Asianet News TeluguAsianet News Telugu

షోయబ్ అక్తర్ బౌలింగ్‌లో హర్భజన్ సింగ్ సిక్సర్! బూతులు తిట్టడంతో... ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో...

2010 ఆసియా కప్‌ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లో హర్భజన్ సింగ్‌తో గొడవ పడిన షోయబ్ అక్తర్... సిక్సర్‌తో మ్యాచ్‌ని ముగించి రివెంజ్ తీర్చుకున్న భజ్జీ... 

Asia Cup 2023: India vs Pakistan rivalry when heated moment between Shoaib Akhtar and Harbhajan singh CRA
Author
First Published Aug 30, 2023, 7:49 PM IST

ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ అంటే దానికి ఉంటే క్రేజ్, మరే మ్యాచ్‌కీ ఉండదు. ఇరుదేశాల మధ్య సంబంధాలు చెడిపోవడంతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఎప్పుడో ఆగిపోయాయి. ఆసియా కప్, ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఇండియా - పాకిస్తాన్ మ్యాచులు చూసే అవకాశం కలుగుతోంది..ఇప్పుడంటే ఇండియా - పాకిస్తాన్ మ్యాచులు ఫ్రెండ్లీ మ్యాచులుగా మారిపోయాయి కానీ పదేళ్ల క్రితం పరిస్థితి మరోలా ఉండేది.

రెండు శత్రుదేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగితే ఎలాంటి వాతావరణం ఉంటుందో ఇండో- పాక్ మధ్య మ్యాచులు చూస్తే అర్థమయ్యేది. ప్లేయర్ల మధ్య మాటామాటా పెరిగి, వాగ్వాదం జరగడం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచుల్లో చాలా కామన్‌గా కనిపించేది. గౌతమ్ గంభీర్, షోయబ్ అక్తర్, షాహిద్ ఆఫ్రిదీ, హర్భజన్ సింగ్ వంటి ప్లేయర్ల మధ్య జరిగిన గొడవలు ఇప్పటికీ ఇరు దేశాల క్రికెట్ ఫ్యాన్స్‌కి గుర్తుండి ఉంటాయి..

2010 ఆసియా కప్‌లో భాగంగా డంబుల్లాలో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లో హర్భజన్ సింగ్, షోయబ్ అక్తర్ మధ్య ఇలాంటి గొడవే జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, 49.3 ఓవర్లలో 267 పరుగులకి ఆలౌట్ అయ్యింది. సల్మాన్ భట్ 74, కమ్రాన్ అక్మల్ 51, షోయబ్ మాలిక్ 39 పరుగులు చేశారు. 

భారత బౌలర్లలో ప్రవీణ్ కుమార్ 3, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ రెండేసి వికెట్లు తీశారు. ఈ లక్ష్యఛేదనలో వీరేంద్ర సెహ్వాగ్ 10, విరాట్ కోహ్లీ 18 పరుగులు చేసి అవుట్ అయ్యారు. గౌతమ్ గంభీర్ 97 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 83 పరుగులు చేయగా మహేంద్ర సింగ్ ధోనీ 71 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 56 పరుగులు చేశాడు.
 
రోహిత్ శర్మ 22, రవీంద్ర జడేజా 6 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 219 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది టీమిండియా. 46వ ఓవర్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన హర్భజన్ సింగ్, షోయబ్ అక్తర్ వేసిన ఇన్నింగ్స్‌ 47వ ఓవర్‌లో లెంగ్త్ బాల్‌ని స్ట్రైయిక్ సిక్సర్‌గా మలిచాడు. ఈ షాట్‌తో చిర్రెత్తుకొచ్చిన అక్తర్, హర్భజన్ సింగ్ దగ్గరికి వెళ్లి ఏదో తిట్టాడు. హర్భజన్ సింగ్ కూడా ధీటుగా బదులిచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి, అంపైర్లు వచ్చి ఇద్దరికీ సర్దిచెప్పే దాకా వెళ్లింది..

అయితే ఈ ఎపిసోడ్ అక్కడితో అయిపోలేదు. టీమిండియా విజయానికి చివరి 2 ఓవర్లలో 16 పరుగులు కావాల్సి వచ్చాయి. షోయబ్ అక్తర్ వేసిన 49వ ఓవర్ మొదటి బంతికి సూపర్ సిక్సర్ బాదిన సురేష్ రైనా.. భజ్జీపై నోరుజారిన పాక్ బౌలర్‌పై రివెంజ్ తీర్చుకున్నాడు. మహ్మద్ అమీర్ వేసిన 50వ ఓవర్‌లో టీమిండియాకి 6 పరుగులు కావాల్సి వచ్చాయి. తొలి బంతికి సింగిల్ తీసిన సురేష్ రైనా, రెండో బంతికి రనౌట్ కావడంతో కాస్త హై డ్రామా నడిచింది.. 

మూడో బంతికి ప్రవీణ్ కుమార్ 2 పరుగులు తీయగా, నాలుగో బంతికి సింగిల్ వచ్చింది. టీమిండియా విజయానికి చివరి 2 బంతుల్లో 3 పరుగులు కావాల్సిన సమయంలో సూపర్ సిక్సర్‌తో మ్యాచ్‌ని ముగించాడు హర్భజన్ సింగ్. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే సమయంలో షోయబ్ అక్తర్ ముఖం వాడిపోయి ఉండడం కూడా టీవీ కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. ఆఖరి ఓవర్ దాకా సాగిన థ్రిల్లర్ మ్యాచ్‌లో షోయబ్ అక్తర్- హర్భజన్ సింగ్ గొడవ, టీమిండియా విజయం, ఫ్యాన్స్‌కి ఈ మ్యాచ్‌ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios