కోపమా... తాపమా???

how anger burns you into ashes

 

 

గౌతమ బుద్ధుడి మాటల్లో, “కోపమనేది, ఎవరిమీదనో విసరడానికి చేతిలో పట్టుకున్న నిప్పు కణిక లాంటిది. అది పట్టుకున్న వాడి చేతినే కాలుస్తుంది”.   నిజమే, ఆంగర్ (కోపం) అంగార్ (నిప్పు) తో సమానం.  

 

మానసిక శాస్త్రవేత్తలు, కోపాన్ని “అత్యల్ప మైన చిరాకు నుండి అత్యధికమైన ఆగ్రహం వరకూ తీవ్రతను కల్గివుండే ఒక భావొద్వేగం” గా నిర్వచిస్తారు. వారి దృష్టి లో కోపం మంచిదే, ఆరోగ్యకరమైనది కూడా.  మనమీద జరిగే మానసికమైన, శారీరకమైన దాడులకు కోపం  ఒక ప్రాకృతికమైన జవాబుగా నిలుస్తుంది. అది   మనమీద ఏదైనా దాడి జరిగినప్పుడు,  ఆ దాడిని ఎదుర్కోవడానికీ, పోరాటం జరపడానికీ తగిన శక్తివంతమైన, ప్రవర్తననూ భావాలనూ ప్రేరేపిస్తుంది.  అందుకే కోపం అవసరం మరియు ఆరోగ్యకరం అంటారు.

 

అయితే అదుపు తప్పిన కోపం ప్రమాద కరం. అది వినాశకారిగా మారి, అనేక సమస్యలను సృష్టిస్తుంది.  ఈ అదుపు పరిధి (సహన శీలత) ఒక్కో మనిషి కి ఒక్కో రకంగా వుంటుంది. కొంతమందికి చిన్న చిన్న విషయాలకే కోపమొస్తుంది. మరి కొంతమందికి సహన శీలత ఎక్కువగా వుంటుంది. వారికి అంత త్వరగా కోపం రాదు. వారు అసహనాన్ని కలుగ చేసే చిన్న చిన్న విషయాలకు ప్రాముఖ్యతను  ఇవ్వరు. 

 

how anger burns you into ashes

 

కోపం అంతర్గత కారణాల వల్ల కానీ, బాహ్య  సంఘటనల వల్లకానీ కలగొచ్చు. ఉదాహరణకి, ఒక మనిషిని  (సరదాకి “బాస్” అనుకుందాం) చూస్తే కోపం రావచ్చు. ట్రాఫిక్ జాం వల్ల, క్యూ లో నిలబడని వాడి వల్ల, చిల్లర సరిగ్గా ఇవ్వని వాడివల్ల,  కోపం రావచ్చు. ఇవి కాక వ్యక్తిగత సమస్యలకు పరిష్కారాలు దొరకనప్పుడు, గతం లోని, కోపం తెప్పించే సంఘటనలు గుర్తొచ్చినపుడు   కోపం రావచ్చు. కోపం ఎలా వచ్చినా  దానివల్ల ఆరోగ్య పరమైన మార్పులు సంభవిస్తాయి. హృదయ స్పందన రేటు, రక్తపోటు,  శక్తి కి సంబంధించిన హార్మోన్ల విడుదల, అడ్రెనాలిన్ మొదలైనవి పెరుగుతాయి. ఇవి మంచివి కావని అందరికీ తెలుసు.

 

అంతర్జాలం లోని ఒక కథ (ఇది నిజంగా జరింగిందని చెబుతారు) : అమెరికాలో ఉన్న ఒక యువకుడు  ఒకరోజు  తాను కొన్న కొత్త కారును చూసుకుందామని ఇంట్లోనించి బయటికి వచ్చేసరికి, అతడి కొడుకు ఒక రాయి తీసుకుని ఆ కారు మీద గీతలు గీస్తూ కనబడతాడు. ఇది చూసి ఆ యువకుడు పట్టరాని కోపంతో తన కొడుకు వ్రేళ్లను  సుత్తెతో నుజ్జు నుజ్జు చేసేస్తాడు. కోపం తగ్గాక అ పిల్లవాణ్ని ఆసుపత్రికి తీసుకెళతాడు. మరుసటి రోజు ఆ పిల్లవాడు తనని చూడడానికి వచ్చిన తండ్రికి “సారీ” చెప్పి,  “నా వ్రేళ్లు యెప్పుడొస్తాయి నాన్నా?” అని అడుగుతాడు.   ఆ యువకుడు భరించరాని అవేదనతో ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటాడు.

 

ఇది నిజంగా జరింగిందా లేదా అనేది మనకనవసరం. ఎంత హృదయ విదారకంగా వుందీ సంఘటన? ఇటువంటి సంఘటనలు ఎన్నో మనం  చూస్తూ వుంటాం. ఇంట్లో పిల్లవాడు ఒకరోజు పాలగ్లాసు కింద పడేశాడు అనుకుందాం. గ్లాసు పగిలిపోతుంది. ఆ ఇంట్లో తల్లి దండ్రుల ప్రతిచర్య ఎలావుంటుంది?  పోతే పోయిందిలే ఇంకోగ్లాసు కొనుక్కోవచ్చని సముదాయిస్తారా?  లేక అ పిల్లవాడికి నాలుగు అంటించి “మళ్లీ చెస్తావా ఇలా?”

అంటు బెదిరిస్తారా?  కొట్టడం ఎందుకు? గ్లాసా తిరిగిరాదు. అలా కొట్టి భయపెడితే తప్ప మళ్లీ ఇంకోసారి చేయడు అనే లాజికొక్కటి. 

 

కోపాన్ని ఎలా మానేజ్ చేయొచ్చు?

 

1. కోపాన్ని ప్రదర్శించడం లేదా బహిర్గతం చేయడం: దూకుడు గా కాకుండా,  ఎదుటివారిని నొప్పించకుండా మన అవసరాలేమిటో ఎదుటి వారినుండి మనం యేం  కోరుకుంటున్నామో  వివరంగా తెలియజేయగలిగే  నేర్పును వృధ్ధి చేసుకోవాలి.  ఇలా చేయడానికి ప్రశాంతంగా ఆలోచించ గలగటం, చక్కటి సంభాషణా చాతుర్యం అవసరం.      

                          

2. కోపాన్ని ఆణిచి పెట్టడం:  కోపాన్ని దిగమింగి, దాని దారి మళ్లించి ఇంకో రూపం లో కి మార్చడం.  దీనికోసం మనం యేదైనా ఒక ధనాత్మక విషయాన్ని ఆలోచించడం, ప్రశాంతత కల్గించే సన్నివేశాన్నో, చిత్రాన్నో ఉహించడం చేయొచ్చు.    అయితే కోపాన్ని దాచిపెట్టి దాన్ని ఇతరులకు హాని కల్గించకుండా బహిర్గతం చేయలేక పోతే అది అంతర్గతంగా మనకు హాని చేస్తుంది.  మూతి విరుపులూ, అలగటాలూ,

 

చిరాకు పడటాలూ, మాటల్లేకపోవడాలు, మూసుకున్న తలుపులూ   మొదలైనవి వుంటాయి

 

3. కోపాన్ని తుడిచి పెట్టడం:  ఈ ప్రక్రియలో,  కోపం వల్ల అంతర్గతంగా చెలరేగే సవాళ్లనూ ఎదుర్కొంటూ, మన బాహ్య ప్రవర్తననూ సరిచేసుకుంటూ కోపాన్ని సమసి పోయేలా ఛేయడం. ఇలా చేయడానికి  చిట్కాలూ, ఆంగర్ మ్యానేజిమెంట్ క్లాసులూ, వెయ్యిన్నొక్క పుస్తకాలూ ఉన్నాయి.   వీటికి శారీరక, మానసిక వ్యాయామాలున్నాయి.    యోగా, ప్రాణాయామం మొదలైనవి.  ఇవికాక “ఆల్ ఇజ్ వెల్” , “టేక్ ఇట్ ఈజీ”  “రిల్యాక్స్” లాంటి పదజాలం తో ప్రశాంతత వైపు ప్రయాణించడం. కుంగ్ఫు పాండా -2,  సినిమా లో ని “ఇన్నర్ పీస్” ఇలాంటిదే.

 

ఇదంతా చదువుతుంటే మీకు “తన కోపమె తన శతృవు. . . . .”  పద్యం గుర్తు రావటం లేదూ? మళ్లీ మొదటికొస్తే, ఇవన్నీ చెప్పడానికే. ఈ ఆర్టికల్ ప్రచురించక పోతే నాకు కోపం రావచ్చు. దీన్లో ఏవైనా విషయాలు మీకు నచ్చక పోతే మీకూ కోపం రావచ్చు.  

 

ఒక యుద్ధాన్ని అంతమొందించడానికి  అత్యుత్తమమైన మార్గం ఆ యుద్ధం మొదలు పెట్టక పోవడమే.  కోపాన్ని జయించడానికి అత్యుత్తమమైన మార్గం కోపం తెచ్చుకోకుండా వుండటమే.