తిరుపతి: తిరుమలలో వెలసిన వెంకటేశ్వర స్వామి దర్శనార్థం తరలివచ్చే భక్తులతో తిరుపతి రైల్వే స్టేషన్ కు ఎప్పుడూ రద్దీగా వుంటుంది. అదొక్కటే కాదు ఆ పక్కనే వుండే చంద్రగిరి స్టేషన్ కూడా నిత్యం శ్రీవారి భక్తుల తాకిడిని ఎదుర్కొంటుంది. అందువల్ల చంద్రగిరి రైల్వే స్టేషన్ ను కూడా అభివృద్ధి చేయాలని రైల్వే ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ ను ప్రభుత్వ విప్, తుడా ఛైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరారు. 

బుధవారం తిరుపతి ఇస్కాన్ రోడ్ లోని రైల్వే అతిథి గృహంలో రైల్వే ఛైర్మన్ తో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం చంద్రగిరి రైల్వేస్టేషన అభివృద్దికి సంబంధించి వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రగిరి కి చారిత్రాత్మక గుర్తింపు ఉందని, శ్రీకృష్ణ దేవరాయలు ఇక్కడ నుంచి పాలన సాగించారని గుర్తుచేశారు. ఇటువంటి ప్రదేశాన్ని రైల్వే పరంగా అభివృద్ధి చేయాలని విన్నవించారు. తిరుపతి ట్రాఫిక్ నియంత్రణకు చంద్రగిరి రైల్వే స్టేషన్ ఆధునీకరణ ఆవస్యకమని సూచించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వపరంగా అవసరమైన సహకారాన్ని అందిస్తామని సూచించారు. 

చంద్రగిరి నుంచి భక్తులు శ్రీవారి మెట్టు, జూ పార్క్ మీదుగా అలిపిరికి చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారాని తెలిపారు. ఈ విషయమై రైల్వే ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్  కూడా సానుకూలంగా స్పందించినట్లు చేవిరెడ్డి తెలిపారు.

రైల్వే ఛైర్మన్ మాట్లాడుతూ... చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రతిపాదన సహేతుకమైనవేనని అన్నారు. తిరుపతి లో భక్తుల రద్దీ తో రైల్వే స్టేషన్ కిక్కేరుస్తోందన్నారు. ఇందుకు ప్రత్యామ్నాయ చర్యలకు పరిశీలిస్తున్నామని...ఈక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ప్రతిపాదనకు అనుగునంగా చర్యలు చేపడతామన్నారు. రైల్వే, రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ సర్వే నిర్వహించి ఆధునీకరణకు ప్రతిపాదన లు సిద్ధం చేస్తామన్నారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. 

ఏపీ రైల్వే జోన్ విషయమై రైల్వే ఛైర్మెన్ మీడియా ప్రశ్నించగా ఏడాదిలోపు జోన్ ఏర్పాటు కానుందని, ఇందుకు ప్రత్యేక కమిటీని నియమించినట్లు తెలిపారు. తిరుపతి ఆర్సీ రోడ్డు లోని అండర్ గ్రౌండ్ ఏర్పాటు అంశం తుడా పరిధిలో పెండింగ్ లో ఉందని రైల్వే చెర్మెన్ చెప్పగా త్వరితగతిన మా నుంచి
 పూర్తి సహకారం అందిస్తామని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. 

పాకాలలో రైల్వే అండర్ బ్రిడ్జి సమస్యను పరిష్కరిస్తామని వినోద్ కుమార్ యాదవ్ చెప్పారు. తిరుపతి వరల్డ్ క్లాస్ స్టేషన్ ఆధునీకరణ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తే తిరుపతి ఆధునీకరణ పనులకు టెండర్లు పిలిచి అభివృద్ధికి చర్యలు చేపడతామనీ రైల్వే ఛైర్మెన్ తెలిపారు. ఈ సమావేశంలో రైల్వే జీఎం గజానన్ మాల్యా, డీర్ఎం అలోక్ తివారీ, తిరుపతి స్టేషన్ డైరెక్టర్ నాగరమన శర్మ తదితరులు పాల్గొన్నారు.