రాజు గారు వర్సెస్ CEO
ప్రజలు X Human Resources
(రెండవ భాగం)
2.1 ప్రజలకు రక్షణ కల్పించడమనేది కూడా రాజు బాధ్యతే! తన పౌరులనుండి పన్ను (TAX) గ్రహించి వారిని రక్షించని రాజు నరకానికి పోతాడట.
యోsరక్షన్ బలిమాదత్తే... సద్యో నరకం వ్రజేత్।। (మను స్మృతి 8.307)
రక్షించే రాజుకు ప్రజలు సంతోషంతో చెల్లించే పన్ను లు ఈ లోకంలో కలిగే సంపద. అంటే కాదు, ఆ ప్రజలు చేసే పుణ్యంలో ఆరో భాగం రాజుకు చెంది పైలోకంలో కూడా అతడు సుఖపడతాడట.
పుణ్యాత్ షడ్భాగమాదత్తే న్యాయేన పరిపాలయన్।। (యాజ్ఞవల్క్య స్మృతి 1.334)
సరే, రాజు ప్రజలను ఎవరిబారినుండి కాపాడాలి?
చాటతస్కరదుర్వృత్తమహాసాహసికాదిభిః।
పీడ్యమానాః ప్రజా రక్షేత్ కాయస్థైశ్చ విశేషతః।। (యాజ్ఞవల్క్య స్మృతి 1.335)
*చాటులనుండి = నమ్మించి మోసగించే వాళ్ళనుండి
*తస్కరులనుండి = దొంగలనుండి
*దుర్వృత్తులనుండి = త్రాగుబోతులు, జూదగాళ్లు మొదలైనవారినుండి
*మహాసాహసికాదులనుండి = దోపిడీదారులు, రౌడీలు మొదలైన వారినుండి
*కాయస్థులనుండి = ప్రభుత్వాధికారులనుండి
వీళ్ళ చేతిలో ప్రజలు పీడనకు గురికాకుండా వారిని కాపాడాలిట. పైన చెప్పిన వారిని శిక్షించాలి. శిక్ష అనే సంస్కృతపదానికి ఇంగ్లీషులో ఉండే Punishment అనే పదం సమానార్థకం కాదు. శిక్ష వల్ల మనిషికి మంచి సంస్కారం కలిగి సత్ప్రవర్తన కలుగుతుంది.
ఉత్కోచజీవినో ద్రవ్యహీనాన్ కృత్వా వివాసయేత్। (యాజ్ఞవల్క్య స్మృతి 1.338)
లంచం తీసుకుని బ్రతికేవాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకుని వెళ్ళగొట్టాలట. (ఇప్పుడైతే రాజ్యబహిష్కార శిక్ష లేదు కాబట్టి జైల్లో పెట్టాలి.)
శత్రుదేశాలబారినుండి ప్రజలను రక్షించాలి అనే మాట ఎక్కడా లేదు చూడండి. ఎందుకంటే శత్రుదేశమనేది రాజుకు ఉంటుంది తప్ప ప్రజలకు కాదు. ఆ కాలంలో యుద్ధం అనేది రాజులకు వారి సైన్యానికి నడుమ జరిగేదే కానీ, రెండు దేశాల నడుమనుండే ప్రజలకు కాదు. ఏ రాజు గెలిచినా అతడు ప్రజలనుండి పన్ను స్వీకరించి రక్షణ కల్పించేవాడే తప్ప శత్రుదేశపు ప్రజలు అని పీడించే వారు కారు.
య ఏవ నృపతేర్ధర్మః స్వరాష్ట్రపరిపాలనే।।
తమేవ కృత్స్నమాప్నోతి పరరాష్ట్రం వశం నయన్।। (యాజ్ఞవల్క్య స్మృతి 1.341)
ఒక దేశపు రాజు తనదేశపు ప్రజలను ఎటువంటి రాజధర్మంతో రక్షిస్తాడో, పరదేశపు ప్రజలను కూడా అటువంటి రాజధర్మంతోనే రక్షించాలి అని యాజ్ఞవల్క్య స్మృతి చేసిన శాసనం.
యస్మిం దేశే య ఆచారో వ్యవహారః కులస్థితిః।
తథైవ పరిపాల్యో సౌ యదా వశముపాగతః।। (యాజ్ఞవల్క్య స్మృతి 1.342)
పరదేశాన్ని ఆక్రమించుకుంటే (ఆక్రమణ అంటే అక్కడి రాజును తొలగించి తన ప్రతినిధిని అక్కడ పరిపాలనకు నియమించడం అని అర్థం) ఆ దేశాలలో ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి వారి ఆచారాలకు, వ్యవహారాలకు, కులమర్యాదలకు (ఇక్కడ కులం అంటే ఇంగ్లీషులోని caste అని అర్థం కాదు) భంగం కలగకుండా పరిపాలించాలి.
ఇలా కాకుండా, మరోదేశపు ప్రజల మీద కక్ష పెట్టుకుని, నిష్కారణంగానో, సకారణంగానో పీడించేవారిని, దోచేవారిని, ఊచకోత కోసేవారిని రాక్షసులు, దస్యులు అన్నారు. వారు ఈనాటి టెర్రరిస్టులవంటి వారు అన్నమాట. వారినుండి కూడా ప్రజలను రక్షించే బాధ్యత రాజుకు ఉంది. (యుద్ధకాలంలో, ప్రమాదకాలంలో శత్రుసైన్యాన్ని నాశనం చేయడం హింస కాదు, ప్రజాపీడన కాదు అని గమనించాలి.)
ఒక CEO కూడా తన కంపెనీలోని ఉద్యోగులకు గ్రూప్ ఇన్స్యూరెన్స్ ద్వారా రక్షణ కల్పిస్తాడు. ప్రమాదకరమైన పనులు చేసేవారికి తగిన రక్షణ పరికరాలు (హెల్మెట్లు, గ్లౌజులు, ప్రత్యేకమైన దుస్తులు, మాస్కులు వంటివి) ఇస్తాడు కదా.
**********
3.1 ప్రజలను పోషించడం కూడా రాజు బాధ్యత.
ప్రజానామేవ భూత్యర్థం స తాభ్యో బలిమగ్రహీత్।
సహస్రగుణముత్స్రష్టుమ్ ఆదత్తే హి రసం రవిః।। (రఘువంశం 1.18)
ఆ దిలీపుడు ప్రజలకు మేలు చేసేందుకు మాత్రమే వారినుండి పన్నులను తీసుకున్నాడు. సూర్యుడు నీటిని ఆవిరి రూపంలో తీసుకున్నా మరలా వేయిరెట్లు అధికంగా ప్రసాదిస్తాడు కదా! అని కాళిదాసు చక్కని ఉపమానం చెప్పాడు.
సూర్యుడు భూలోకంలో మహాసముద్రంనుండి నీటిని తీసుకుంటాడు. చిన్న నీటిగుంటలు, జలాశయాల నుండి కూడా నీటిని తీసుకుంటాడు. కానీ ఆ నీరు తనకోసం కానే కాదు. మరలా వర్షరూపంలో భూలోకానికే ప్రసాదిస్తాడు. నీటిగుంటలోనూ వర్షింపజేస్తాడు. సముద్రంలోనూ వర్షింపజేస్తాడు. కానీ, నీటిగుంటనుండి తాను తీసుకున్న నీటికంటే ఎక్కువ నీటినే దానికి ఇస్తాడు. అసలు ఎటువంటి నీరూ లభ్యం కానీ అడవుల మీద, కొండలమీద కూడా పుష్కలంగా వర్షిస్తాడు. ఆ నీరు అడవులను, అడవులలోని సమస్త వృక్షజాతులను, జంతుజాలాన్ని రక్షిస్తుంది. క్రమంగా అది మైదానాలను చేరి వేలాది నీటిగుంటలను, బావులను, చెరువులను, జలాశయాలను నింపేస్తుంది. అదే ఊపులో లక్షలాది ఎకరాల భూములను సస్యశ్యామలం చేస్తుంది. సముద్రంలోకి కూడా కొంత ఎక్కువగానో తక్కువగానో చేరుతుంది. సముద్రానికి తాను తీసుకున్న నీటికంటె తక్కువ నీటిని ఇస్తాడేమో. కానీ, అందువల్ల సముద్రానికి ఎటువంటి నష్టం కలుగదు. సముద్రంలో నీరు తక్కువ కావడం అనే సమస్య ఎప్పుడూ ఎదురు కాదు.
ఇక్కడ దిలీపమహారాజు సూర్యుడు. మహాసముద్రం అంటే మహాధనికులు. నీటిగుంట అంటే మధ్యతరగతి ప్రజలు. నీరు లేని కొండలు గుట్టలు అడవులు అంటే పన్ను కట్టలేని తక్కువ ఆదాయపు ప్రజలు. రాజు మహాధనికులనుండి ఎక్కువగా పన్ను తీసుకున్నా వారికి వచ్చే నష్టం ఏమీ లేదు. వారి ఖజానా ఎన్నటికీ తరిగేది కాదు. మధ్యతరగతి ప్రజలకు వారు కట్టే పన్ను కంటే ఎక్కువ విలువ కలిగిన ప్రభుత్వసేవలు ఎలాగూ అందుతాయి. పేదలకు రాజు అందజేసేది ఏమున్నా అది వారి ఇనప్పెట్టెలలో మూలుగుతూ ఉండిపోదు. అది వారు ఖర్చు పెడితే మరలా జనంలోకి ఆదాయం రూపంలో వచ్చిపడేదే. అందువల్ల ఎవరూ వారికి రాజు ఇచ్చే ధనం వ్యర్థం అవుతుందే అని బాధ పడవలసిన పని లేదు.
అయితే ఇక్కడ రాజు పోషించడం ఆంటే కొత్త అల్లుడికిమల్లే వారిని కూర్చోబెట్టి పంచభక్ష్యపరమాన్నాలు వండి పెట్టడం కాదు. వారికి జీవనోపాధిని కల్పించడం అన్నమాట. ప్రజలందరూ తమ తమ వృత్తులను సక్రమంగా, తమ అవసరాలకు చాలినంతగా, గౌరవంగా చేసుకుని బ్రతికేందుకు తగిన పరిస్థితులు కల్పించడం రాజు బాధ్యత.
రాజా బంధురబంధూనాం రాజా చక్షురచక్షుషామ్।
రాజా పితా చ మాతా చ సర్వేషాం న్యాయవర్తినామ్।।
అన్నారు. దిక్కులేనివారికి దేవుడే దిక్కు అంటారు కదా, అలాగే, ఒక రాజ్యంలో బంధువులు లేనివారికి రాజే బంధువుట. కళ్ళు లేనివారికి (బ్రతికే దారి కనబడని వారికి) రాజే కళ్ళుట. న్యాయమార్గంలో బ్రతికే ప్రతి ఒక్కరికీ రాజే తల్లీ, రాజే తండ్రీనుట.
ఈ విషయంలో మాత్రం CEO రాజుముందు తేలిపోతాడు. ఏ కంపెనీ సీఈఓ కూడా ఇటువంటి పని దాదాపు చేయడు. తన కంపెనీకి, తన వ్యాపారానికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తికి అతడు పైసా కూడా ఇచ్చేందుకు ఇష్టపడడు. అదే ఒక రాజుగారికి, ఒక CEO కు ఉన్న తేడా! (ఇంకా ఉంది)
(మొదటి భాగం ఇక్కడ చూడండి)
*(* శ్రీనివాస కృష్ణ తిరుపతి రాష్ట్రీయ సంస్కత విద్యా పీఠంలో ప్రాచీన మేనేజ్ మెంట్ పాఠ్యాంశం బోధిస్తారు)