బిజి...బిజి...బిజి
బిజి...బిజి...బిజి
ఎపుడైనా స్నేహితుడికి ఫోన్ చేస్తే “కాల్ లో వున్నా” ననో లేక “మీటింగ్ లో వున్నా” ననో లేక “కొంచం బిజీ గా వున్నాను 5 నిముశాల్లో నేనే మీకు ఫొన్ చేస్తాననో సమాధానం వస్తుంది.
ఆఫీసులో పని వత్తిడి నిజంగానే ఉండవచ్చు. అయితే, జీవితంలో మనకై మనం సృష్టించుకునే వత్తిడికే మనం ఎక్కువ లోనవుతూ ఉంటారు. పైన మనకొచ్చిన ‘బిజీ బ్రదర్ ’ ఎక్కువ శాతం తాము మీదేసుకున్న వత్తిడినుంచి వచ్చేవే...
ఇందులో ఇతరుల ప్రమేయమీ ఉండదు. మనకై మనం మీదేసుకుని సతమతమవుతున్న వత్తిడి అది. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎందుకొస్తుంది?
చర్చిస్తూ వుంటారు. పనైతే మొదలు పెట్టరు. ఎందుకు మొదలు పెట్టలేకపోయారు? అని ఎవరైనా అడిగితే సవాలక్ష కారణాలు చెప్పగలరు. లేదా “సమయం కోసం ఎదురుచూస్తున్నా” నంటారు. ఆ సమయం అసలు వస్తుందా? నిజానికి “ఒక పని చేయకుండా వుండటానికి వేయి కారణాలున్నా, ఆ పని చేయడానికి ప్రొత్సహించే ఒక్క కారణం చాలు ఆ పని మొదలు పెట్ట టానికి” అన్నారు పెద్దలు. ఆలాగే “సవ్యంగా మొదలు పెట్టిన ఏ పనైనా సగం పూర్తయినట్లే” అన్నారు.
కొన్ని సార్లు పని మీద అయిష్టత, కొన్ని సార్లు, ఆ పనిని సక్రమంగా చేయలేమేమో అనే అనుమానం , మరి కొన్ని సార్లు భయం ఇంకొన్ని సార్లు సోమరితనం మనల్ని ఒక పని చేయకుండా ఆపుతూ ఉంటాయి. వీటన్నింటినీ అధిగమించడే జీవన సమరం.
ఇష్టం లేని పని
ఇష్టం లేని ఒక పని వుందనుకుందాం అది తప్పనిసరిగా చేయవల్సిన పనే అయితే దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేసేయ్యడం మంచిది. ఆ పని చేయడాన్ని సాగదీయ కూడదు. అలా సాగదీస్తే ఆ పనిని చుట్టుకుని వున్న ఆలోచనలకి అధిక సమయం దొరికి, ఆ పనిమీద అయిష్టత అంతకంతకీ ఎక్కువై పర్వతమంత మారిపోతుంది. పని ముగించలేదే అన్న ఆతృత ఎక్కువకాలం కొనసాగడం తో అది బలపడి ఆత్మ విశ్వాసాన్ని తినేస్తుంది. దీనివల్ల అసహనం, తద్వారా వత్తిడి పెరుగుతాయి. వృత్తికి పనికొచ్చే సర్టిఫికేషన్లూ , శిక్షణలూపొందటం, నైపుణ్యాలను పెంచుకోవటం మొదలైనవి ఈ జాబితాలో చేరతాయి
దోషరాహిత్యపు పని
ఒక పనిని దోషరాహిత్యంగా, పూర్తి నిపుణతతో చేయలేమేమో అన్న అనుమానం తో కొంతమంది పని మొదలుపెట్టరు. లేదా మొదలు పెట్టిన పనిలో వారే తప్పులు వెదుకుతూ ఆ పనిని మరింత సమర్థవంతంగా చేయాలనే తపనతో దాన్ని పూర్తి చేయలేరు. వీరు చేయవల్సింది ఇంకా చాలా వుందే అనే భావం కంటే పని పూర్తి కాలేదే అన్న భావం తో వత్తిడి కి లోనవుతారు. వత్తిడి కి లోను కాకుండా నిదానంగా అయినా సరే పనిని సాగిస్తే అది పూర్తయిపోతుంది. అనవసరపు హైరానా తప్పుతుంది.
“మనం చేసే పనిలో యెవ్వరూ ఏలాంటి తప్పూ పట్టకూడదు అని వేచి వుంటే అసలు ఎప్పటికీ ఏమీ చేయలేము” అన్నాడు కార్డినల్ న్యూమన్.
భయం
మనం భయపడి కొన్ని పనుల్ని చేయడం మానేస్తాం. ఎదుటివాడు ఏమనుకుంటాడో, అనే భయం కావచ్చు లేదా ఈ పని చేయడం వల్ల పరిణామమెలా వుంటుందో అనే భయం కావచ్చు. ఎవరినైనా ఏదయినా సహాయం అడగటం, పరీక్షలు రాయటం, పర్మిషన్లు సంపాదించడం, పెద్ద హోదాలో వున్నవారిని కలవడం వగైరా దీన్లో చేరతాయి.
పూర్వం ఒక అడవిలో ఒక రాక్షసుడుండేవాడట. (ఇప్పుడు కూడా వుండొచ్చేమో). ఆ రాక్షసుడు ఆ ఆడవి గుండా వెళ్లే మనుషుల్ని పట్టుకుని తినేవాడట. ఆయితే తినే ముందు చచ్చిన మనిషిని ఒక రాతి బల్లమీద పడుకోబెట్టి ఆ మనిషి పొడవుని అంచనా వేసే వాడట. పొడవు చాలా తక్కువ అనిపించి, అంత చిన్న మనిషి తన ఆకలి తీర్చలేడని ఆ మనిషిని కాళ్లూ, తలా రెండు వేపులా పట్టుకుని లాగుతూ ఒక తీగను సాగదీసినట్లు సాగ దీసే వాడట. సాగదీసిన తరువాత ఆ మనిషిని మళ్లీ రాతి బల్ల మీద పడేసి పొడుగు అంచనా వేసే వాడట. ఇలా పలు మార్లు చేసి పొడవు సరిపోతుందని తృప్తి కలిగాక ఆ మనిషిని తినే వాడట. ఆ రాక్షసుడి పేరు “ప్రొక్రాస్టిన్”. ఆ రాక్షసుడు చేసే ఈ కృత్యం (అకృత్యం) వల్ల “కాల విలంబము”, లేదా “సమయాన్ని సాగతీయటం” అని అర్థం కల్గిన “ప్రొక్రాస్టినేషన్” అనే పదం వుద్భవించిందట. ఈ కథ ఎంతనిజమో తెలీదు. అంతర్జాలం లో కూడా ఈ వృత్తాంతానికి తగిన ఆధారాలు దొరకలేదు. అయితే ఈ వృత్తాంతం సబబుగానే వుందనిపించింది. ఎందుకంటే ఒక పని చేయడాన్ని సాగదీస్తూ పోతే అది చివరికి ఒక దయ్యమై కూర్చుంటుంది.
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, చూస్తూ కూర్చుంటే పనులు జరగవు. చేస్తూ పోతే అయిపోతాయి. వేయి అడుగుల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఆ అడుగు వేయాలి. పని మొదలు పెట్టాలి.
లక్ష్యం సాధించేంతవరకూ దాన్ని చేస్తూనే వుండాలి.
చివరగా ఏనుగు లక్ష్మణ కవి (భర్తృహరి సుభాషితాలు) రాసిన ఈ పద్యాన్ని గుర్తు చేసుకుంటూ ఈ చర్చ ముగిద్దాం .
ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై
యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘనిహన్య మానులగుచు ధ్రుత్యున్నతొత్సాహులై
ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్ గావునన్
(ఎప్పుడో అడ్డంకులు ఎదురవుతాయని వూహిస్తూ అధములు ఏ పనీ మొదలు పెట్టరు. మొదలు పెట్టిన పనిని మధ్యలో ఆటంకాలు ఎదురవ్వగానే వదిలేస్తారు మధ్యములు. ఎలాంటి ఆటాంకాలొచ్చినా లక్ష్యం సాధించేంతవరకూ వదలకుండా పని పూర్తి చేస్తారు ఉత్తములు).