ఆర్సీబీ విజ‌యోత్స‌వ ర్యాలీలో జ‌రిగిన ప్ర‌మాదం ఎంత‌టి విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే. ఈ సంఘ‌ట‌న యావ‌త్ దేశాన్ని ఉలిక్కిప‌డేలా చేసింది. 11 మంది మ‌ర‌ణించిన ఈ విషాద ఘ‌ట‌న‌కు సంబంధించిన ఓ వార్త అంద‌రికీ క‌లిచివేస్తోంది.

ఐపీఎల్ 2025 ఛాంపియ‌న్స్‌గా నిలిచిన త‌ర్వాత ఆర్సీబీ జ‌ట్టు బెంగ‌ళూరు చేరుకుంది. ఈ సంద‌ర్భంగా చిన్న‌స్వామి స్టేడియంలో విజ‌యోత్స‌వ స‌భ‌కు ఏర్పాటు చేశారు. అయితే అభిమానులు భారీ ఎత్తున గుమిగూడ‌డం, గేట్లు ఒక్క‌సారిగా తెర‌వ‌డం వ‌ల్ల తొక్కిసలాట జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో 11 మంది మ‌ర‌ణించారు. ఈ ఘటన ఎన్నో కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చింది.

ఒక తండ్రి తన కుమారుడి మ‌ర‌ణంపై స్పందించిన తీరు కంట‌త‌డి పెట్టిస్తోంది. "నాకు ఒక్క కొడుకే. ఇంట్లో చెప్పకుండా వచ్చాడు. ఇలా ప్రాణాలు కోల్పోయాడు. నా కొడుకును తిరిగి ఎవ్వరూ తీసుకురాలేరు. కనీసం ఆయన మృతదేహాన్ని ముక్కలు చేయకండి. పోస్టుమార్టం వద్దు" అని ఆ తండ్రి చేసిన క‌న్నీటి విజ్ఞ‌ప్తి అంద‌రినీ భావోద్వేగానికి గురి చేసింది.

మొత్తం 11 మంది మృతి

ఈ తొక్కిసలాటలో మొత్తం 11 మంది మృతి చెందగా, మరో 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. బాధితులను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేరుగా పరామర్శించారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశిస్తూ 15 రోజుల్లోగా నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.

ఆర్సీబీ టీమ్ వ‌స్తుంద‌న్న వార్త తెలిసిన వేలాది మంది అభిమానులు చిన్నస్వామి స్టేడియానికి తరలివచ్చారు. అనూహ్యంగా పెరిగిన జనసందోహాన్ని పోలీసులు స‌మ‌ర్థ‌వంతంగా మ్యానేజ్ చేయ‌లేక‌పోయారు. ఊహించ‌ని స్థాయిలో జ‌నం రావ‌డంతో ప‌రిస్థితి చేయి దాటింది.