భారతదేశాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న వేళ ప్రభుత్వాలు సైతం ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందించలేకపోతున్నాయి. ప్రజలు ఆక్సిజన్ దొరక్క, ఆసుపత్రుల్లో బెడ్లు అందుబాటులో లేక, ఉన్నా ఎక్కడున్నాయో తెలియక, మందుల కోసం, ప్లాస్మా కోసం నానా తంటాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా ప్లాట్ ఫారంలు వారి పాలిటి కొంగుబంగారంగా మారాయి. ఎందరో యువకులు స్వచ్చందంగా ముందుకు వచ్చి రాత్రనకా పగలనకా ప్రజలకు తమ వంతు సహాయసహకారాలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇలా నిస్వార్థంగా సేవలందిస్తున్న యువతను గుర్తించి వారిని మీకు పరిచయం చేయడం కోసం నేటి నుండి రోజు వారీగా ఈ ఒక్కో హీరో/ షీరోలను మీ ముందుకు తీసుకువస్తున్నాము. 

మనకు తెలిసిన వారికి కరోనా సోకిందంటేనే మనం చాలా బాధపడిపోతాం. ఒక వేళ మన కుటుంబంలో ఎవరికైనా వస్తే మనం తల్లడిల్లిపోతాము. అలాంటిది కుటుంబమంతా కరోనా బారినపడితే... ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కదా. అలా ఇబ్బంది పడ్డ కుటుంబాలు బోలెడు. ఇలా తన కుటుంబంలోని అందరికీ ఒకేసారి కరోనా వచ్చి ఆసుపత్రుల్లో చేరడంతో ఒక కుర్రాడు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడు.

ఎవరు వెనక్కి తిరిగి వస్తారో, రారో కూడా తెలియని పరిస్థితిని అనుభవించిన ఆ యువకుడు ప్రస్తుత పరిస్థితుల్లో బెడ్లు దొరక్క, వైద్య సహాయం అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్న రోగులకు, వారి కుటుంబాలకు సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. 

అతడే దీపక్ సోమిశెట్టి. స్వయంగా కొన్ని ఆసుపత్రుల నంబర్లు సేకరించి, కొందరి డాక్టర్ల సహకారంతో ఏ ఆసుపత్రిలో ఎన్ని బెడ్స్ అందుబాటులో ఉన్నాయో ఆ సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నాడు. రోజు పర్సనల్ గా ఆసుపత్రులకు కాల్ చేసి అక్కడి వివరాలు సేకరించి ఎన్ని బెడ్లు అందుబాటులో ఉన్నాయో చెబుతూ పేషెంట్స్ కి అందుబాటులో ఆసుపత్రి కాంటాక్ట్ నంబర్స్ కూడా ఇస్తున్నారు. 

కరోనా వచ్చి ఆసుపత్రిలో చేరిన రోగుల పరిస్థితి ఇది. కానీ చాలా మంది ఇండ్లలో కరోనా లక్షణాలు ఉండి, టెస్టు రిజల్ట్ వచ్చే సరికి ఆలస్యం అయిపోతుంది. హాస్పిటల్ కి వెళ్దామా అంటే కోవిడ్ పరిస్థితుల భయం వల్ల వెళ్ళటం లేదు. మరికొందరు హోమ్ ఐసొలేషన్ లో ఉంటున్నారు. ఇలాంటి వారికోసం ఆన్లైన్ లో ఉచితంగా డాక్టర్ కన్సల్టేషన్ ని పొందేలా ఏర్పాటు చేసాడు ఈ కుర్రాడు. 

తన మిత్రులు చదివే మెడికల్ కాలేజీ డాక్టర్లతో మాట్లాడి వారిని ఒప్పించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. కొద్ది మంది డాక్టర్లతో ప్రారంభమైన ఈ చిన్న ప్రయత్నాన్ని చూసిన ఎందరో డాక్టర్లు ఉచితంగా సేవ చేయడానికి ముందుకు వచ్చారు. దాదాపు ఇప్పుడు 100 మంది డాక్టర్లతో రోగులకు అవసరమైన ఆన్లైన్ కన్సల్టేషన్ ని ఉచితంగా అందిస్తున్నాడు. 

వయసు కేవలం 23 సంవత్సరాలే అయినా... ఈ కుర్రాడు చేస్తున్న సేవ మాత్రం ఈ కరోనా కష్టకాలంలో చాలామందికి ఉపయోగపడుతుంది. ఈ కుర్రాడి సేవను గుర్తించి ఇప్పటికే సమంత, థమన్ వంటి సినీ ప్రముఖులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి విజయవాడలో ఉంటున్నప్పటికీ... హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో ఉన్న తన పరిచయాలను వాడుతూ ప్రజలకు సేవ చేస్తున్నాడు.

ఈ కష్టకాలంలో ప్రజలకు సేవ చేయడం ఆనందంగా అనిపిస్తుందంటున్న దీపక్... ఈ మహమ్మారిని ఓడించే వరకు ప్రజలకోసం తాను సర్వీస్ చేయడానికి సిద్ధం అంటున్నాడు. అందరూ బాగుండాలి అందులో మనముండాలి అని కోరుకుంటున్న ఈ యువకుడి సేవకు హ్యాట్సాఫ్ అనాల్సిందే..!