ఈ విషయం తెలుసా మీకు ?

why people often share secrets with strangers

ఎప్పుడైనా మీరు ఊహించని విధంగా అపరిచితులకు మీ రహస్యాలను  వెళ్లడించడం జరిగిందా? 

అతి సన్నిహితులతో తప్ప మాట్లాడని మీ ఆంతరంగిక విషయాలు ముక్కూ మొఖం తెలీని వారితో పంచుకోవడం జరిగిందా?

 

కొన్ని సార్లు మనకు తెలీకుండానే మనం ఇంతకు ముందు అంతగా పరిచయం లేని వ్యక్తులతో కానీ, పూర్తిగా అపరిచితులతో కాని మన రహస్యాలనూ, అతి సన్నిహితుల్తో కూడా పంచుకోని కొన్ని ఆంతరంగిక విషయాలనూ, పంచుకుంటాం. ఇదంతా మనకు తెలీకుండా జరిగిపోతుంది. ఆ తరువాత నేనెందుకలా మాట్లాడాను? ఎందుకా విషయాలన్నీ చెప్పాను? అని పాశ్చాత్తాప పడటం కూడా జరగొచ్చు.

 

ఇది వైపరీత్యమేమీ కాదు. ఇలా జరగటం సాధారణమేనని మానసిక శాస్త్రం చెబుతోంది.  ఈ ప్రక్రియ మీద పరిశోధనలు జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి.  ఒకరికి తెలిసిందంతా  మరొకరితో పంచుకోవడానికి కాకుండా, ఏకరీతిగా అలొచించే వ్యక్తుల సాహచర్యం అవసరమై రహస్యాలు దాచుకున్నఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు దగ్గరవుతారు.

 

సిగ్మండ్ ఫ్రాయిడ్ మాటల్లో, “చూడటానికి కళ్లూ, వినడానికి చెవులూ వున్న వాడెవడైనా సరే, మనుష్యులు రహస్యాలని దాచలేరని తనకు తాను నచ్చ చెప్పుకోవచ్చు. పెదాలు నిశ్శబ్దంగా వుంటే   వ్రేళ్లకొసలు వదురుతాయి. శరీరం లోని ప్రతి సూక్ష్మ రంధ్రం ద్వారా  రహస్యం  బయటికి  కారి, బట్టబయలవుతుంది”    

 

ఆపరిచితులతో మనం ఆంతరంగిక విషయాలు ఎందుకు పంచుకుంటాం?

 

ప్రతి వ్యక్తి చుట్టూ కొంతమేర కనిపించని ఒక బుడగలా ఓ వ్యక్తిగత ప్రదేశం ఉంటుంది.  ఈ ప్రదేశంలో కి అత్యంత సన్నిహితులకు మాత్రమే ప్రవేశముంటుంది. వారు మాత్రమే ఆ స్థలం లోకి జొరబడగలరు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంటే క్రిక్కిరిసి వున్న బస్సుల్లో,  విమానాల్లో,  రైళ్లలో, పక్క పక్క సీట్లలో, ఒకరి నొకరు తాకుతూ కూర్చొని ప్రయాణం చేస్తున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు బాహ్యంగా దగ్గరి కొస్తారు.  ఈ సాన్నిధ్యం ఒక కృత్రిమమైన ఆత్మీయతా భావాన్ని కలిగిస్తుంది. సాధారణంగా మనకు భౌతికంగా అంత దగ్గరగా వచ్చేవారు మనం ప్రేమించే సన్నిహితులే అయి వుంటారు.

 

ఈ భావం అంతవరకూ మన లో వున్న సంకోచాన్నీ దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రదేశపు పహారాని, భద్రతా కవచాన్ని మనం వదిలేస్తాం. మనకు తెలీకుండానే అవతలి వారిని  మన వ్యక్తి గత ప్రదేశం లోకి జొరబడే అవకాశాన్ని కలుగ చేస్తాం. ఆంతరంగిక విషయాలు చెప్పడం మొదలు పెడతాం.  ఇటువంటి కృత్రిమ ఆత్మీయతా భావం మనకు కేశాలంకరణ చేయించుకుంటున్నప్పుడు బ్యూటీ పార్లర్లలో, మసాజ్ సెంటర్లలో లేదా మనల్ని భౌతిక పరీక్ష చేస్తున్న డాక్టర్ల  వద్దా కలిగే అవకాశాలెక్కువ. 

 

కొన్ని సార్లు ఎదుటి అపరిచిత వ్యక్తి తన ఆంతరంగిక విషయాలు మనతో పంచుకోవడం మొదలు పెట్టినపుడు మనకు తెలీకుండానే మనం కూడా మన ఆంతరంగిక విషయాలు చెప్పడం మొదలుపెడతాం.  మనం గమనించి సర్దుకునే లోపే ఎన్నో విషయాలు అవతలి వారికి చెప్పేసి వుంటాం.  దీన్ని “పరస్పరత్వపు మర్యాద” గా వ్యవహరించ వచ్చు. అంటే అవతలి వ్యక్తి పై సానుభూతి  చూపిస్తూ, ఆ వ్యక్తి కి దగ్గర కావడం లోని భాగంగా మన రహస్యాలు, ఇచ్చి పుచ్చు కోవడమన్న మాట.   ఇదొక వలయం.  దీంట్లో ఒకరి గురించిన ఆంతరంగిక విషయాలు మరొకరికి తెలుపుకోవడం లో ఇరువురూ ఎంత దూరమైనా వెళ్లవచ్చు.

 

మన లాంటి నేపధ్యం, పోలికా, ఆలోచనలూ, ఇష్టా యిష్టాలు కల్గి వున్న వ్యక్తులు తారస పడినప్పుడు  వారి సాన్నిధ్యం లో మనం సౌకర్యవంతంగా వుంటామన్న ధోరణి కలుగుతుంది. అటువంటి వ్యక్తుల్ని మనం త్వరగా నమ్ముతాం. ఆ వ్యక్తితో మనకేదో ఒక అనిర్వచనీయమైన బంధం వుందనిపిస్తుంది.  ఈ భావం పరదేశం లో మనదేశస్థులను కలిసినప్పుడు, ఒక క్రొత్త ప్రదేశం లో మన జాతి, మతం, కులం, లేదా ప్రదేశానికి చెందిన వారిని కలిసినప్పుడు ఎక్కువగా వుంటుంది.    అంతవరకూ ఎవరితోనూ చెప్పుకోని ఆంతరంగిక సమాచారాన్ని ఆ వ్యక్తి తో పంచుకోవడం మొదలెడతాం.  దీన్ని “సాదృశ్య  పక్షపాతం” గా వ్యవహరించవచ్చు.   

 

చాలా మంది ఇటువంటి సంభాషణల అనంతరం ఎక్కువగా పశ్చాత్తాప పడుతూ వుంటారు. ఇటువంటి సంఘటనలు సాధారణమనుకుని వీటి గురించి ఎక్కువగా ఆలోచించకుండా వుంటే సరి. లేదా తరచు ఇలాంటి సంఘటనలు జరిగి మనల్ని కృంగదీస్తున్నాయనుకుంటే అపరిచిత వ్యక్తుల్తో సాధ్యమైనంత బాహ్య దూరాన్ని కొనసాగించాలి. అప్పుడు, కృత్రిమ సాన్నిహిత్యాన్ని నిరోధించవచ్చు. 

 

అయితే ఇది తెచ్చి పెట్టుకున్న ప్రవర్తనలాగా కాకుండా మామూలుగానే వున్నట్లు చూసుకోవాలి.  ఒక వేళ అటువంటి అవకాశం లేదనిపిస్తే మనతో ఆంతరంగిక విషయాలు చెప్పుకునే వ్యక్తి తో మానసిక దూరాన్నికొనసాగించాలి. విషయాలు విని వూరికే వుండిపోవాలి. మనం కూడా ఏదైనా ఆంతరంగిక విషయం చెప్పాలి అనుకోకూడదు. సంభాషణ వ్యక్తిగత విషయాల వైపు సాగుతోందనిపిస్తే చర్చిస్తున్న విషయాన్ని మార్చాలి. లేదా సంభాషణను ముగించాలి. అయితే మనం ముభావంగా వున్నమని పించరాదు. దీనికి చాలా జాగ్రత్త,  ఏకాగ్రత అవసరం.

 

అపరిచిత వ్యక్తులతో ఇలా మాట్లాడితే వచ్చే నష్టమేమీ లేదని చర్చ జరుగుతోంది. కారణమేమిటంటే, పంచుకున్న విషయాలు బయటికి తెలిసే అవకాశాలు తక్కువ. అపరిచిత వ్యక్తులు అపరిచిత వ్యక్తులే. వారు శోధించి మన జాడ తెలుసుకుని వచ్చి ఆ విషయాలను మనకు వ్యతిరేకంగా ఉపయోగించి హాని కలిగించే అవకాశం లేదు.  అయితే ఇది బాగా పరిచయమున్న వ్యక్తుల విషయం లో నిజం కాక పోవచ్చు. అందుకే మనం అలాంటి విషయాలని ఆప్తుల  వద్ద దాచి పెడతాం.  ఇంకో విషయమేమిటంటే ఇలాంటి విషయాలు బయటికి చెప్పుకున్నప్పుడు ఎంతో ఊరట కలుగొచ్చు.