ప్రపంచమంతా కరోనా భయంతో వణికిపోతోంది. ఇప్పడిప్పుడే ప్రజలు కరోనాతో కలిసి జీవించేందుకు ధైర్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ సమయంలో ప్రముఖుల ఇంట్లో కరోనా పాజిటివ్‌ అంటూ వస్తున్ వార్తలు కలవరపెడుతున్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌ బోని కపూర్‌ ఇంట్లో పనిచేసే వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ విషయాన్ని బోని కపూర్‌ స్వయంగా వెల్లడించాడు. తన ఇంట్లో పనిచేసే చరణ్ సాహో అనే వ్యక్తికి శనివారం నుంచి అనారోగ్యంతో ఇబ్బంది పడుతుండటంతో అతన్ని క్వారెంటైన్‌లో ఉంచి టెస్ట్‌లు చేయించినట్టుగా బోని వెల్లడించారు.

అయితే తాజాగా అతని టెస్ట్ రిపోర్ట్‌లలో కరోనా పాజిటివ్‌ అని రావటంతో సోసైటీ సభ్యులు బృహన్ ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌కు సమాచారం అందించినట్టుగా తెలిపారు. వెంటనే మున్సిపల్ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా అతన్ని క్వారెంటైన్‌కు తరలించే చర్చలు చేపట్టారు. ప్రస్తుతం తను, తన పిల్లలతో పాటు ఇంట్లో పని చేస్తున్న ఇతర పని వారు అంతా బాగానే ఉన్నామని వెల్లడించారు. ఎవరికీ కరోనా లక్షణాలు లేవని.. అయినా ముందు జాగ్రత్తగా హో క్వారెంటైన్‌లో ఉంటున్నామని వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌ సంస్థతో పాటు మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశాడు. అదే సమయంలో చరణ్‌ త్వరగా కోలుకొని తిరిగి తమ ఇంట్లోకి రావాలని ఆకాంక్షించాడు. గతంలో మరో ప్రముఖ నిర్మాత కరిం మోరానీతో పాటు ఆయన ఇద్దరు కూతుళ్లకు కూడా కరోనా పాజిటివ వచ్చిన సంగతి తెలిసిందే.