తిరుమల ఆలయంలో అసలు 'ఉత్తర ద్వారమే' లేదా ?

There is no north door to Tirumala temple

ఉత్తర ద్వారం లేని ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం . అద్భుతమా ? అపచారమా?

 

ఈరోజు "వైకుంఠ ఏకాదశి"... సమస్త వైష్ణవాలయాలన్నీ భక్తకోటితో కిటకిటలాడుతూ ఉంటాయి.. ఉత్తరద్వారం ద్వారా ఆ నారాయణుణ్ణి తప్పక దర్శించుకోవాలన్న భక్తుల తాపత్రయం ఓపక్క, ఏమేం చేయాలి - ఎలా చేయాలి - ఎప్పుడు చేయాలి, నారాయణుడికి ఏది ప్రీతికరం తదితర అంశాలతో టి‌వి‌ల్లో ప్రవచనకర్తల హడావిడి మరోపక్క. 

 

ఈ "వైకుంఠ ద్వారం - లేదా ఉత్తర ద్వారం" అన్నదానిపై పలు పురాణ కథలు ఉన్నాయి. చాలావరకూ వైష్ణవాలయాల్లో ఈ "ఉత్తరద్వారం/ఉత్తర గోపురం" అన్నది ఉత్తరం వైపుగా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరద్వారం ద్వారా విష్ణుమూర్తిని దర్శించుకొంటే సకలపాపహరణం జరుగుతుందనీ, ఆ వైకుంఠాన్నే చుట్టేసినట్లనీ పెద్దలు చెబుతారు. 

 

 మరి,అసలు "కలియుగ వైకుంఠం" అయిన "తిరుమల క్షేత్రంలోని" ఆలయంలో ఈ "ఉత్తరద్వారం" ఉందా

 

"ఉత్తర ద్వారం" అంటే ఉత్తరం వైపున ఉండే ద్వారమే కదా ??? మరి "తిరుమల ఆలయంలో" అలాంటి ద్వారమేదీ లేనేలేదు కదా..!!

.

అసలు "ఉత్తర ద్వారమే లేని" తిరుమల ఆలయంలో, "ఉత్తరద్వార దర్శనం" పేరిట ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎందుకింత హడావిడి చేస్తున్నారు ??? 

 

 మిగతా రోజుల్లో మూసిఉండి, వైకుంఠ ఏకాదశి/ద్వాదశి రోజుల్లో మాత్రమే తెరిచే "ఉత్తర ద్వారం లేదా వైకుంఠ ద్వారం" పేరిట భక్తులను ప్రదక్షణ చేయిస్తున్న ఈ ప్రదక్షిణ మార్గాన్ని "ఉత్తర ద్వారం" అంటూ పిలవడం ఎంతవరకూ సమంజసం ???

 

ఉన్న వాస్తవం చెప్పబుతున్నాను.. నామీద మీ దాడి మొదలుపెట్టబోయేముందు ఒక్క రెండుముక్కలు చెబుతాను.. చదివి, ఆపై మీ ఇష్టం..!

 

సనాతన ధర్మం పట్లా - తిరుమల వెంకన్న పట్లా నాకున్న అపరిమితమైన విశ్వాసానికి మీ సర్టిఫికేట్ నాకు అవసరం లేదు. 

 

అలాగే, తిరుమల క్షేత్ర ప్రాశస్త్యాన్నీ - తిరుమల ఆలయ విశేషాలనూ - తిరుమల చరిత్రనూ - తిరుమల ఆలయ నిర్మాణ పరిణామక్రమాన్నీ - తిరుమల ఆలయ సాంప్రదాయాలనూ - ఆలయంలో జరిగే కైంకర్యాలనూ - ఆలయ పాలనా వ్యవహారాలనూ - ఆర్జిత సేవల విశేషాలనూ - లెక్కకుమిక్కిలిగా ఉన్న దర్శనాల వివరాలనూ - ఆఖరికి, అక్కడ జరుగుతున్న అవినీతినీ, అవ్యవస్థలనూ అవగాహన చేసుకొన్నవాడిని.  - కాబట్టి, నేనేమీ అవివేకంతోనో, అవగాహనా రాహిత్యంతోనో ఈ పోస్ట్ రాయడం లేదు. 

 

ఆలయంవాళ్ళు చెబుతున్న "ఉత్తర ద్వారం లేక వైకుంఠ ద్వార మార్గం" అన్నది విమాన ప్రదక్షిణంలో, దక్షిణంవైపునున్న "బంగారు బావి"కి అభిముఖంగా ఉంటుంది. ఈ ద్వారం, ఆలయంలోపల, స్నపన మండపం దాటగానే వచ్చే "రాములవారి మేడ"కు సమాంతరంగా ఉంటుంది. బేసిగ్గా ఇది ఒక ప్రదక్షిణా మార్గం. దక్షిణంవైపునున్న ద్వారంగుండా ఈ మార్గంలో ప్రవేశిస్తే, ఉత్తరంవైపునున్న మరొక ద్వారంగుండా శ్రీవారి హుండీ దగ్గర బయటికి దారితీస్తుంది. గర్భాలయానికి ఆనుకొని ఉన్నందున దీన్ని "వైకుంఠ ప్రదక్షిణ మార్గం" అంటారు. 

 

ఇకపోతే, ఈ మార్గం అన్నివైపులా ఒకే కొలతలతో సమానంగా ఉండదు. దక్షిణం వైపున ఉన్న మార్గం దాదాపు 70 అడుగుల పొడవు - 8 అడుగుల వెడల్పుతో ఉంటుంది. అదే ఉత్తరంవైపున మాత్రం 77 అడుగుల పొడవు - షుమారు 18 అడుగుల వెడల్పు ఉంటుంది.  ఇక ప్రదక్షిణామార్గంలో మూడువైపులా స్థంబాలున్నాయి. 

 

ఈ ప్రదక్షిణామార్గంలో ఉత్తరంవైపున ఉన్న విశాలమైన ప్రాంతంలో పూర్వం "స్వామివారి ఉత్సవ మూర్తులకు ఆస్థానంకొలువు వగైరా సేవలు జరిపేవారని తెలుస్తుంది. ఈ ప్రదక్షిణా మార్గం నిర్మించిన తీరును బట్టిచూస్తే ఇది "ఉత్తరద్వారం" అన్న కాన్సెప్ట్ కు సంబంధంలేనివిధంగా అనిపిస్తుంది. ఈ ప్రదక్షిణ మార్గం ఉన్న తీరునుగనక గమనిస్తే ఈ మార్గంలోనికి ప్రవేశించే ద్వారం ఉన్నది "తూర్పువైపున" - అలాగే, ఈ మార్గం నుండి బయటికిదారితీసే ద్వారం ఉన్నది కూడా "తూర్పు వైపునే".... మరలాంటప్పుడు 

 

రెండు ద్వారాలూ తూర్పుననే ఉన్న ఈ మార్గం "ఉత్తరద్వారం" ఎలా అవుతుంది తిరుమలేశా ???

 

 

పోనీ, "వైకుంఠ మార్గం" అన్నారు అనుకొన్నా, ఒక్కొవైపూ ఒక్కొరీతిన నిర్మించిన ఈ మార్గాన్ని, "కేవలం గర్భాలయానికి ఆనుకొని ఉంది" అన్న ఒక్క కారణంతోనే అసలు ప్రదక్షిణ కూడా పూర్తికాకుండానే "వైకుంఠ మార్గం" అనేస్తారా ??? 

 

దీన్నిబట్టి మనకు అర్థమయ్యేదేమిటంటే, "కలియుగ వైకుంఠమైన తిరుమల ఆలయంలో అసలు ఉత్తర ద్వారం అనేది లేనేలేదు" అని..!! 

 

మరలాంటప్పుడు, మరే ఇతర ప్రత్యేకతా లేని ఈ మార్గాన్ని, మిగతారోజుల్లో కూడా తెరిచిఉంచి, భక్తులకు ఆ దేవదేవుడి గర్భాలయ ప్రదక్షిణ  భాగ్యం కల్పిస్తే తప్పేముంది ??? 

 

అబ్బే, అదెలా కుదురుతుందీ, అందరినీ ప్రతిరోజూ అలా పంపిస్తే, ఆ మార్గంలో జామ్ అయిపోయి, దర్శనసమయం వృధా అయిపోయి, ఎక్కువమంది భక్తులు దర్శనం చేసుకొనే వీలుకలగదు అంటారా ??? మరలాంటప్పుడు, మిగతారోజులకంటే ఎన్నోరెట్లు ఎక్కువమంది భక్తులు వచ్చే ఈ "వైకుంఠ ఏకాదశి" రోజున మాత్రం "ఉత్తర ద్వారం లేక వైకుంఠ మార్గం" అనబడే మార్గం ద్రారా పంపితే ఇన్నిలక్షలమంది భక్తులు వచ్చే ఈ ప్రత్యేకదినాన ఈ ప్రదక్షిణామార్గం క్రిక్కిరిసిపోయి, జామ్ అయిపోయి, దర్శనసమయం వృధా అయ్యి, భక్తులకు దర్శనం స్లో కాదా ? - అసలు ఈ వాదనల్లో ఇసుమంతైనా లాజిక్ ఉందా ?

 

ఆలయంలో అసలంటూ లేని "ఉత్తర ద్వారాన్ని" సృష్టించడమే ఒక అద్భుతం అనుకొంటే, ఆ మార్గంగుండా కేవలం "వైకుంఠ ఏకాదశి" రోజున మాత్రమే వెళ్లాలంటూ ఎక్కడాలేని నియమాలను సృష్టించడం ఎంతవరకూ సబబు ?ఇలా జనాలని మోసంచేయదాన్ని ఆ ఏడుకొండలవాడు  సహిస్తాడా ? ఒకప్పుడు ఈ ప్రదక్షిణామార్గంగుండా అసలు ఎటువంటి ఆంక్షలూ లేవు - అక్కడ ఉత్సవమూర్తులకు సేవలు జరిగేవి అని టి‌టి‌డి వారి పుస్తకాల్లోనే పేర్కొన్నారు. 

 

"ఆర్జిత సేవలు" అంటూ లెక్కకుమిక్కిలిగా సేవలను సృష్టించి, వాటికోసం ప్రత్యేకసమయాన్ని కేటాయిస్తూ, ఆ దేవదేవుడిని "ఒక అంగడిసరుకుగా మార్చివేసి", రాజకీయ ప్రమేయంతో, ఉన్న పవిత్రతను కూడా పాడుచేసి, అన్నీ ఉన్నవాళ్లకే సాగిలపడిమరీ దర్శనాలు చేయిస్తూ, సామాన్య భక్తులు దేవుడి దర్శనం అంటేనే గుండెలు అద్దిరిపడేలా తయారుచేసేశారు..  - సర్వాంతర్యామి అయిన దేవదేవుడిని దాచివేసి మరీ వ్యాపారం చేస్తున్నారు. ! ఆఖరికి కైంకర్యాలను కూడా కుదించివేశారు. 

 

...... అయ్యా సాములూ.. ఆలయంలో తామరతంపరగా ఉన్న "వివిధరకాలైన ప్రత్యేక దర్శనాలను" పీకిపడేసి, అందరికీ "ఒకటే దర్శనం" పెడితే, అందరికంటే ఎక్కువగా ఆనందించేది ఆ ఏడుకొండలవాడే అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. 

 

.... పవిత్రమైన ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఇలాంటి వ్యాసం రాయడం ఇబ్బందిగా అనిపిస్తున్నా, "వైకుంఠ ద్వారం" పేరుతో అంతపెద్ద ఆలయంలో జరుగుతున్న అడ్డగోలు వ్యవహారాన్ని ఎండగట్టడానికి ఇంతకంటే మంచిరోజు నాకైతే కనిపించలేదు !

 

నా స్వామీ ఎంకన్నా, నేను ఏపాపామూ ఎరుగని పామరుడిని - నీ సన్నిధిలో జరుగుతున్న ఈ వ్యవహారాన్ని చూస్తూకూడా ఆపుకోలేని ధర్మాగ్రహమే ఈ వ్యాసాన్ని రాసేలా చేసింది.. అంతా నీ సంకల్పమే..!! గోవిందా గోవిందా..!!