మీ మనసులో తుఫాను చెలరేగుతూ ఉందా....
నీలాకాశం !
ఓ మబ్బుతునక అలా వస్తుంది, ఇలా వెళ్లిపోతుంది. దాని వెనుక మరొ మబ్బు తునక. ఆ వెంటనే మరోటి. ఆకాశం లో మబ్బులు వస్తుంటాయి పోతుంటాయి. సరిగ్గా ఇలాగే మనకిష్టం వున్నా లేకపోయినా ఆకాశం లో మబ్బు తునకల్లా మన మెదడ్లో కూడా ఆలోచనలు తేలియాడుతూనే వుంటాయి.
“తనలో ఒక తుఫాను మొదలైంది”, “మెదడు మేఘావృతమైన ఆకాశమల్లే తయారయింది”, “మనసులో ఆలోచనల మేఘాలు ముసురుకున్నాయి” మొదలైన అభివ్యక్తులూ (expressions), సినిమాల్లో ఎవరైనా ఒక వినరాని వార్త విన్నప్పుడు పిడుగు పడినట్లు చూపించడం, మనలో వున్న మానసిక వాతావరణాన్ని తెలియజేసే ఉదాహరణలే.
గతాన్ని గురించిన పాశ్చాత్తాపం మనని వెంటాడుతూ మనవెనుక నిల్చుంటే, భవిష్యత్తు గురించిన మసక చిత్రమొకటి మనముందుంటుంది. ఈ రెండు మన వర్తమానాన్ని పాడు చేస్తూ వుంటాయి. ఈ పాశ్చాత్తాపం, భవిష్యత్తు గురించిన భయం, అవి కలిగించే ఆందోళన, మనలో ఎన్నొ అలోచనలు రేకెత్తిస్తాయి. వీటిని వదిలించుకోవడం సుళువేమీ కాదు. అయితే ఈ ఆలోచనలకు సంబంధించిన విషయాలు నిజంగా హాని కలిగించేవా? వీటిలో నిలిచేవెన్ని? వీగిపోయే వెన్ని? నిజాలెన్ని ? అపోహలెన్నీ? అని తెలుసుకోవడం, విశ్లేషించడం ఎంతో అవసరం.
“నేను ఏదీ సవ్యంగా చేయలేను, ఈ మోటర్ సైకిలు సర్వీసింగు కి ఇవ్వాలి ట్యూషన్ సారు తో మాట్లాడాలి, ఆ చెప్పులు కొంటే బావుంటుంది” ఇలా అనేక రక మైన భావాలూ, ఆలోచనలూ మన మెదడ్లో తిరుగుతూ వుంటాయి. మానసిక వాతావరణాన్ని సృష్టిస్తూ వుంటాయి. మనకొచ్చే ఆలోచనల్లో కొన్ని విలువైన వయితే, మరికొన్ని ఏ మాత్రం విలువలేనివి కావచ్చు. కొన్ని అలరించేవైతే, మరి కొన్ని భయ పెట్టేవి కావచ్చు. కొన్ని అలవాట్ల ద్వారా వచ్చే వైతే, మరికొన్ని ఆకస్మికంగా వచ్చేవి కావచ్చు. కొలిక్కి రాని ఆలోచనలతో సతమతమౌతున్న మనస్సు, అల్లకల్లోలంగా వున్న ఆకాశం లాంటిదే.
కాలక్రమేణా ప్రతి మనిషి ప్రత్యేక ఆలోచనా విధానాల్నీ, లేదా నమూనాల్ని తయారు చేసుకుంటాడు. ఈ నమూనాల్లో చాలామటుకు అపస్మారకమైనవీ, మానసికారోగ్యాన్ని తొలిచేసేవే. ఒక ఆలోచనా విధానం లో మానసికంగా కృంగి పోయిన వ్యక్తి తన మనస్థితి లో మార్పును గమనించి మరింత నైరాశ్యానికి గురి కావచ్చు. “మళ్లీనా? ఇది నా వల్ల కాదు”, “నేనింక బాగు పడను”, “నాకు ఏ విషయమూ సహకరించడం లేదు”, అనే ఆలోచనా విధానం ఒక విష వలయం లాంటిది. ఈ ఆలోచనా విధానం పునరావృతమవుతూ ఆ మనిషి ని మరింత కృంగదీస్తుంది.
ప్రతి మనిషి అంతరాత్మ మాట వింటాడు. అయితే కొన్ని విషయాల్లో అంతరాత్మ దృష్టి కోణం కఠినంగా వుండొచ్చు. దాని ద్వారా వచ్చే “నువ్వు మారవు, ప్రతి విషయాన్ని సాగదీస్తావు, నువ్వు నేర్చుకోవలసింది చాలా వుంది” లాటి తీర్పులు మనిషిని గాయపరిచి, మార్పు పట్ల అతడొక అసమర్థుడన్నభావాన్ని సృష్టించవచ్చు. అయితే ఈ తీర్పులు నిజం కాక పోవచ్చు.
మనం పరితపించే విషయాలకు, భయపడే విషయాలకు సంబంధించి అవగాహన లేని ఆలోచనా విధానం జీవితాన్ని మరింత దుర్భరం చేస్తుంది. ఇది ఇంతకుముందే వత్తిడి కల్గించిన సన్నివేశాలకు మరింత వత్తిడిని జోడిస్తుంది.
ఆలోచనల పట్ల అవగాహన ఏర్పరుచుకోవడమంటే ఏమిటి, దీన్ని సాధించడం ఎలా?. ఒక సాయంత్రం పచ్చిక మైదానం మీద పడుకుని ఆకాశం వైపు చూస్తూ మేఘాల కదలికను గమనిస్తే ఎలా వుంటుంది? బాహ్య వాతావరణాన్ని గమనించినట్లే మనం మన మానసిక వాతావరణాన్ని కూడా గమనించ వచ్చు.
ఆలోచనలూ, అనుభవాలూ, మరియు భావోద్వేగాల పై సంపూర్ణమైన అవగాహన వున్న ఒక తీర్పు రహిత స్థితిని సాధించడం మనిషికి చాలా అవసరం. మన సౌలభ్యం కోసం దీన్ని మానసిక అప్రమత్తత అందాం. ఆలోచనల్ని చూడటం నేర్చుకోవాలి. వాటితో చర్చలు జరపడం నేర్చుకోవాలి. ఆలా అని జీవితం తో విడిపోయి ప్రతి విషయాన్నీ భూతద్దం లో చూడరాదు.
ఈ అప్రమత్తత వినాశాన్ని కలిగించే మానసికపు అలవాట్లను గుర్తించి సవాళ్లను ఎదుర్కొనే నూతన ఆలోచనా విధానాన్ని ఆవిష్కరించ గలదు. అయితే దీనికి సాధన అవసరం. ఈ విషయాల్లో “యోగా, ధ్యానం” చాలా ఉపయోగపడతాయని చెప్పొచ్చు.
ఆలోచన కలిగిన ప్పటినుండి దాన్ని ఆచరణలో పెట్టే సమయం వరకు కొంత వ్యవధినివ్వాలి. ఈ సాధనలో మనం గమనించిన ఒక ఆలోచన లోని వాస్తవికతను ప్రశ్నించడం ఒక ప్రక్రియ. “రేపు నేను ఈ పరీక్ష సరిగ్గా వ్రాయలేక పోతే నన్ను కాలేజీ లో అవమానిస్తారు.” అనే భావనలో నిజమెంత? అని ప్రశ్నించి చూడండి.
ఇటువంటి అప్రమత్తత కు తోడుగా, ఒక రకమైన మానసిక చికిత్స ద్వారా మనుషులు తమ ఆలోచనా విధానాన్ని గుర్తించి, దాని దారి మళ్లించేట్లు చేయడం నేర్చుకోవచ్చు. ఆలోచించే విధానపు కొత్త నమూనాల ను తయారు చేసుకో వచ్చు. “నా మానసిక స్థితి బాగా లేదు, అది నా తప్పు కాదు. ఇంతకు ముందు ఇటువంటి సమస్య నుండి బైట పడ్డాను, ఇప్పుడు కూడా బయట పడగలను”. అనే ఆలోచనా విధానం మునుపు ప్రస్తావించిన ఆలోచనా విధానం తో పోలిస్తే చాలా మెరుగైనది. మానసిక అప్రమత్తతను కలిగివుండి, సరైన ఆలొచనా విధానాన్ని అవలంబిస్తే మానసిక అనారోగ్యాన్ని అరికట్టవచ్చు. పరిస్థితులు మనల్ని కృంగదీయకుండా నిలదొక్కుకోవచ్చు.
ఒక రోజులో పది విషయాలు మనల్ని అలరించి ఏదో ఒక విషయం కలవర పెట్టిందనుకుందాం. మనం ఆ రోజంతా ఆ ఒక్క విషయం గురించే ఆలోచిస్తూ వుండిపోతాం, ఆనందాన్ని పోగొట్టు కుంటాం. అయితే ప్రతి ఆలోచనను పట్టుకుని విశ్లేశించి, సమాధానాన్ని వెతకనవసరం లేదు. మన ఆలోచనల్లో చాలా మటుకు ఊహలూ, విపరీత భావనలూ కావచ్చు. కొన్ని ఆలోచనల విషయం లో వాటితో వాగ్వాదానికి దిగడం కన్నా, వాటి దారిన వాటిని వెళ్లిపోనిచ్చి మెదడుకు విశ్రాంతి నివ్వడం మేలు. అయితే దీనికెంతో శిక్షణ అవసరం.
కిటికీ లోంచి చూస్తే చిన్న వాన కూడా తుఫాను లాగే కనిపిస్తుంది. తలుపు తెరిచి బైటికి వస్తే మీరూ, తూఫానే.