Asianet News TeluguAsianet News Telugu

స్టాక్స్ మార్కెట్ అల్లకల్లోలం...రూ.11 లక్షల కోట్లు హాంఫట్

కరోనా ప్రపంచ మహమ్మారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడం స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బ తిన్నది. లాభాల స్వీకరణకు దిగడంతో కనీవినీ ఎరుగని రీతిలో వివిధ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11 లక్షల కోట్లు ఖతమైంది. బీఎస్ఈ సెన్సెక్స్‌ 2,919 పాయింట్లు, నిఫ్టీ సైతం 868 పాయింట్లు క్షీణత నమోదు చేసుకున్నది. 
 

Stocks crash to worst day since 2008 as pandemic fuels growth fears
Author
Hyderabad, First Published Mar 13, 2020, 10:08 AM IST

ముంబై: మాటలకందని ఉత్పాతం.. భయం గొలిపే పతనం.. రూ.11 లక్షల కోట్ల సంపద ఆవిరి.. గురువారం భారతీయ స్టాక్‌ మార్కెట్ల ట్రేడింగ్‌ ముఖచిత్రం ఇది. కరోనా దెబ్బకు స్టాక్ మార్కెట్‌ షేక్‌ అవుతున్నది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్‌.. షేర్ మార్కెట్లపైనా పంజా విసురుతోంది. 

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో జరుగుతున్నపరిణామాలు, తీసుకుంటున్ననిర్ణయాలు ఈక్విటీ మార్కెట్లను నిలువునా ముంచేస్తున్నాయి. ఈ మహమ్మారి మోగిస్తున్న మరణ మృదంగం.. ఇప్పుడు గ్లోబల్‌ స్టాక్‌ మార్కెట్లనే కకావికలం చేస్తున్నది. సోమవారం భీకర నష్టాలు మరువకముందే స్టాక్‌ మార్కెట్లు మరో భారీ కుదుపుకు గురయ్యాయి. 

గతంలో ఎన్నడూ లేనంతగా దేశీయ సూచీలు చారిత్రాత్మక నష్టాలను మూటగట్టుకున్నాయి. కరోనా నేపథ్యంలో యూరప్‌ రాకపోకలపై అమెరికా తీసుకున్న నిర్ణయం కూడా షాకిచ్చింది.

తాజాగా భారతీయ స్టాక్‌ మార్కెట్ల చరిత్రలో మరో చీకటి రోజు ఆవిష్కృతమైంది. గతంలో ఎన్నడూ లేని నష్టాలతో సూచీలు రోదించాయి. కరోనా వైరస్‌ భయాల మధ్య బిక్కుబిక్కుమన్న మదుపరులు.. భారీ ఎత్తున అమ్మకాలకు తెగబడ్డారు. కరోనాను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చేసిన ప్రకటన గ్లోబల్‌ మార్కెట్లలో ప్రకంపనల్ని రేపింది.

also read భారీ నష్టాలతో ప్రారంభమయిన స్టాక్ మార్కెట్లు...

కరోనా వైరస్‌ నేపథ్యంలో అమెరికా-యూరప్‌ (బ్రిటన్‌ మినహా) మధ్య రాకపోకలను వచ్చే 30 రోజులు నిషేధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దేశీయ స్టాక్‌ మార్కెట్లనూ ప్రభావితం చేసింది. 

పెట్టుబడులను మదుపరులు ఉపసంహరించుకుంటూ పోవడంతో బేర్‌ అధీనంలోకి మార్కెట్‌ జారిపోయింది. మదుపరుల లాభాల స్వీకరణ నష్టాల విస్ఫోటనానికి దారితీయగా.. బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ) సూచీ సెన్సెక్స్‌ 2,919.26 పాయింట్లు లేదా 8.18 శాతం పతనమైంది. 
చివరకు బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 32,778.14 వద్ద స్థిరపడింది. కేవలం ఒక్కరోజే సెన్సెక్స్‌ ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. 

ఒకానొక దశలో సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో 3,204.30 పాయింట్ల నష్టాలను నమోదు చేయడం గమనార్హం. ఇంట్రాడేలోనూ ఈ స్థాయి నష్టాలు రావడం ఇదే ప్రథమం. 

నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) సూచీ నిఫ్టీ సైతం రికార్డు స్థాయిలో 868.25 పాయింట్లు లేదా 8.30 శాతం క్షీణించింది. ఆఖరుకు 10వేల స్థాయిని కోల్పోయి 9,600 మార్కుకు దిగువన 9,590.15 వద్ద నిలిచింది. 

ఉదయం ఆరంభం నుంచే సూచీలు భారీ నష్టాల్లో కదలాడాయి. సమయం గడుస్తున్నకొద్దీ మరింతగా దిగజారాయి. ప్రారంభంలో 1,800 పాయింట్ల నష్టాలను చూసిన సెన్సెక్స్‌.. మధ్యాహ్నానికి 3,200 పాయింట్లు కోల్పోయి నష్టాల్లో కూరుకుపోయింది. ముగింపు సమయానికి 2,900 పాయింట్లకుపైగా కోల్పోయింది.

ఫలితంగా ఈ ఒక్కరోజే మదుపరుల సంపద రూ.11 లక్షల కోట్లకుపైగా హరించుకుపోయింది. బుధవారం రూ.1,37,13,558.72 కోట్లుగా ఉన్న బీఎస్‌ఈ సంస్థల విలువ.. గురువారం రూ.1,25,86, 398.07 కోట్లకు పరిమితమైంది. దీంతో రూ.11,27,160.65 కోట్లు నష్టపోయినట్లెంది.

చమురు, గ్యాస్‌, రియల్టీ, మెటల్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఎనర్జీ, ఐటీ రంగాల షేర్లు భారీగా నష్టాలను ఎదుర్కొన్నాయి. యెస్‌ బ్యాంక్‌ షేర్‌ విలువ 13 శాతానికిపైగా నష్టపోయింది. 

వరుస భీకర నష్టాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు బేర్‌ జోన్‌లోకి ప్రవేశించాయి. ఇటీవలి గరిష్ఠ స్థాయి నుంచి 20 శాతానికిపైగా పడిపోవడంతో సూచీలపై బేర్‌ మార్కెట్ల ముద్ర పడింది. ఈ ఏడాది జనవరి 14న సెన్సెక్స్‌, నిఫ్టీలు తమ జీవనకాల గరిష్ఠ స్థాయిలను అందుకున్న విషయం తెలిసిందే. 

అయితే గురువారం నష్టాలతో రెండున్నరేళ్లకు పైగా కనిష్ఠ స్థాయికి పతనమయ్యాయి. దీంతో బేరిష్‌ జోన్‌లోకి వెళ్లిపోయాయి. సోమవారం సెన్సెక్స్‌ 1,942 పాయింట్లు, నిఫ్టీ 538 పాయింట్లు క్షీణించిన విషయం తెలిసిందే.

మదుపరులు చమురు రంగ షేర్లను వదిలించుకునే ప్రయత్నం చేశారు. దీంతో గ్యాస్‌, ఆయిల్‌ సూచీ అత్యధిక నష్టాలను నమోదు చేసింది. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ షేర్‌ విలువ 14.71 శాతం పడిపోయి రూ.345.15 వద్ద నిలువగా, హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ షేర్‌ 12.83 శాతం క్షీణించి రూ.183.85 వద్ద నిలిచింది. 
ఓఎన్జీసీ షేర్‌ విలువ కూడా 12.83 శాతం మేర కోల్పోయింది. గెయిల్‌ 11.62 శాతం, ఇండియన్‌ ఆయిల్‌ 9.58 శాతం, రిలయన్స్‌ 7.95 శాతం, ఇంద్రప్రస్థ 6.46 శాతం, క్యాస్ట్రాల్‌ 5.49 శాతం, గుజరాత్‌ పెట్రో నెట్‌ 4.57 శాతం చొప్పున నష్టపోయాయి. 

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్‌ ధర 5.76 శాతం పడిపోయి 33.73 డాలర్ల వద్ద కదలాడటంతో దేశీయ మార్కెట్లలో చమురు షేర్లు మదుపరుల నిరాదరణకు గురయ్యాయి. ఇది ధరలను ప్రభావితం చేస్తున్నది. ఇండిగో, స్పైస్‌జెట్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లూ 19 శాతానికిపైగా కోల్పోయాయి.

ఆసియా, ఐరోపా స్టాక్‌ మార్కెట్లన్నీ గురువారం కుప్పకూలాయి.  జపాన్‌ 4.4 శాతం, ఆస్ట్రేలియా 7.4 శాతం, హాంకాంగ్‌ 3.7 శాతం, చైనా 1.5 శాతం, సింగపూర్‌, ఇండోనేషియా సూచీలు 3 శాతం చొప్పున పడిపోయాయి. 

బ్రిటన్‌, ఫ్రాన్స్‌ 4.5 శాతం, జర్మనీ 5 శాతం, గల్ఫ్‌ మార్కెట్లు 4 శాతానికిపైగా నష్టపోయాయి. ఓవైపు కరోనా భయాలు, మరోవైపు యూరప్‌ ప్రయాణంపై అమెరికా విధించిన ఆంక్షలు.. మదుపరులను పెట్టుబడుల ఉపసంహరణకు ఉసిగొల్పాయి. కరోనా వైరస్‌ దెబ్బకు వెయ్యికి పైగా స్టాకులు ఏడాది కనిష్ఠ స్థాయికి జారుకున్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు కలుపుకొని 1,180 స్టాకులు 52 వారాల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. 

హీరో మోటోకార్ప్‌, గెయిల్‌, ఏసీసీ, ఏబీబీ, బీఈఎంఎల్‌, గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌, జిల్లెట్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, భెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, అరబిందో ఫార్మా స్టాక్స్ కూడా ఉన్నాయి. 

మరోవైపు  రుచి సోయా ఇండస్ట్రీస్‌, అపోలో ఫిన్‌వెస్ట్ ‌(ఇండియా) లిమిటెడ్‌తోపాటు మరో 11 షేర్లు ఏడాది గరిష్ఠ స్థాయికి చేరుకోవడం విశేషం. 546 కంపెనీల షేర్లు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం గుప్పిట్లోకి జారుకుంటుండటంతో మదుపరులు భారీ అమ్మకాలకు మొగ్గుచూపారని జియోజిట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. 

also read  అంతా రాణాకపూర్ వల్లే: అందుకే ‘యెస్’ బ్యాంక్ సంక్షోభంలో చిక్కుకుంది.

వీటికితోడు పలు దేశాలు విదేశీ పర్యాటకులను రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయం భయం గుప్పిట్లోకి నెట్టిందని జియోజిట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. గత 12 రోజుల్లో దేశీయ క్యాపిటల్‌ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఏకంగా రూ.29 వేల కోట్ల పెట్టుబడులను తరలించుకుపోయారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 9 లోపు ఈక్విటీల నుంచి రూ.29,262 కోట్ల (4.02 బిలియన్‌ డాలర్లు) నిధులను వెనక్కి తీసుకున్నారు.

బంగారం ధర కూడా మరింత తగ్గింది. ఒకవైపు స్టాక్‌ మార్కెట్లు కుదేలవుతుండటం, మరోవైపు రూపాయి బక్కచిక్కుతుండటంతో పసిడి ధర రూ.120 తగ్గి రూ.44,490 వద్ద నిలిచింది. బుధవారం ఈ ధర రూ.44,610గా ఉన్నది.

వెండి అయితే ఏకంగా రూ.300 దిగొచ్చి రూ.46,860 వద్ద పరిమితమైంది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలు ఒక్కసారిగా పతనమవడం, దేశీయంగా రూపాయి భారీగా క్షీణించడం వల్లే బంగారం, వెండి ధరలు దిగొచ్చాయని హెచ్‌డీఎఫ్‌సీ వర్గాలు వెల్లడించాయి. న్యూయార్క్‌ బులియన్‌ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 1,645 డాలర్లకు, వెండి 16.73 డాలర్లకు పడిపోయాయి. 

డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ గురువారం మరింతగా దిగజారింది. 60 పైసలు పడిపోయి 17 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 74.28 వద్ద స్థిరపడింది. ఉదయం ప్రారంభంలోనే నష్టాలతో 74.25 వద్ద మొదలైన రూపాయి.. ఒకానొక దశలో 73.68 స్థాయికి బలపడింది.

అయితే మళ్లీ 82 పైసల పతనంతో 74.50 వద్దకు క్షీణించింది. చివరకు 74.28 వద్ద నిలిచింది. మదుపరుల నుంచి డాలర్‌కు డిమాండ్‌ ఏర్పడటంతో రూపాయి నష్టపోక తప్పలేదని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు ట్రేడింగ్‌ సరళిని విశ్లేషిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios