Unique Nests: ప్రపంచంలో ఎన్నో రకాల పక్షులున్నాయి. ప్రతి ఒక్కటి ఉండటానికి గూడు కట్టుకుంటుంది. అయితే వెరైటీగా, చాలా భిన్నంగా గూళ్లు నిర్మించే టాప్ 10 పక్షుల గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ మొత్తం చదవండి.
jtపక్షులు వాటి గూళ్ల తయారు చేయడంలో అద్భుతమైన సృజనాత్మకతను చూపిస్తాయి. ఏదో ఉండటానికి గూడు కట్టుకోవాలన్నట్టుగా కాకుండా చాలా అందంగా, గదులు గదులుగా నిర్మిస్తుంటాయి. అంతేకాకుండా శత్రువుల నుంచి రక్షణ పొందడానికి కూడా చాలా చాకచక్యంగా కట్టుకుంటాయి. కొన్ని పక్షులు చాలా వెరైటీగా గూళ్లు కడతాయి. అలాంటి 10 ప్రత్యేకమైన పక్షుల గూళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. బోవర్ బర్డ్(Bowerbird)
ఈ జాతి పక్షుల్లో మగ పక్షి మాత్రమే గూడు కడుతుంది. అది కూడా ఆడపక్షిని ఆకర్షించడానికి చాలా వెరైటీగా దీన్ని నిర్మిస్తుంది. దీన్ని ఆకర్షణ కోసం మాత్రమే ఉపయోగిస్తుంది. పూలు, బెర్రీలు, ప్లాస్టిక్ ముక్కలు వంటి రంగురంగుల వస్తువులతో డిజైన్ చేస్తుంది. అయితే ఇందులో గుడ్లు మాత్రం పెట్టవు.
2. వీవర్ బర్డ్ (Weaver Bird)
ఈ పక్షులు చాలా వెరైటీగా గూళ్లు కట్టడంలో ప్రసిద్ధి చెందాయి. ఇవి మెత్తని గడ్డి, ఆకుల్లాంటి పదార్థాలతో బాస్కెట్ ఆకారంలో గూళ్లు కడతాయి. చెట్ల కొమ్మలకే వేలాడేలా ఉండే వీటి గూళ్లలో ప్రవేశద్వారం అడుగు నుంచి ఉంటుంది. దీన్ని బట్టి ఇవి ఎంత చాకచక్యంగా గూళ్లు నిర్మిస్తాయో అర్థం చేసుకోవచ్చు.
3. బ్రష్ టర్కీ (Brush Turkey)
ఆస్ట్రేలియాలో కనిపించే ఈ పక్షి ఆకులు, మట్టితో పెద్ద బౌల్ లాంటి గూడు కడుతుంది. వీటిని గుడ్లను పొదగడానికి అవి ఉపయోగిస్తాయి. ఆకులు, మట్టి కలిపి వేయడం వల్ల కొన్ని రోజులకు అవి కుళ్లి వేడిని జనరేట్ చేస్తాయి. దీంతో సహజంగానే గుడ్లు పొదుగుతాయి.
4. వుడ్‌పెక్కర్ (Woodpecker)
వడ్రంగి పిట్టలు ఇతర పక్షుల్లా పుల్లలు, ఆకులతో గూళ్లు నిర్మించవు. చెట్ల మానును తొలచి గూళ్లు నిర్మిస్తాయి. అంతేకాకుండా వాటిల్లో గదులు కూడా ఏర్పాటు చేసుకుంటాయి. గుడ్లు పెట్టి పొదిగిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాయి. వాటిని ఇతర పక్షులు లేదా ఇతర కీటకాలు, పురుగులు నివాసంగా మార్చుకుంటాయి.
5. మాంటెజుమా ఓరోపెండోలా (Montezuma Oropendola)
మధ్య అమెరికాకు చెందిన ఉష్ణ మండల పక్షి ఇది. ఈ ట్రాపికల్ పక్షి రెండు మీటర్ల పొడవు ఉన్న వేలాడే గూళ్లను చెట్ల పైన కట్టుతుంది. ఈ పక్షులన్నీ కలిసి ఒకే చెట్టను ఎంచుకొని దానిపైనే డజన్ల కొద్ది వేలాడే గూళ్లు కట్టుకుని కలిసి మెలిసి జీవిస్తాయి.
6. కేవ్ స్విఫ్‌లెట్ (Cave Swiftlet)
దక్షిణాసియాలో కనిపించే ఈ పక్షులు తేనెపట్టు లాంటి వాటి నోటి ద్రవంతో గూళ్లు కడతాయి. వీటి కోసం ఎలాంటి ఇతర పదార్థాలను అవి వాడవు. కేవలం నోటి ద్రవాన్ని ఉపయోగించి, అది గట్టిపడిన తర్వాత ఒక రాతి గోడ లాంటి చోట అతికిస్తాయి. అలా గూడు మొత్తం నిర్మిస్తాయి. ఇవి చూడటానికి గుహల మాదిరిగా ఉంటాయి.
7. ఫ్లెమింగో (Flamingo)
ఈ పక్షి మట్టిలో చిన్న కొండ ఆకారంలో గూడు కట్టి అందులో గుడ్డును ఉంచుతుంది. ప్రతి ఫ్లెమింగో పక్షి ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది. దాన్ని సురక్షితంగా కాపాడుకోవడం కోసం ఇలా వెరైటీగా గూడు నిర్మిస్తుంది. ఈ నిర్మాణం వల్ల వర్షకాలంలోనూ గుడ్డు నీటిలో మునిగిపోకుండా ఉంటుంది.
8. మెగపోడ్ (Megapode)
ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో కనిపించే ఈ మెగాపోడ్ పక్షి ఇతర పక్షుల్లా గూడు కట్టదు. ఇది కూడా మట్టితో కూడిన బౌల్ లాంటి నిర్మాణాన్ని కడుతుంది. కుళ్ళి, వేడిని పుట్టించే స్వభావం ఉన్న ఆకులు, మట్టి ఉపయోగించి ఈ గూడు కడుతుంది. అందులో గుడ్లు పెడుతుంది.
9. హార్న్డ్ కూట్ (Horned Coot)
ఆండీస్ పర్వతాల్లోని మంచు తీరాల వద్ద రాళ్లతో స్టేజి లాగా గూడు కడుతుంది హార్న్డ్ కూట్ పక్షి. నునుపు రాళ్లను ఒక్కొక్కటిగా తరలించి బలమైన గూడు తయారు చేస్తుంది.
10. సోషబుల్ వీవర్ (Sociable Weaver)
ఆఫ్రికాలో కనిపించే ఈ పక్షులు చెట్లపై పెద్ద గుడిసెలా గూళ్లు కడతాయి. ఒక్క గూడు వందల పక్షులకు ఆశ్రయాన్నిస్తాయి. పక్షులన్నీ కలిసి వీటిని నిర్మించుకుంటాయి.