ఖగోళ శాస్త్రవేత్తలు అద్భుతమైన విషయాన్ని కనుగొన్నారు. భూమి నుండి 15,000 కాంతి సంవత్సరాల దూరంలో వింతైన వస్తువును గుర్తించారు. అక్కడి నుంచి కొన్ని సంకేతాలు వస్తున్నాయని గుర్తించారు. వీటి గురించి శాస్త్రవేత్తలు చెప్పిన మరిన్ని వివరాలు తెలుసుకుందామా. 

శాస్త్రవేత్తలు తెలిపిన సమాచారం ప్రకారం భూమి నుండి 15,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న వింతైన వస్తువు ఇంతకు ముందు ఎప్పుడూ చేయని విధంగా కొన్ని అర్థం కాని సంకేతాలను పంపుతోంది.

వింతైన వస్తువు పేరు ASKAP J1832-0911

పాలపుంతలో ఇంతకు ముందు చూడని వింతైన ఖగోళ వస్తువును శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి వారు "ASKAP J1832-0911" అని పెట్టారు. ఇది ప్రతి 44 నిమిషాలకు రెండు నిమిషాల పాటు శక్తివంతమైన రేడియో తరంగాలను, ఎక్స్-కిరణాలను విడుదల చేస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సంకేతాల ఫ్రీక్వెన్సీ, వింతైన తీరును చూసి శాస్త్రవేత్తలను ఆశ్చర్యపోతున్నారు. 

ఇందులో ఎక్స్-రే కిరణాలు కూడా ఉన్నాయి

ఆస్ట్రేలియాలోని SKA పాత్‌ఫైండర్ (ASKAP) రేడియో టెలిస్కోప్ ద్వారా ఈ సంకేతాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. తరువాత NASAకు చెందిన చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ ఈ సంకేతాల్లో ఎక్స్-కిరణాలు కూడా ఉన్నాయని నిర్ధారించింది. రేడియో తరంగాలు, ఎక్స్-కిరణాలు ఒకేసారి ఇంత క్రమబద్ధంగా విడుదల కావడం ఇదే మొదటిసారి అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రత్యేకత కారణంగా దీనిని "long-period transient" (LPT) గా వర్గీకరించారు. ఇది చాలా అరుదైన ఖగోళ వస్తువు అని వారు అభివర్ణించారు.

శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..

"విశ్వంలో ఇలాంటి వస్తువును మేము ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు." అని ఆస్ట్రేలియాలోని కర్టిన్ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయన ప్రధాన శాస్త్రవేత్త జితెంగ్ ఆండీ వాంగ్ అన్నారు. ఇది ఒక చనిపోయిన నక్షత్రం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. లేదా అధిక అయస్కాంత క్షేత్రం కలిగిన తెల్లని, చిన్న నక్షత్రం అయి ఉండవచ్చని భావిస్తున్నారు.

అయితే ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాజనిత భావనలు మాత్రమేనని, అక్కడి నుంచి వస్తున్న సంకేతాల ఆధారంగా నిజానిజాలు కనిపెట్టాలని వాంగ్ చెప్పారు. ఈ ఆవిష్కరణ భౌతిక శాస్త్రంలో కొత్త ఆలోచనలు రేకెత్తించిందని, నక్షత్ర పరిణామ క్రమాన్ని తెలుసుకొనే కొత్త దారులను సూచిస్తుందని ఆయన అన్నారు.

విశ్వంలో మరిన్ని వింతైన వస్తువులు

విశ్వంలో కనిపించిన ఈ వింతైన వస్తువు గురించి మరింత పరిశోధించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలాంటి మరిన్ని వస్తువులను కనుగొని, వాటి లక్షణాలను తెలుసుకొని ఒక అవగాహన పొందడానికి ప్రయత్నిస్తామని వారు తెలిపారు. ఈ వింతైన వస్తువు ద్వారా విశ్వంలో తెలియని రహస్యాలను, నక్షత్రాల పరిణామాన్ని గురించి కొత్త విషయాలు తెలుస్తాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.