ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచ కప్ లో భారత జట్టు ఎంపిక సరిగ్గా జరగలేదని సెలెక్టర్లపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు అయితే బహిరంగంగానే ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీపై విమర్శలు గుప్పించాడు. అతడితో పాటు కొందరు మాజీలు, విశ్లేషకులు, అభిమానులు కూడా ఆటగాళ్ల ఎంపిక విషయంలో సెలెక్టర్లను తప్పుబట్టారు. దీంతో 2020లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ లో అయినా అలాంటి విమర్శలను  ఎదుర్కోకుండా ఆటగాళ్ల ఎంపికను చేపట్టాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లున్నారు. అందుకోసం సౌతాఫ్రికాతో జరగనున్న టీ20 సీరిస్ ను ప్రయోగాల కోసం ఉపయోగించుకుంటోంది. 

ఇటీవలకాలంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ తో పాటు అంతర్జాతీయ స్థాయిలో యువ క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. అలాంటివారికి టీ20 వరల్డ్ కప్ కు ముందు మంచి అవకాశాలిచ్చి పరీక్షించదల్చినట్లు టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు. అందుకోసమే కొంతమంది సీనియర్ ఆటగాళ్లను పక్కనబెట్టాల్సి వస్తోందని...ఈ క్రమంలోనే సౌతాఫ్రికాతో టీ20 సీరిస్ కు యజువేందర్ చాహల్, కుల్దీప్ యాదవ్ లను పక్కనబెట్టినట్లు వెల్లడించారు. 

నిజానికి వారిద్దరు ఇప్పటికే ఉత్తమ స్పిన్నర్లుగా నిరూపించుకున్నారని ఎమ్మెస్కే అన్నారు. జట్టును ఎప్పుడు ఎంపిక చేసినా వారిద్దరు ముందు వరుసలోనే వుంటారు. కానీ టీ20 వరల్డ్ కప్ కోసం యువకులను పరీక్షించాల్సి రావడంతో వారిని ఎంపికచేయలేదన్నారు. అంతేకానీ వారి ప్రతిభ, ప్రదర్శనపై మాకు ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. 

'' ఇటీవల కాలంలో నవదీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్ వంటి బౌలర్లు, కృనాల్ పాండ్యా , శ్రేయాస్ అయ్యర్ వంటి బ్యాట్ మెన్స్ అద్భుతాలు చేస్తున్నారు. దీంతో టీ20 ప్రపంచ కప్ కోసం వారి పేర్లు  పరిశీంచాల్సి  రావచ్చు. అందువల్ల వారికి మరికొన్ని అవకాశాలిచ్చి పరీక్షించాల్సి వస్తోంది. అందుకోసమే ఈ నెల 15వ తేదీ నుండి  దక్షిణాఫ్రికాతో ఆరంభమయ్యే టీ20 సీరిస్ లో వారికి  అవకాశం కల్పించాం. ఈ క్రమంలోనే కుల్దీప్, చాహల్ లను పక్కనబెట్టాం.'' అని ఎమ్మెస్కే వివరణ ఇచ్చాడు.

సంబంధిత వార్తలు

భారత్ లో ద్వైపాక్షిక సీరిస్ ల షెడ్యూల్... వైజాగ్ కు రెండు, హైదరాబాద్ కు ఒకటి

దక్షిణాఫ్రికాతో టీ20 సీరిస్...ధోనిని ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే: ఎమ్మెస్కే ప్రసాద్

ఇండియా-సౌతాఫ్రికా టీ20 సీరిస్... ధోనిని పక్కనబెట్టాలన్నది కోహ్లీ ఆలోచనే: గంగూలీ

సంచలన నిర్ణయాలు... భారత పర్యటనకు సౌతాఫ్రికా టీం ఎంపిక