కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా సెల్ఫ్ క్వారంటైన్ పాటించాలి. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు మణిరత్నం, సీనియర్‌ నటి సుహాసినిల కుమారుడు నందన్‌ మణిరత్నం అదే చేస్తున్నారు. ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు.

 కొద్దిరోజుల క్రితం లండన్‌ నుంచి వచ్చిన ఆయన కరోనా వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షలో కరోనా నెగిటివ్‌ వచ్చినప్పటికి బాధ్యతగా వ్యవహరించి తనకు తాను స్వీయ నిర్బంధం విధించుకున్నారు. తమ ఇంట్లోని ఓ ప్రత్యేక గదిలో ఉండిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినీ నటి ఖుస్భూ ఆ వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

ఆ వీడియోలో స్వీయ నిర్బంధంలో ఉన్న నందన్‌తో తల్లి సుహాసిని గ్లాస్‌ విండో ద్వారా మాట్లాడిన దృశ్యాలు ఉన్నాయి. ‘  బాధ్యత కలిగిన వ్యక్తులు చేసే పనిది. సుహాసిని, నందన్‌మణిరత్నాలకు నా అభినందనలు. వీరి నుంచి నేర్చుకోవల్సింది చాలా ఉంది. నీ స్వీయ నిర్బంధం చక్కగా గడవాలని కోరుకుంటాన్నా’నని ఖుష్భూ పేర్కొన్నారు.