Asianet News TeluguAsianet News Telugu

చేతులు కాలాక: మధు కపూర్‌తో సయోధ్యకు రాణా ‘యస్’?

సరిగ్గా పదేళ్ల క్రితం ముంబై ఉగ్రదాడిలో మరణించిన రాణా కపూర్ సతీమణి మధు కపూర్‌ను డైరెక్టర్‌గా నియమించకపోవడంతో అసలు కథ మొదలైంది. రాణా కపూర్ తన ముగ్గురు కూతుళ్ల పట్ల వాత్సల్యం.. మొండి బాకీలను దాచిపెట్టేందుకు చేసిన ప్రయత్నం ఆర్బీఐ కళ్లు గప్పలేకపోయాయి. అందుకే ఎండీ కం సీఈఓగా రాణా కపూర్ కొనసాగింపునకు ఆర్బీఐ నో అంది. గడువు దగ్గర పడుతుండటంతో మధుకపూర్ కుటుంబంతో సయోధ్యకు సిద్ధమయ్యారు. కానీ సంక్షోభం నుంచి ఆయన బయటపడగలరా? అన్నదే మిలియన్ డాలర్ల సందేహం.

Yes Bank into damage control mode, calls crucial meet on December 13
Author
Mumbai, First Published Nov 26, 2018, 10:40 AM IST

ముంబై: యస్ బ్యాంకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)గా రాణా కపూర్‌ పదవీకాలాన్ని 2021 ఆగస్టు 31 వరకూ పొడిగించాలని  అభ్యర్థనను తిరస్కరించిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) వచ్చే ఏడాది జనవరి 31 నాటికి ప్రస్తుత సీఈఓ స్థానంలో మరొకరిని నియమించాలని యెస్‌ బ్యాంకుకు ఆర్బీఐ స్పష్టం చేయడంతో సదరు బ్యాంకులో ముసలం మొదలైంది. ఆర్బీఐ ఆదేశాలు రావడం మొదలు.. కొత్త సీఈఓను వెతికిపట్టే ప్యానెల్‌ కోరన్‌ ఫెర్రీ సంస్థలో సభ్యుడు భట్‌.. ఆతర్వాత, యెస్‌ బ్యాంకుకు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మెన్‌గా సేవలందిస్తున్న అశోక్‌ చావ్లా, అదే రోజు మరో స్వతంత్ర డైరెక్టర్‌ వసంత్‌ ఈ బ్యాంకు నుంచి నిష్క్రమించారు. గత మంగళవారం స్వతంత్ర డైరెక్టర్‌ ఆర్‌ చంద్రశేఖర్‌ సైతం తన పదవికి రాజీనామా చేస్తూ చేసిన వ్యాఖ్యలు యస్‌ బ్యాంకులో ఏం జరుగుతున్నదో స్పష్టం చేసింది.

రాణాకపూర్‌, అశోక్‌ కపూర్‌ కలిసి 2004లో యస్‌ బ్యాంకును ఏర్పాటు చేశారు. ఐతే, యస్‌ బ్యాంకు మరో ప్రమోటర్‌ అశోక్‌ కపూర్‌ భార్య మధుకపూర్‌.. రాణాకపూర్‌ సతీమణి బిందు కపూర్‌కు స్వయాన సోదరి. 2008 ముంబై ఉగ్రదాడుల్లో అశోక్‌ కపూర్‌ ప్రాణాలు కోల్పోయాక.. బోర్డు నామినేషన్‌ విషయంలో తమకూ హక్కు ఉన్నదని 2013 నుంచి మధుకపూర్‌ కుటుంబం లీగల్‌గా ప్రొసీడ్‌ అవడం.. రాణాకపూర్‌ అందుకు అంగీకరించకపోవడంతో సమస్య మొదలైంది. 

ఇది అంతటితో ఆగలేదు. రాణా కపూర్‌ తన ముగ్గురు కుమార్తెలు.. రాధ, రాఖి, రోషిణి కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న త్రీ సిస్టర్స్‌ ఫ్యామిలీ ఆఫీస్‌ అనే సంస్థకు లబ్ది చేకూర్చేలా పెట్టుబడులకు పాల్పడ్డారని పాల్పడ్డారని ఆరోపణ. దీని వల్ల బ్యాంకు ప్రయోజనాలకు నష్టం కలిగిందని నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ)కి ఓ ఫిర్యాదు అందడం అప్పట్లో కలకలం సృష్టించింది. దీనికి తోడు బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్న పలు కంపెనీలు దివాలా తీసినా... ఖాతాల్లో మాయ చేసి.. బ్యాంకు లాభాలను కృత్రిమంగా పెంచి చూపారని రాణాపై పలు ఆరోపణలు ఉన్నాయి.

యస్‌ బ్యాంక్‌ కొత్త సీఈవో పదవి రేసులో దాదాపు పది మంది బ్యాంకర్లు ఉన్నట్టు సమాచారం. సీఈవో ఎంపిక కోసం ఏర్పాటైన కోరన్‌ ఫెర్రీ సెర్చి కమిటీ షార్ట్‌ లిస్ట్‌ చేసిన వారిలో ఒక విదేశీ బ్యాంకు చీఫ్‌తో పాటు, ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అధిపతి, మరికొన్ని ప్రైవేట్‌ బ్యాంకుల ఉన్నతస్థాయి అధికారులు ఉన్నట్టు సమాచారం. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ప్రస్తుతం సీఈఓ కం ఎండీగా ఉన్న రాణా కపూర్.. తన కష్టాల నుంచి బయట పడేందుకు బ్యాంకు కో- ప్రమోటర్ మధుకపూర్ అండ్ కుటుంబంతో రాజీ కుదుర్చుకునేందుకు పరస్పర అంగీకార ఒప్పందం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని బ్యాంకు వర్గాలు తెలిపాయి. బ్యాంకు డైరెక్టర్లు, రెండు ప్రమోటర్ గ్రూపుల మధ్య సమన్వయం పెంచుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 

ఈ ఏడాది ఆరంభంలో యాక్సిస్‌ బ్యాంక్‌ సీఈఓ శిఖా శర్మ పదవీ కాలం మరో మూడేండ్ల పాటు పొడిగింపునకు బోర్డ్‌ ఆమోదముద్ర వేసినా, ఆర్బీఐ అంగీకరించలేదు. మొండి బకాయిల వెల్లడిలో అంతరాలను కప్పిపుచ్చడమే ఆమె పదవికి ఎసరుపెట్టింది. ఇక, వీడియోకాన్‌ కుంభకోణం నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈఓ చందా కొచ్చర్‌ను సైతం ఆర్బీఐ పదవి నుంచి తప్పుకునేలా చేయడం తెలిసిందే!

ఆర్బీఐ నిర్దేశించిన జనవరి 31 తేదీ దగ్గరపడుతున్నా ఇంకా కొత్త సీఈఓ, చైర్మన్‌ అన్వేషణ సరైనంత వేగంగా జరగడం లేదన్న కారణంతోనే స్వతంత్ర డైరెక్టర్‌ ఆర్‌ చంద్రశేఖర్‌ బ్యాంకు నుంచి వైదొలిగారని ఆయన మాటలతో రుజువైంది. ఇక, ఎయిర్‌ సెల్‌ - మ్యాక్సిస్‌ కేసులో యస్‌ బ్యాంకు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మెన్‌ అశోక్‌ చావ్లా పేరును సీబీఐ చార్జ్‌ షీట్‌లో చేర్చడం, ఈ అంశం పలుమార్లు డైరెక్టర్ల బోర్డు సమావేశంలో చర్చకు రావడంతో ఈ వివాదానికి స్వస్తి పలికేందుకే చావ్లా పదవి నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.

ఆడిట్‌ కమిటీ పనితీరు విషయంలో అసంతృప్తితో వసంత్‌ గుజరాతీ, విదేశీ బ్యాంకుకు గతంలో సలహాదారుగా సేవలందించినందున సీఈవో ఎంపిక నిర్ణ యంపై తన ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో సీఈఓను వెతికిపట్టే ప్యానెల్‌ నుంచి భట్‌ వైదొలిగారని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. బ్యాంకు డైరెక్టర్లు రాజీనామా చేయడంతో పరిస్థితి మరింత విషమించకుండా ఉండేందుకు వచ్చే నెల 13న బోర్డు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బ్యాంకు చైర్మన్, సీఈఓ, స్వతంత్ర డైరెక్టర్ నియామకంపై చర్చించనున్నారు. కొందరు డైరెక్టర్లు వైదొలిగినా బ్యాంకు ఎండీ, సీఈఓ ఎంపిక ప్రక్రియపై ఎటువంటి ప్రభావం ఉండబోదని పేర్కొనడం గమనార్హం. అంతకు ముందు రోజే సీఈఓ, ఎండీ ఎంపికకు కమిటీ సమావేశమై అభ్యర్థుల జాబితాను కుదిస్తుందని కూడా పేర్కొంది. 

కానీ స్వతంత్ర డైరెక్టర్ భట్‌ నిష్క్రమణకు ఇంకేదో కారణం ఉన్నదని ఆర్థిక  విశ్లేషకుల అభిప్రాయం. కాగా, గత రెండేళ్లలో యస్‌ బ్యాంక్‌ మొండి బాకీలు రూ.11 వేల కోట్ల కుపైగా పేరుకు పోయినా.. మొండి బకాయిలను తక్కువ చేసి చూపించి వాటాదారులను తప్పుదారి పట్టించడం, కార్పొరేట్‌ పాలన నిబంధనలను తుంగలో తొక్కారన్న కారణంగా యస్‌ బ్యాంకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రాణా కపూర్‌ను మరికొంత కాలం అదే స్థానంలో కొనసాగించడానికి ఆర్బీఐ తిరస్కరించడం విదితమే!
 

Follow Us:
Download App:
  • android
  • ios