వచ్చే నెలలో(సెప్టెంబర్) ప్రారంభంకానున్న భారత పర్యటన కోసం దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించారు. అయితే వన్డే ప్రపంచ కప్ లో ఘోర వైఫల్యం, వచ్చే ఏడాది(2020) జరగనున్న టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో వుంచుకుని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. జట్టు సారథ్య బాధ్యతల నుండి డుప్లెసిస్ ను తప్పించి వికెట్ కీపర్ డికాక్ కు అప్పగించింది. అయితే టెస్ట్ జట్టుకు మాత్రం అతన్నే కెప్టెన్ గా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. 

ఇక సీనియర్ ఆటగాడు డివిలియర్స్ ప్రపంచ కప్ కు ముందే రిటైర్మెంట్ ప్రకటించగా తాజాగా మరో ముగ్గురు సీనియర్లు కూడా అదేబాటలో నడిచారు. గాయం  కారణంగా వరల్డ్ కప్ టోర్నీకి దూరమైన కీలక బౌలర్ డేల్ స్టెయిన్ తో పాటు స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్, ఓపెనర్ హషీమ్ ఆమ్లాలు ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు  గుడ్ బై చెప్పారు. దీంతో పలువురు యువ ఆటగాళ్లకు భారత్ జరిగే  సీరిస్ ద్వారా ఆరంగేట్రం  చేసే అవకాశం వచ్చింది. 

సీనియర్ బౌలర్ల రిటైర్మెంట్ తో బలహీనంగా మారిన బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసేందుకు సౌతాఫ్రికా సెలెక్టర్లు పూనుకున్నారు. అందుకోసం ఏకంగా ముగ్గురు  యువ  బౌలర్లకు భారత్ పర్యటించే అవకాశాన్ని కల్పించారు. స్పిన్నర్లు కేశవ్ మహరాజ్, ముత్తస్వామి, డేన్ పీడ్ట్ లు మొదటిసారి ఓ అంతర్జాతీయ  పర్యటన కోసం ఎంపికయ్యారు. 

''పటిష్టమైన భారత జట్టును వారి స్వదేశంలోనే ఓడించాలంటే ప్రతి ఆటగాడు అత్యుత్తమంగా ఆడాల్సి వుంటుంది. అందుకోసమే కీలక ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ పై కాస్త ఒత్తిడి తగ్గించడానికే టీ20 కెప్టెన్సీ  భాద్యతల నుండి  తప్పించాం. అంతేకాకుండా వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. అప్పటివరకు డికాక్ కు కాస్త కెప్టెన్సీ అనుభవం వస్తుంది కాబట్టి ఐసిసి టోర్నీలో వుండే ఒత్తిడిని తట్టుకోగలడు. ప్రస్తుతం తాము తీసుకున్న  నిర్ణయాలు జట్టు ఆటతీరును మారుస్తాయని బలంగా నమ్ముతున్నాం.''  అని సిఎస్‌ఎ యాక్టింగ్ డైరెక్టర్ క్యారీ వాన్ జిల్ వెల్లడించాడు.    

సెప్టెంబర్ 15 న భారత్ వెస్టిండిస్ ల మధ్య మొదటి టీ20 మ్యాచ్ ధర్మశాలలో జరగనుంది. ఆ తర్వాత రెండో టీ20 18న మొహాలీలో,  మూడో టీ20  22న బెంగళూరులో జరగనుంది. ఇక మూడు టెస్టుల సీరిస్ అక్టోబర్ 2 నుండి  ప్రారంభంకానుంది. మొదటి  టెస్ట్  అక్టోబర్ 2-6 వ తేదీ వరకు విశాఖపట్నంలో, రెండో టెస్ట్ అక్టోబర్ 10-14 వ తేదీ రాంచీలో,  మూడో టెస్ట్ అక్టోబర్ 19-22వ  తేదీ వరకు పుణేలో జరగనుంది.  
 
సౌతాఫ్రికా టెస్ట్ టీం: 

ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), బవుమా, డిబ్రుయున్, డికాక్, ఎల్గర్, హమ్జా, కేశవ్ మహరాజ్,మక్రమ్, ముత్తుస్వామి, ఎంగిడి, నాడ్జ్, ఫిలాండర్, డేన్ పిడ్ట్, కగిసో రబాడ, రుడి సెకండ్

సౌతాఫ్రికా టీ20 టీం:

డికాక్(కెప్టెన్), వాండర్ డుస్సెన్(వైస్  కెప్టెన్), బవుమా, జూనియర్ డాల, ఫార్ట్యూన్, హెండ్రిక్స్, రీజ హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, నాట్జ్, ఫెహ్లుక్వాయో, ప్రిటోరియస్, కగిసో రబాడా,  షంసీ, జోన్ జోన్ స్మట్స్