అహంకారం ఎలా ఉంటుంది?

the problem of Ego

“అహం” కారం

 

నిఘంటువు అర్థం ప్రకారం “అహం” అంటే “నేను”, మరియు “నా” అనే స్వంత ప్రాముఖ్యము మరియు  సామర్థ్యానికి సంబంధించిన భావన.  మనో విశ్లేషణ ప్రకారం “అహం” అనేది ఒక మనిషి అపస్మారకం లో దాగిన కోరికలను బాహ్య ప్రపంచపు  అవశ్యకాలతో  జత చేయడానికి మధ్యవర్తిత్వం చేసే మేధో భాగం. ఇదీ ఆత్మగౌరవం లాంటిదే.

 

ఒక సంస్కృత వృత్తాంతం ప్రకారం  సంస్కృత కవుల్లో దండి గొప్పవాడా, లేక కాళిదాసు గొప్పవాడా అనే చర్చ వచ్చింది. వీరిద్దరి లో ఎవరు గొప్పవారో తేల్చిచెప్ప గల్గిన సామర్థ్యమున్న పండితుడెవడూ కనిపించక, ఇద్దరూ సరస్వతి దేవి దగ్గరికి వెళ్తారు. ఇద్దరిలో యెవరు గొప్ప అని అడిగిన ప్రశ్నకు దండి గొప్పవాడని జవాబిస్తుంది సరస్వతి. దానికి ఖిన్నుడైన కాళీదాసు “నేనేమీ కానా తల్లీ?” అని అడిగిన ప్రశ్నకు జవాబుగా “త్వమేవాహం”, (నువ్వే నేను) అని జవాబిస్తుంది సరస్వతి.

 

“నేను”, “నా”, అని సూచించేంతవరకు “అహం” అనేది ఒక పదం మాత్రమే.  అయితే “నేనే”, “నాదే” అనే అర్థాలు జోడించుకోవడం తో  అదొక భావంగా వాడుకలోకి వచ్చేసింది.    సరిగ్గా చెప్పాలంటే అహంకారం అలాగే వుంచి దురహంకారం (చెడ్డ అహంకారం) పదాన్ని వాడటం మంచిది.  ప్రస్తుత చర్చలో అహంకారం అనే పదాన్ని అందరూ అర్థం చేసుకునే రీతిలోనే వాడదాం               

 

ఆత్మ గౌరవానికి, అహంకారాకి చాలా పోలిక ఉంది. వాటిని విభజించేది చాలా సన్నటి రేఖ. “ఈ సామర్థ్యం నాకుంది” అనడం ఆత్మ గౌరవం. “ఈ సామర్థ్యం నాకొక్కడికే వుంది” అనడం అహంకారం.

 

కోపం లాగే అహంకారం కూడా అతి ప్రమాదకరమైనది. అనర్థ దాయకం కూడా.  

 

అంతర్జాలం లో ని ఒక జెన్ కథలో అహంకారాన్ని ఇలా విశదీకరిస్తాడు రచయిత. ఒక దేశపు ప్రధాన మంత్రి ఒక జెన్ గురువు మంచి స్నేహితులు.  ఆయనెప్పుడూ తన అధికార దర్పాన్ని ఆ జెన్ మాస్టరు వద్ద చూపించడు. ఆ ఇద్దరి మధ్య సంబంధం కూడా గురు శిష్యుల మధ్య వున్న సంబంధం లాంటిదే.

ఒక రోజు ప్రధాన మంత్రి జెన్ మాస్టరును “అహంకారం” అంటే యేమిటని అడుగుతాడు. ఆ ప్రశ్న విని ఆ జెన్ మాస్టరు “ఏమిటా బుద్ధి లేని ప్రశ్న?” అంటాడు. ఇది వినగానే ఆ ప్రధాన మంత్రి ముఖం కందిపోతుంది.  ఏనాడు రాని కోపం ఒక్క సారిగా కట్టలు తెంచుకుంటుంది.  అతని ఉద్రేకాన్ని చూసి జెన్ గురువు చిరునవ్వు నవ్వుతూ “ఇదే అహంకారం అంటే” అని వివరిస్తాడు.     

 

ఎవరైనా ఒక తప్పు చేస్తే, దాన్ని ఎదుటివాడు ఎత్తి చూపితే ఎంతమంది ఆ విమర్శను సానుకూలంగా స్వీకరించి ఆ తప్పును ఒప్పుకుంటారు? చాలా తక్కువ. ఒక తప్పుచేసి దాన్ని సరిద్దిద్దుకోని వాడు మరో తప్పు చేస్తున్నట్లే లెక్క.  ఈ విషయంలో అహంకారం పాత్ర చాలా ఎక్కువ.

 

ఒక మనిషికి పది సుగుణాలు చెప్పి చివర ఒక దుర్గుణం (వున్నదే)) చెబితే ఆ మనిషి దాన్ని ఎలా స్వీకరిస్తాడు? “అవును కదా?” అంటాడా లేక ఏకాగ్రత అంతా ఆ చివర చెప్పిన దాని మీదే పెట్టి ఎదుటివాడు తన తప్పుల్ని ఎత్తి చూపుతున్నాడని నింద వేస్తాడా? 

 

 

“నేను వాడికంటే ఏం తక్కువ?” అనే భావన ఎప్పుడైతే కలుగుతుందో అది అనర్థాలకు దారి తీస్తుంది.   జాగ్రత్తగా గమనిస్తే,    ఈ అహంకారం వల్ల మనం రోజూ చూసే, అనుభవించే అనర్థాలెన్నో.

ఉదాహరణకి మనం నడుపుతున్న వాహనాన్ని  వెనకనుచి ఒకడు దాటేస్తాడు. మన అహంకారం  దెబ్బతింటుంది. వాడి గురించి తిట్టుకుంటూ అలోచించుకుంటూ ఒక అర్ధ గంట వృధా చేసుకుంటాం. నష్టపోయేది మనమే. ఒకవేళ మనలో ఉడుకు రక్తం ఎక్కువై కోపం వస్తే తిరిగి అ మనిషి వాహనాన్ని దాటడానికి   ప్రయత్నిస్తాం. రహదారుల మీద అయితే ఇది మరీ ఎక్కువగా వుంటుంది.  అంతా సవ్యంగా జరిగితే సరే మన అహం శాంతిస్తుంది. లేకపోతే ఒక ఆక్సిడెంటు జరగ వచ్చు. ఈ మథన వల్ల అవతలివాడి ప్రవర్తనలో మార్పు రాదు.  ఇంట్లో చిన్న చిన్న గొడవల దగ్గరినుండి, బాహ్య ప్రపంచం లో మహా యుధ్ధాల వరకూ అహంకారాల వల్లే  జరుగుతాయి.

 

ఒకరి అహంకారం ఆ మనిషి పొందే నష్టానికే పరిమితమైతే పోనీ అనుకో వచ్చు. ఒక్కరి అహంకారం వల్ల, ఒక కుటుంబం, జాతి, దేశం ఇంకా మాట్లాడితే ప్రపంచమే నాశనమైన సందర్భాలున్నాయి కదా?  రెండొ ప్రపంచ యుద్ధానికి కారణం హిట్లర్ అహంకారం కారణంగా చెప్పుకుంటారు కదా?. అహంకారం వల్ల వాటిల్లిన పరిణామాలెన్నో పురాణాల్లో, చరిత్రలో చూడొచ్చు. 

 

దురదృష్ట కరమైన విషయమేమిటంటే, తెలిసి కూడా అహంకారాన్ని అదుపులో పెట్టుకోవటం మహా మహులకే సాధ్యం కావటం లేదు. అహంకారాన్ని  ప్రదర్శించే వారు దాన్ని ఆత్మగౌరవంగా సర్ది చెబుతారు.

 

అహంకారానికి సంబంధించిన మరో కథ. ఒక వూరిలో రామశాస్త్రి, శంకర శాస్త్రి అని ఇద్దరు సంగీత విద్వాంసులుండేవారు.   రామశాస్త్రి సాత్విక స్వభావం కల్గిన వాడు.  శంకర శాస్త్రి  కి అహంకారమెక్కువ. తనలాగా ఎవ్వరూ పాడలేరు అనుకొనేవాడు.   ఆ వూరిలోనే కాకుండా చుట్టుపక్కల వూర్లలో కూడా వాళ్ళిద్దరూ శుభకార్యాలకు సంగీత కచేరీలు చేసి జీవనం సాగించేవారు.  ఇద్దరికీ వారి వారి అభిమానులుండేవారు.  అయితే ఏనాడూ వాళ్లిద్దరు కలిసి ఒకే శుభకార్యం లో సంగీతకచేరి చేయలేదు. వారిద్దరి గురించి తెలిసిన వారు ఎవర్నో ఒకర్నే ఆహ్వానించే వారు. ఒక రోజు ఆ వూరి పెద్ద తన కుతురి పెళ్ళిలో సంగీతకచేరి చేయమని ఇద్దర్నీ ఒకేసారి అహ్వానిస్తాడు. రామశాస్త్రి తో కలిసి సంగీత కచేరీ చేయడం ఇష్టం లేకపోయినా, వూరి పెద్ద మాటకాదనలేక శంకరశాస్త్రి ఒప్పుకుంటాడు.

 

అతను వూరిపెద్దను విడిగా కలిసి  “నాకూ రామశాస్త్రికీ పోలిక లేదన్న విషయం మీకు తెలిసిందే. నేనతడిని నా సమవుజ్జీగా ఏనాడు భావించలేదు. అందుకే మా తేడా తెలియ జేసేందుకు రామశాస్త్రి కిచ్చె పారితోషికాని కంటే నాకు ఎక్కువ ఇవ్వాలి. అది ఒక్క రూపాయైనా ఫరవాలేదు” అంటాడు.  

 

దానికి ఆ వూరిపెద్ద ఒప్పుకుంటాడు.  పెళ్లి లో సంగీతకచేరీలు నిర్వహింపబడతాయి.  పెళ్లి అయిపోయిన తరువాత పారితోషికాలు ఇస్తూ వూరి పెద్ద సభికులనుద్దేశించి ఇలా అంటాడు. “సంగీత విద్వాంసులకిద్దరికీ ఇచ్చే పారితోషికాల్లో శంకర శాస్త్రి కోరిక ప్రకారం,   ఆయన పారితోషికం రామశాస్త్రి పారితోషికం కంటే కనీసం ఒక్క రూపాయైనా ఎక్కువ వుండాలని అన్నారు.  ఈ శుభకార్యం లో రామశాస్త్రి పారితోషికం పుచ్చుకోకుండా ఉచితంగా సంగీతకచేరి చేశారు. అందుకే శంకర శాస్త్రి గారికి పారితోషికం కింద ఒక్క రూపాయి సమర్పించుకుంటున్నా”  నంటు ఒక రూపాయి శంకర శాస్త్రి చేతిలో వుంచుతాడు.    ఇదీ అహంకారం కధ              

 

 

అహంకారాల వల్ల ఒకే కుటుంబం లోని పెద్దలు ఒకరితో ఒకరు మట్లాడుకోకుండా విడిపోయి ఏళ్లతరబడి అలా వుండిపోతారు. రాకపోకలుండవు. ఈ పెద్దల అహంకారం వల్ల పిల్లలు నష్ట పొతారు. కలిసిమెలిసి వుండటం లోని ఆనందాన్ని పోగొట్టుకుంటారు.  ఈ వూహాజనిత అపార్థాలూ, స్పర్థలూ మనం వున్నా లేక పోయినా ఒక రోజు అంతమవుతాయి.  అంత ఆలస్యం చేయడం కంటే ఒక చిన్న సర్దుబాటుతో జీవితం లోకి ఆనందాన్ని ఆహ్వానించడం ఉత్తమమైన పని.    

 

మన ఆలోచనల్ని అదుపులో పెట్టుకునే శక్తిని అహంకారానికిస్తే, మిగతా ప్రపంచమంతా మిథ్య  గా కనిపిస్తుంది