లండన్: నగ్న చిత్రం పోస్టు చేసి సంచలనం సృష్టించిన ఇంగ్లాండు మహిళా క్రికెటర్ సారా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంది. ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకు అప్పట్లో సోషల్ మీడియాలో తన నగ్న చిత్రాన్ని పోస్టు చేసింది. ఆందోళనకు సంబంధించిన రుగ్మతతో బాధపడుతున్న తాను ఇకపై క్రికెట్ ఆడలేనని చెప్పింది. 

30 ఏళ్ల సారా ఇంగ్లాండు తరఫున 2006లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టింది. మూడు ఫార్మాట్లలో ఆమె 226 మ్యాచులు ఆడి మహిళా క్రికెట్ లో అగ్రశ్రేణి క్రీడాకారిణిగా నిలిచింది. అనారోగ్యం కారణంగా ఈ మధ్య కాలంలో సారా క్రికెట్ ను ఆస్వాదించలేకపోతున్నట్లు ఇంగ్లాండు క్రికెట్ బోర్డు తెలిపింది. 

తాను తీసుకున్న నిర్ణయం కఠినమైందే అయినప్పటికీ ఇదే సరైన సమయమని సారా తెలిపింది. 2006లో తన కల నెరవేరిందని, ఇన్నేళ్లలో ఉత్తమ మహిళా క్రికెటర్లతో కలిసి సాధించిన విజయాలకు గర్వపడుతున్నానని ఆమె చెప్పింది. 

తన ఆరోగ్యం వల్ల క్రికెట్ కు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని ఆమె తెలిపింది. ఇంగ్లాండు జెర్సీలో ప్రతి నిమిషాన్ని ఆస్వాదించానని చెప్పింది. తనను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపింది. 

ఇంగ్లాండు మహిళా క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా సారా నిలిచింది. మూడు ఫార్మాట్లలో 6,533 పరుగులు చేసింది. కాగా, అనితర సాధ్యమైన రీతిలో 232 మందిని అవుట్ చేసింది.