ర‌ష్యాలో భారీ భూకంపం సంభ‌వించింది. ఈ భూకంప ధాటికి అధికారులు సునామీ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. స‌ముద్రంలో అల‌లు ముంచుకొస్తున్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 

DID YOU
KNOW
?
2011 త‌ర్వాత అతి పెద్ద‌ది
రిక్ట‌ర్ స్కేల్‌పై 8.7గా న‌మోదైన‌ కమ్చట్కా భూకంపం .. 2011 టోక్యో భూకంపం తర్వాత అతిపెద్దద‌ని గణాంకాలు చెబుతున్నాయి.

రష్యా తూర్పు ప్రాంతం కమ్చట్కా ద్వీపకల్పం సమీపంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 8.7గా నమోదైందని జపాన్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ప్రకంపనల కారణంగా రష్యా, జపాన్ తీర ప్రాంతాలతో పాటు పసిఫిక్ మహాసముద్రానికి ఆనుకుని ఉన్న అనేక దీవులపై సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.

సునామీ హెచ్చరికలు – పలు దేశాలు అలర్ట్

భూకంపం ప్రభావంతో సముద్రంలో పెద్ద అలలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అమెరికా హవాయి, అలస్కా, గువామ్ దీవుల్లోనూ సునామీ హెచ్చరికలు అమల్లోకి తెచ్చారు. సైపాన్, రోటా, టినియన్ వంటి సమీప దీవులకు కూడా ముందస్తు అప్రమత్తం జారీ చేశారు.

జపాన్ తీర ప్రాంతాల్లో అలజడి

జపాన్ ఉత్తర ప్రాంతానికి 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ కారణంగా జపాన్ పసిఫిక్ తీర ప్రాంతాలకు ఒక మీటర్ ఎత్తులో అలలు తాకే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరించింది. హోకైడో ప్రాంతంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Scroll to load tweet…

సముద్రంలో ఎగిసిపడుతున్న భారీ అలలు

భూకంపం తర్వాత సముద్రంలో మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ అలలు తీరానికి చేరితే తీరప్రాంత ప్రజల భద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి

రష్యాలోని పెట్రోపావ్లోవ్స్క్-కమ్చట్కా నగరంలో భూకంపం సమయంలో భవనాలు బలంగా కంపించాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. విద్యుత్ సరఫరా, మొబైల్ నెట్‌వర్క్‌లు కొంతసేపు నిలిచిపోయాయి. ప్రస్తుతం అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.

Scroll to load tweet…

ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు ఇంకా లేవు

ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం వివరాలు అందలేదు. అయితే పరిస్థితిని దగ్గరగా పరిశీలిస్తున్నట్లు రష్యా, జపాన్ అధికారులు వెల్లడించారు. యూఎస్ జియోలాజికల్ సర్వే రానున్న మూడు గంటలు కీలకమని తెలిపింది.

Scroll to load tweet…