ప్రముఖ కన్నడ దర్శకుడు విజయ్‌ రెడ్డి(84) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. పలు అనారోగ్య కారణాలు, వయోభారంతో చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని విజయ్‌రెడ్డి కుమారుడు త్రిపాన్‌రెడ్డి శనివారం వెల్లడించారు. కన్నడలో దాదాపు నలభైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన తెలుగు వారు కావడం విశేషం. ఆంధ్ర్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి తాడెపల్లి గూడెంలో జన్మించారు. సినిమాలపై ఆసక్తితో 1953లో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 

మొదట ప్రముఖ దర్శకుడు బి.విఠలాచార్య చిత్రం `మానే తంబిండా హెన్నూ`కి అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత దర్శకుడిగా మారారు. ఆయన తీసిన `గాంధడ గుడి`, `నా నిన్న బిదాలారే`, `రంగమహాల్‌ రహస్య`, `శ్రీనివాస్‌ కళ్యాణ`, సనాడి అప్పన్న`, `కర్ణాటక సుపుత్ర` వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు. చివరి సారిగా ఆయన 1996లో కన్నడ సూపర్‌ స్టార్‌ విష్ణువర్థన్‌ హీరోగా `కర్ణాటక సుపుత్ర`కి దర్శకత్వం వహించారు. అది సూపర్‌ హిట్‌గా నిలిచింది. 

ఇదిలా ఉంటే విజయ్‌ రెడ్డి 16 హిందీ సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు. కన్నడలో `మయుర`, `భక్త ప్రహ్లాద`, `కౌ బాయ్‌ కులా`, `ఆటో రాజా` వంటి చిత్రాలు కూడా ఆయనకు దర్శకుడిగా మంచి పేరుని తీసుకొచ్చాయి.  కన్నడలో దాదాపు 37కి పైగా చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. 

`గంధద గుడి` సినిమాను ఎన్టీఆర్ హీరోగా `అడవి రాముడు`గా కే.రాఘవేంద్రరావు తెలుగులో రీమేక్ చేసారు. కన్నడలో చరిత్ర సృష్టించిన ఈ మూవీ.. తెలుగులోనూ సంచలన విజయం సాధించింది. కన్నడలో మాస్ స్టైలిష్ దర్శకుడిగా విజయ్ రెడ్డికి మంచి పేరు ఉంది. ఈయన కన్నడ కంఠీరవుడు రాజ్‌కుమార్‌తో దాదాపు తొమ్మిది సినిమాలు తెరకెక్కించాడు. అందులో రెండు సినిమాల్లో శివ రాజ్ కుమార్ అతిథి పాత్రలో నటించడం విశేషం. అంతేకాదు రాజ్ కుమార్ కుమారుడు శివరాజ్ కుమార్‌తో కూడా పలు సినిమాలను తెరకెక్కించాడు. ఈయన తెరకెక్కించిన పలు చిత్రాలను ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి పలువురు అగ్ర హీరోలు తెలుగులో రీమేక్  చేసారు.

విజయ్‌ రెడ్డి మరణవార్త కన్నడ పరిశ్రమకు కలచివేస్తోందంటూ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ప్రముఖ సూపర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ స్పందించి సంతాపం తెలిపారు. `విజయ్‌ రెడ్డి నాన్నగారు శివరాజ్‌ కుమార్‌తో మరిచిపోలేని సినిమాలు రూపొందించారు. అందులో `గంధడగూడి`, `మయూర`, `నా నీ నాల్‌`, `హలవారా` అందులో ప్రముఖంగా చెప్పుకోవచ్చు. `భక్త ప్రహ్లాద`లో నేను కూడా నటించాను. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నా` అని తెలిపారు.