరియు జయ సాహాలకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు నోటీసులు జారీ చేశారు. వీరిని నేడు విచారణకు హాజరు కావలసినదిగా ఆదేశించడం జరిగింది. దీనితో నేడు శృతి మోడీ, జయ సాహాలు విచారణకు హాజరుకానున్నారు. శృతి మోడీ గతంలో సుశాంత్ మేనేజర్ గా పనిచేశారు. అలాగే జయ సాహా టాలెంట్ మేనేజర్ గా వ్యవహరించారు. వీరికి కూడా డ్రగ్ వ్యవహారంలో సంబంధం ఉందని తెలుస్తుంది. 

గత మంగళవారం అరెస్ట్ కాబడిన రియా చక్రవర్తికి వీరికి దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కొనుగోళ్లు మరియు సుశాంత్ సింగ్ కి అందించడం వంటి విషయాలపై వీరిని విచారణ చేయనున్నారు. వీరిద్దరికి డ్రగ్ ఫెడ్లర్ లతో సంబంధాలు ఉన్నాయని విచారణలో తేలిన నేపథ్యంలో అరెస్ట్ చేసే అవకాశం కలదు. ఇప్పటికే ఈ కేసులో రియాతో పాటు, ఆమె తమ్ముడు షోవిక్ అరెస్ట్ కబడ్డారు. మరో 15 మందిని కూడా అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. 

ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న రియా అధికారుల విచారణలో పాల్గొంటున్నారు. బాలీవుడ్ కి చెందిన అనేక మంది పేర్లు ఈమె బయటపెట్టారన్న వార్తలు సంచలనం రేపాయి. సారా అలీఖాన్ మరియు రకుల్ ప్రీత్ కూడా డ్రగ్స్ వాడారని ఆరోపణలు రాగా అందులో ఎటువంటి నిజం లేదని అధికారులు స్పష్టత ఇచ్చారు. ఇక డ్రగ్స్ కేసు రాజకీయంగా కూడా పెద్ద దుమారం రేపుతోంది.