TTD: ఈ దారిలో తిరుమల వెళ్తున్నారా.? అయితే జాగ్రత్త. అసలేం జరిగిందంటే
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతీ రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక కాలి నడకగా చేరుకునే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. కాగా తాజాగా నడక మార్గంలో జరిగిన ఓ సంఘటనతో అధికారులు భక్తులను అలర్ట్ చేశారు.

ఏనుగుల కలకలం
తిరుమల శ్రీవారి దర్శనానికి వేలాది మంది భక్తులు నిత్యం కాలినడకన మెట్టు మార్గం ద్వారా ప్రయాణిస్తారు. కానీ, సోమవారం రాత్రి భక్తులకు భయాందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. చంద్రగిరి పరిధిలోని శ్రీవారి మెట్టు మార్గంలో అకస్మాత్తుగా ఏనుగుల గుంపు ప్రత్యక్షమై హడావుడి రేపింది.
డ్రోన్ కెమెరాలో ఏనుగుల గుంపు గుర్తింపు
పంప్ హౌస్ సమీపంలో 10 నుంచి 13 ఏనుగులు సంచరిస్తున్నట్లు అధికారులు డ్రోన్ కెమెరా సాయంతో గుర్తించారు. వెంటనే టీటీడీ విజిలెన్స్, అటవీ శాఖ, ఫారెస్ట్ అధికారుల బృందాలు అక్కడకు చేరుకొని పరిస్థితిని నియంత్రించే చర్యలు చేపట్టాయి. శ్రీ వినాయక స్వామి చెక్‌పాయింట్ వద్ద భక్తులను దాదాపు గంట పాటు ఆపి భద్రతా ఏర్పాట్లు చేశారు.
పంటల ధ్వంసం
ఏనుగుల సంచారం కారణంగా సమీపంలోని పంట పొలాలు నాశనమయ్యాయి. భక్తులు సురక్షితంగా ఉండేలా అధికార బృందం వారిని చిన్న చిన్న గుంపులుగా విడదీసి మెట్టు మార్గంలో ముందుకు పంపింది. ఈ మార్గంలో ప్రయాణించే ప్రతి భక్తుడు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజిలెన్స్ హెచ్చరించింది.
భక్తుల రద్దీ ఎలా ఉందంటే.?
ఇక తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే కొనసాగింది. సోమవారం 77,044 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శించుకున్నారు. 28,478 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, హుండీ ఆదాయం రూ. 5.44 కోట్లుగా నమోదైంది. ప్రస్తుతం 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండగా, టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతుంది.
పవన్ కళ్యాణ్ ఆదేశాలు
ఏనుగుల సంచరం గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఏనుగులు సంచరించే ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అధికారులు సూచించారు. గ్రామస్తులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు. అటవీ శాఖ సిబ్బంది ఆయా గ్రామాల్లో నిరంతర పర్యవేక్షణ చేయాలని, అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఏనుగులు సంచరించే ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి
•గ్రామస్తులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ముందస్తు సమాచారం ఇవ్వాలి
•అటవీ శాఖ సిబ్బంది ఆయా గ్రామాల్లో నిరంతర పర్యవేక్షణ చేయాలి
•అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఉప ముఖ్యమంత్రి @PawanKalyan ఆదేశాలు
చిత్తూరు, తిరుపతి…— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) July 29, 2025
ఆగస్టు నెలలో తిరుమల విశేష ఉత్సవాలు
ఆగస్టు నెలలో తిరుమలలో పలు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నారు. వీటిలో ముఖ్యమైనవి ఇవే..
ఆగస్టు 2 – మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్థంతి
ఆగస్టు 4 – పవిత్రోత్సవాల అంకురార్పణ
ఆగస్టు 5 నుండి 7 వరకు – తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు
ఆగస్టు 8 – ఆళ్వందార్ల వర్ష తిరు నక్షత్రం
ఆగస్టు 9 – శ్రావణ పౌర్ణమి గరుడసేవ
ఆగస్టు 10 – విఖనసాచార్యుల సన్నిధికి వేంచేపు
ఆగస్టు 16 – గోకులాష్టమి ఆస్థానం
ఆగస్టు 17 – శిక్యోత్సవం
ఆగస్టు 25 – బలరామ జయంతి, వరాహ జయంతి