RCB Stampede: బెంగళూరులో ఆర్‌సీబీ విజయ సంబరాల్లో చిన్నస్వామి స్టేడియం వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే అక్కడి ప్రాంతాల్లో భారీ రద్దీ కారణంగా మెట్రో స్టేషన్లను మూసివేశారు.
RCB stampede - Bangalore Metro stations closed: ఐపీఎల్ 2025 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పంజాబ్ పై గెలిచి ఛాంపియన్ గా నిలిచింది. ఈ విజయం అనంతరం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే సంబరాల కోసం భాగంగా భారీగా జనం తరలివచ్చారు.
తొక్కిసలాట భయంతో మెట్రో సర్వీసులు బంద్
ఈ క్రమంలోనే అక్కడ తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మంది గాయపడ్డారు. స్టేడియంలో జనం, బయట జనం, సరిసరాలు కూడా రద్దీగా మారడం, అలాగే, మెట్రో స్టేషన్లలో రద్దీ పెరగడంతో బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ఐదు ప్రధాన మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసింది.
బుధవారం సాయంత్రం 4:30 గంటల నుంచి తదుపరి ప్రకటన వచ్చే వరకు కబ్‌బన్ పార్క్, విధానసౌధ,సెంట్రల్ కాలేజ, MG రోడ్, ట్రినిటీ మెట్రో స్టేషన్లలో రైళ్లు ఆగడం నిలిపివేశారు. కబ్‌బన్ పార్క్ స్టేషన్ స్టేడియానికి సమీపంలో ఉండటంతో, లోపలికి వస్తున్న ప్రయాణికుల సంఖ్య బయటకు వెళ్తున్న వారి కంటే ఎక్కువగా ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట భయంతో మెట్రో సేవలను నిలిపివేశారు.
BMRCL ఒక ప్రకటనలో.. "విధానసౌధ, చిన్నస్వామి స్టేడియంల వద్ద అత్యధిక రద్దీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రయాణికులు ఇతర మార్గాలను వినియోగించాలి" అని పేర్కొంది. ఈ స్టేషన్లలో టోకెన్, QR టికెట్ల విక్రయ సేవలు కూడా తాత్కాలికంగా నిలిపివేశారు.
BMRCL చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ బీఎల్ యశ్వంత్ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం.. పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన చోట అదనపు రైళ్లు నడిపే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వైట్‌ఫీల్డ్ నుండి చల్లఘట్ట, మెజెస్టిక్ నుండి బయ్యప్పనహళ్లి మధ్య మరిన్ని అదనపు రైళ్లను నడిపించారు. కొంతమంది ప్రయాణికులు MG రోడ్ వద్ద ప్రయాణం ముగించాల్సి వచ్చిందని తెలిపారు.
ఒక సీనియర్ అధికారి తెలిపిన ప్రకారం, "స్టేషన్ వెలుపల తొక్కిసలాట ఏర్పడే పరిస్థితి ఉండటంతో, లోపల అదే పరిస్థితి ఏర్పడకుండా నివారించేందుకు మూసివేశాం. ఈ స్టేషన్లలో ప్లాట్‌ఫామ్‌లు చిన్నవి, అధిక జనసందోహాన్ని తట్టుకోలేవు" అని తెలిపారు.
ప్రస్తుతం ప్రయాణికులు సెంట్రల్ కాలేజ్ లేదా MG రోడ్ స్టేషన్లలో దిగుతున్నారు. కాగా, తొక్కిసలాట ఘటనతో ప్రజలలో భయం నెలకొంది. స్టేషన్‌ల లోపల ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే, స్టేడియం చుట్టూ తీవ్రమైన రద్దీ, తొక్కిసలాట పరిస్థితుల మధ్య 11 మంది మరణించారు.