ఇపుడుండేవారంతా డమ్మీ పాలకులే...
( రాజు వర్సెస్ CEO వ్యాసాలలో చివరిదిది)
రాజుగారి దృష్టిలో చుట్టు వున్న వారు ‘ప్రజలు’. ప్రజా అన్న సంస్కృతపదానికి అర్థం సంతానం అని తెలుసుకుంటే ఆ పదానికి ఉన్న ప్రాధాన్యత బోధపడుతుంది. అంతే కాదు, రాజే వారికి తల్లీ తండ్రీ అని నొక్కి చెప్పడంలో ఉన్న అంతరార్థం కూడా బోధపడుతుంది.
తల్లిదండ్రులు తమ సంతానంలో ఒకరిని ఎక్కువగాను, ఒకరిని తక్కువగాను ప్రేమించలేరు కదా! వారు సంతానాన్ని కనగలరు కానీ, వారి అదృష్టాలను కనలేరు అన్న మాట నిజమే. కానీ, వారి మధ్యలో ప్రేమాభిమానాలను సమన్వయం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. ఒక తల్లి కలెక్టర్ ఉద్యోగం చేసే పెద్ద కొడుకుకు బంగారు పళ్లెంలోను, అదే ఆఫీసులో ప్యూన్ ఉద్యోగం చేసే చిన్నకొడుకుకు చిరిగిపోయిన విస్తరాకులోను వడ్డించదు.
పెద్దవాడు నెలకు లక్షరూపాయలు ఇచ్చినా, చిన్నవాడు మరీ హీనంగా నెలకు వందరూపాయలు ఇచ్చినా వారి మీద తల్లిదండ్రుల ప్రేమలో తేడా ఉండదు. వారు ఆఫీసులో వారి వారి స్థాయిలను బట్టి గౌరవం పొందుతూ ఉన్నప్పటికీ,తమ ఇంట్లో తల్లికి మాత్రం ఇద్దరూ సమానులే. రాజుకు ప్రజలు అటువంటి వారు.
ఒక CEO కు సంబంధించి వారు మానవవనరులు. హ్యూమన్ రిసోర్సెస్. రిసోర్స్ అనే ఆంగ్లపదానికి ఉన్న అర్థం "ఒక సంస్థ సక్రమంగా నడిచేందుకు అవసరమయ్యే ఒకానొక వస్తువు." ఆ మాటతోనే మనిషికి వారు ఇచ్చే విలువ అర్థం అవుతుంది.
మనం ఇంటికి బియ్యం తెస్తే, బియ్యం అయిపోయిన తరువాత సంచిని విసిరేస్తాం. అలాగే, మనిషిలో సంస్థకు ఉపయోగపడే శక్తి ఉన్నంతవరకు ఉపయోగించుకుని, తరువాత ఆ మనిషిని నిర్దాక్షిణ్యంగా అతి నైపుణ్యంగా సీఈఓ లు వదిలించుకుంటారు. ఆయా మనుషుల వయసు కానీ, మంచితనం కానీ, కంపెనీ CEO కు అనవసరం. కంపెనీకి గాని, తనకు గాని ఎంత ఎక్కువ ఉపయోగపడితే అంత ఎక్కువ ఆదరణ జీతం అతనికి. ఒకొక్క సారి కంపెనీకి ఉపయోగపడే వ్యక్తిని కూడా ప్రక్కన పెట్టి, తన నిర్ణయాలకు జైకొట్టి భజన చేసే వ్యక్తులకే ఎక్కువగా ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.
కాబట్టి, పరిపాలకులు రాజులలాగానే దర్జాగా ఉండాలి తప్ప, లాభాలకోసం స్వార్థం కోసం తాపత్రయపడే CEO ల లాగా ఉండకూడదు.
అన్యాయేన నృపో రాష్ట్రాత్ స్వకోశం యోsభివర్ధయేత్।।
సోsచిరాద్ గతశ్రీకో నాశమేతి సబాన్ధవః।। (యాజ్ఞవల్క్య స్మృతి 1.334)
అలా కాకుండా ఏ పరిపాలకుడైతే అన్యాయంగా ప్రజల సొమ్ముతో తన సొంత ఖజానాను అభివృద్ధి చేసుకుంటాడో, అతడు త్వరలోనే తన అదృష్టాన్ని కోల్పోయి బంధుమిత్రసమేతంగా నశించిపోతాడు. (ప్రస్తుతకాలంలో అధికారం కోల్పోతాడు అనుకోవచ్చు.)
సరే,
ఇంతవరకు చర్చించిన సంగతులు వినడానికి సరదాగా ఉంటే ఉండవచ్చు.
కానీ, నేటి కాలంలో ఎన్నికలలో గెలిచి పదవీ స్వీకారం చేసిన వారు అసలైన పరిపాలకులు కాదు, వారు తమకు ఎలక్షన్లలో ఖర్చులకు ఇబ్బడిముబ్బడిగా డొనేషనలిచ్చిన కార్పొరేట్ యజమానులకు కేవలం డమ్మీ పరిపాలకులుగా ఉంటున్నారు అనేందుకు సాహసిస్తున్నాను.
నేటి పరిపాలకులు - ప్రజల అవసరాలు, ప్రజల కష్టసుఖాలకంటే - తమకు ఎన్నికల ఖర్చులకు గాను డొనేషన్లు ఇచ్చేవారి ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చి ప్రజలను ఇబ్బందుల పాలు చేయడం చూస్తున్నాం.
అసలైన ఆదేశాలు, అసలైన విధాన నిర్ణయాలు ఆ కార్పొరేట్ బాసులనుండి వస్తున్నాయి. అవి తాము ఎన్నుకున్నామని ప్రజలు భావిస్తున్న పరిపాలకుల నోటినుండి వెలువడుతూ ఉండటం వలన ప్రజలు అవి వారి నిర్ణయాలేమో అని భ్రమిస్తున్నారు.
రాచరికం అనేది 1970 లో ఇందిరాగాంధీ రాజభరణాల రద్దు ద్వారా పోయింది అని ఇప్పటికి కూడా ఎవరైనా అనుకుంటూ ఉంటే - అది వారి అమాయికత్వం. తమ అనుచరులు జేజేలు పలుకుతుండగా రాజుల్లా వెలుగొందవలసిన నేటి ప్రజాప్రతినిధులు కార్పొరేట్ వ్యాపారస్తులకు అమ్ముడు పోయి, బానిసల్లా పడి ఉండటాన్ని మౌనంగా ప్రత్యక్షంగా చూస్తున్న మన తరంలోనే ఆ రాచరికం నిజంగా చచ్చిపోయింది. CEO ల యుగం వచ్చేసింది.
ఈ విధంగా ప్రజలు తమకు వినయాన్ని, రక్షణను ప్రసాదించి, తమ పోషణ వహించే రాజు లేక అనాథలై పోయారు. మానవవనరులై పోయారు. అనాథలకు డిమాండ్ చేసే హక్కు లేదు. గొడ్డు చాకిరీ చేయడం, ముఖానికి ఏది పడేస్తే దానితోనే సర్దుకుని పడి ఉండడం - ఇదే గతి. మానవవనరులకు నోరు ఉండకూడదు. యజమాని తమను ఎలా తమను వినియోగించుకుంటే అలా ఖర్చైపోవలసిందే. (అయిపోయింది.)
గత రెండు భాగాలు ఇక్కడ ఇక్కడ ఉన్నాయి.
(* శ్రీనివాస కృష్ణ తిరుపతి రాష్ట్రీయ సంస్కత విద్యా పీఠంలో ప్రాచీన మేనేజ్ మెంట్ పాఠ్యాంశం బోధిస్తారు)