భార‌త్‌-ఇంగ్లాండ్ మ‌ధ్య రేప‌టి నుంచి (జూలై 31) నుంచి అఖ‌రి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో టీమిండియాలో కీలక మార్పులు చోటు చేసుకోనున్న‌ట్లు క‌నిపిస్తోంది. 

పంత్ గాయంతో జురేల్‌కు అవకాశం

ఓవల్ వేదికగా గురువారం ప్రారంభమయ్యే ఐదో టెస్టులో రిషభ్ పంత్ స్థానంలో జురేల్ జట్టులోకి రానున్నారు. పంత్ కుడి కాలికి ఫ్రాక్చర్ కావడంతో సిరీస్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మునుపటి మ్యాచ్‌ల్లో పంత్ చేతికి గాయం కావడంతో జురేల్ రెండు సార్లు వికెట్ కీప‌ర్‌గా బాధ్య‌త‌లు తీసుకున్నాడు.

కోటక్ విశ్వాసం

భారత క్రికెట్ జట్టు కోచింగ్ బృందంలో ఒకరైన సితాన్షు కొట‌క్ తాజాగా నిర్వ‌హించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. "ధ్రువ్ అద్భుతమైన ప్రతిభ కలవాడు. అతను మంచి వికెట్ కీపర్ మాత్రమే కాదు, బ్యాటింగ్‌లో కూడా మంచి ఆట‌తీరును క‌న‌బ‌రుస్తాడు. ఇంగ్లాండ్‌లో మ్యాచ్‌లు ఆడకపోయినా నెట్ ప్రాక్టీస్‌లో అతను బాగా ప‌ర్ఫామ్ చేశాడు. అవసరం వచ్చినప్పుడు జట్టుకు ఉపయోగపడతాడు" అన్నారు.

వికెట్ కీపింగ్‌పై విమర్శలు

లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో జురేల్ వికెట్ కీపింగ్ వైఫ‌ల్యంపై విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే కోటక్ వివరణ ఇస్తూ, "ఆ మ్యాచ్‌లో బంతి ఎత్తుగా లేచి పడటం, అంచనాలు మించి పిచ్ బౌన్స్ మారటం వల్ల పరిస్థితులు కఠినంగా మారాయి. అయినా కూడా అతను బాగా కీపింగ్ చేశాడు" అన్నారు.

ఇదిలా ఉంటే జురేల్ గతంలో ఇంగ్లాండ్‌ పై మంచి ఫామ్ చూపించాడు. ఈ సిరీస్‌ ముందు భారత్ A తరపున ఇంగ్లాండ్ లయన్స్‌ పై వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. అంతేకాక, గత ఏడాది రాంచీలో జరిగిన టెస్టులో 90 పరుగులతో మ్యాచ్‌ గెలిపించాడు.

ఓవల్ టెస్టులో కీలక పాత్ర

జురేల్ రాబోయే టెస్టులో వికెట్‌కీపర్ బ్యాటర్‌గా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అతని ప్రాక్టీస్‌, గత అనుభవం జట్టుకు ప్లస్ అవుతుందని బ్యాటింగ్ కోచ్ విశ్వాసం వ్యక్తం చేశారు. సిరీస్‌ ఫలితాన్ని నిర్ణయించే ఈ టెస్టులో జురేల్ ప్రదర్శనపై అందరి చూపు ఉంది.