WhatsApp Data Leak: చరిత్రలోనే అతి పెద్ద డేటా బ్రీచ్, 84 దేశాలకు చెందిన 50 కోట్ల మంది వాట్సప్ యూజర్ల డేటా లీక్
సుమారు 84 దేశాలకు చెందిన 50 కోట్ల మంది వాట్సాప్ వినియోగదారుల డేటా ఆన్‌లైన్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉందని ప్రముఖ పోర్టల్ సైబర్ న్యూస్ బాంబు పేల్చింది. ఈ డేటాలో సుమారు 50 కోట్ల మంది వాట్సప్ యూజర్ల నంబర్లు కూడా లీక్ అయ్యాయని తేల్చింది. డేటా లీక్ గురించి వాట్సాప్ యజమాని మెటా ఇప్పటి వరకూ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
సోషల్ మెసేజింగ్ యాప్ Whatsappకు సంబంధించిన అతిపెద్ద డేటా బ్రీచ్ మొత్తం టెక్ ప్రపంచాన్ని కలవరానికి గురి చేస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా దాదాపు 50 కోట్ల మంది వాట్సాప్ యూజర్ల ఫోన్ నంబర్లు లీక్ చేసి, హ్యాకర్లు ఆ నెంబర్లను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారనే వార్తలు మొత్తం ప్రపంచాన్ని ఆందోళనలో పడేశాయి. సైబర్ న్యూస్ పోర్టల్ రిపోర్ట్ ప్రకారం ఇది ఇప్పటివరకు చరిత్రలో జరిగిన అతి పెద్ద డేటా బ్రీచ్ లలో ఇది ఒకటని చెబుతున్నారు.
ఈ దొంగిలించిన డేటా మొత్తం, ప్రముఖ హ్యాకింగ్ ఫోరమ్‌లో విక్రయానికి సిద్ధంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ డేటాబేస్ 84 దేశాలకు చెందిన వాట్సాప్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని కలిగి ఉందని సైబర్ న్యూస్ ఓ రిపోర్టులో తెలిపింది. యుఎస్‌లో 32 మిలియన్ల మంది యూజర్ల రికార్డులు ఉన్నాయని డేటాను విక్రయిస్తున్న వ్యక్తి తెలిపారు. ఇది కాకుండా, ఈజిప్ట్, ఇటలీ, ఫ్రాన్స్, UK, రష్యా, భారతదేశం నుండి కోట్లాది మంది యూజర్ల డేటా కూడా లీక్ చేసినట్లు తేలింది. ఈ డేటా మొత్తం ఆన్‌లైన్‌లో అమ్ముడవుతోంది.
సైబర్ న్యూస్ నివేదిక ప్రకారం, US డేటాసెట్ 7000 డాలర్లకు అందుబాటులో ఉంది, UK డేటాసెట్ ధర 2500 డాలర్లుగా నిర్ణయించారు. డేటాను విక్రయించే కంపెనీ 1097 నంబర్లను సాంపిల్ కింద షేర్ చేసినట్లు సైబర్ న్యూస్ తెలిపింది. సైబర్ న్యూస్ ఈ నంబర్‌లను తనిఖీ చేసింది. అవన్నీ వాట్సాప్ యూజర్లకు చెందినవిగా గుర్తించబడ్డాయి, అయితే, హ్యాకర్లు డేటాను ఎలా పొందారో ఇంక తెలియలేదు.
ఇటువంటి సమాచారం తరచుగా స్మిషింగ్, విషింగ్ వంటి సైబర్ నేరాలకు ఉపయోగిస్తుంటారు. ఇందులో వినియోగదారులకు టెక్ట్స్ మెసేజీలు పంపడం, లింక్‌లపై క్లిక్ చేయమని అడగడం వంటివి ఉంటాయి. యూజర్లను తమ క్రెడిట్ కార్డ్ లేదా ఇతర వ్యక్తిగత వివరాలను అందించమని కూడా హ్యాకర్లు కోరవచ్చు.
నిజానికి WhatsApp దాదాపు ప్రతి పరికరంలో పనిచేసే సురక్షితమైన యాప్‌గా పరిగణిస్తుంటారు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ వంటి సాంకేతికతతో, WhatsApp యూజర్ డేటా భద్రత , గోప్యతను కూడా క్లెయిమ్ చేస్తుంది. అయితే, ఇప్పుడు సైబర్‌న్యూస్ కొత్త నివేదికలో మెటా యాజమాన్యంలోని వాట్సాప్‌ను హ్యాక్ చేశారని మరియు సుమారు 50 కోట్ల మంది యూజర్ల వ్యక్తిగత డేటాను దొంగిలించడం కలకలం రేపుతోంది. WhatsApp వినియోగదారుల ఈ డేటా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండటం నిజంగానే ప్రైవసీకి చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.
గతంలో కూడా డేటా లీక్ అయింది
మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్‌ను ప్రభావితం చేసే డేటా ఉల్లంఘనకు ఇది మొదటి ఉదాహరణ కాదు. గత సంవత్సరం కూడా, భారతదేశం నుండి 6 మిలియన్ల రికార్డులతో సహా 500 మిలియన్లకు పైగా ఫేస్‌బుక్ వినియోగదారుల వ్యక్తిగత డేటా లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. లీకైన డేటాలో ఫోన్ నంబర్లు, ఇతర సమాచారం ఉన్నాయి.