వెస్టిండిస్ పర్యటన తర్వాత టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇందులో భాగంగా మొదట సెప్టెంబర్ 15నుండి టీ20 సీరిస్ ఆరంభంకానుంది. ఇలా మూడు టీ20 మ్యాచుల్లో సఫారీలతో తలపడనున్న భారత జట్టును ఇటీవలే సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. అయితే ఇందులో  సీనియర్ ప్లేయర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి చోటు దక్కకపోవడం అభిమానుల్లో పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ స్వయంగా స్పందిస్తూ ధోనిని పక్కనబెట్టడానికి గల కారణాలను వివరించారు. 

ధోని గతంలో చేసిన అభ్యర్థనను దృష్టిలో వుంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రసాద్ వెల్లడించాడు. దక్షిణాఫ్రికాతో టీ20 సీరిస్ కు కూడా తనను పరిగణలోకి తీసుకోవద్దని ధోని స్వయంగా తమకు సమాచారం అందించాడు. అందువల్లే అతన్ని ఈ సీరిస్ కు ఎంపికచేయలేదని ఎమ్మెస్కే  వివరణ ఇచ్చుకున్నారు. 

'' భారత ఆర్మీకి సేవలందించేందుకు ధోని రెండు నెలల పాటు అనుమతి తీసుకున్నాడు. అలా జూలై 12 నుండి సెప్టెంబర్ 21వ తేదీ వరకు తాను అందుబాటులో వుండనని తెలిపాడు. అందువల్లే వెస్టిండిస్ పర్యటనకు, సౌతాఫ్రికాతో టీ20 సీరిస్ కు ధోని పేరునే పరిగణలోకి తీసుకోలేదు. అధికారికంగా ధోని టీ20 సీరిస్ ముగిసిన తర్వాత అందుబాటులోకి రానున్నాడు.'' అని ఎమ్మెస్కే వెల్లడించాడు. 

ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవంతో ఇండియన్ ఆర్మీలోబ ధోని సేవలు ముగిశాయి. దీంతో అతడు కుటుంబంతో కలిసి ఇటీవలే యూఎస్ కు వెళ్లాడు. అక్కడి నుండి వచ్చిన తర్వాత ధోని మళ్లీ జట్టుతో కలిసే అవకాశాలున్నాయి. ఇంగ్లాండ్ వేదికన జరిగిన ప్రపంచ కప్ టోర్నీ తర్వాత ధోని క్రికెట్ కు కాస్త విరామం ప్రకటించాడు. 

రెగ్యులర్ వికెట్ కీపర్ ధోని వెస్టిండిస్ పర్యటనకు అందుబాటులో లేకపోవడంతో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కి అవకాశం లభించింది. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగనున్న టీ20 సీరిస్ లో కూడా అతడే వికెట్ కీపర్ గా ఎంపికయ్యాడు. ఐసిసి టీ20 వరల్డ్ కప్ 2020 కి ముందస్తు సన్నాహకంగానే రిషబ్ పంత్ ను పూర్తిస్థాయి వికెట్ కీపర్ గా మార్చాలని టీమిండియా మేనేజ్ మెంట్ భావిస్తోంది.