సినీ హీరో అల్లు అర్జున్‌ శనివారం  కుంటాల జలపాతాన్ని సందర్శించటం ఇప్పుడు వివాదంగా మారుతోంది. కుటుంబ సభ్యులు, చిత్ర నిర్మాణ టీమ్ సభ్యులతో కలిసి కుంటాల జలపాతం అందాలను ఆయన చూసారు. జలపాతం వద్ద సినిమాల షూటింగ్ కు అనువైన ప్రదేశాలను గుర్తించారు. అనంతరం ఆదిలాబాద్‌ పట్టణ శివారులోని మావల హరితవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్మృతివనంలో ఎర్రచందనం మొక్కను నాటారు. ఎంతగానో ఆకట్టుకున్న ఆదిలాబాద్‌ జిల్లా అందాలను ఎప్పటికీ మరువలేనివని అల్లు అర్జున్‌ అన్నారు. 

 అయితే, కరోనా నేపథ్యంలో పర్యాటకులను అనుమతించని అధికారులు.. ప్రముఖులకు మాత్రం మర్యాదలు చేయడం ఏమిటన్న విమర్శలు స్థానికుల నుంచి వస్తున్నాయి. ఈ మేరకు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇటీవల నిర్మాత దిల్‌ రాజు కుటుంబంతో పాటు కుంటాల జలపాతాన్ని సందర్శించారు. 

జలపాతం వద్ద పర్యాటకులను అనుమతించని అటవీ శాఖ అధికారులు సెలబ్రిటిలు, ప్రముఖులకు మాత్రం దగ్గరుండి జలపాతం అందాలను చూపించడం ఏమిటని కూడా ప్రశ్నలు సైతం సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతంగా పేరొందిన ఆదిలాబాద్‌ జిల్లాలోని కుంటాల జలపాతం. వీరికి అనుమతి వెనుక అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ఆదేశాలున్నట్లు తెలుస్తోంది. 

ఇక అల్లు అర్జున్ తాజా చిత్రం 'పుష్ప' షూటింగ్ మరోసారి వాయిదాపడినట్టు తాజాగా వార్తలొస్తున్నాయి. 'అల వైకుంఠపురములో' సినిమా సాధించిన విజయం తరవాత అల్లు అర్జున్ తన తదుపరి చిత్రమైన 'పుష్ప'ను సుకుమార్ దర్శకత్వంలో షురూ చేశాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ కావడంతో ఈ చిత్రం షూటింగును కేరళ అడవులలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో లాక్ డౌన్ రావడంతో ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడింది.