న్యూఢిల్లీ: విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్న ఉల్లిగడ్డలను తీసుకొనేందుకు చాలా రాష్ర్టాలు ఆసక్తి చూపకపోవడంతో వాటిని ఎలా వదిలించుకోవాలా అని కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. దేశీయమార్కెట్లోనూ అదే ధరకు లభిస్తుండటంతో పలు రాష్ట్రాల విదేశీ ఉల్లిగడ్డ తీసుకునేందుకు వెనుకాడుతున్నాయని సమాచారం.

Also read:బంగారంపై హల్ మార్కింగ్‌ నేటి నుండి తప్పనిసరి

రవాణా ఖర్చులను తామే భరించి కిలో రూ.55 చొప్పున దిగుమతి ధరకే విదేశీ ఉల్లిగడ్డలను అందజేస్తున్నా వాటిని తీసుకొనేందుకు చాలా రాష్ర్టాలు ముందుకు రావడంలేదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ మంగళవారం తెలిపారు. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో గత రెండునెలల నుంచి కిలో ఉల్లి రిటైల్‌ ధర రూ.100కుపైగా పలుకుతున్న విషయం తెలిసిందే.

Also read:ద్రవ్యోల్బణం ఎఫెక్ట్: ఫిబ్రవరిలోనూ రెపో రేటు యథాతథమే!

ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతులు రావడం, కొత్త ఖరీఫ్‌ పంట కూడా ఇప్పుడిప్పుడే చేతికొస్తుండంతో ఉల్లి ధరలు క్రమంగా తగ్గుతున్నా ఇంకా సాధారణ స్థాయికి చేరుకోలేదు. ఇప్పటివరకు విదేశాల నుంచి 36 వేల టన్నుల ఉల్లి దిగుమతులకు కాంట్రాక్టు ఇవ్వగా 18,500 టన్నులు భారత్‌కు చేరుకున్నాయి.

Also read:టోకు ధరల సూచీలో కూర‘గాయాలే’.. 8 నెలల గరిష్ఠానికి డబ్ల్యూపీఐ

కేంద్రం దిగుమతి చేసుకున్న ఉల్లిగడ్డల్లో రాష్ర్టాలు కేవలం 2000 టన్నులు మాత్రమే తీసుకోవడంతో మిగిలిన దిగుమతులను ఎలా వదిలించుకోవాలా అని మదనపడుతున్నామని పాశ్వాన్‌ విలేకర్లకు తెలిపారు. రేపు ఎవరైనా కోర్టుకెళ్లి.. దిగుమతి చేసుకున్న ఉల్లిగడ్డలు కుళ్లిపోతున్నాయని ఫిర్యాదు చేస్తారేమోనని రాం విలాస్ పాశ్వాన్ ఆందోళన వ్యక్తంచేశారు. 

Also read:ఆర్‌కామ్‌ ఆస్తుల రేసులో జియో.. ఎయిర్‌టెల్ కూడా

 ‘దేశంలో సరఫరాలను మెరుగుపర్చి ధరలను నియంత్రించేందుకే టర్కీ, ఈజిప్టు, ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి ఉల్లిగడ్డలను దిగుమతి చేసుకొంటున్నాం. వాటిని తీసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేకపోతే మేము ఏమి చేయగలం’ అని పాశ్వాన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే దిగుమతి చేసుకున్న ఉల్లిగడ్డలను తీసుకున్నాయన్నారు.

మిగిలిన రాష్ర్టాలు వాటిని తీసుకునేందుకు విముఖత చూపుతున్నాయని కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ వాపోయారు. దేశీయంగా పండించే ఉల్లితో పోలిస్తే విదేశీ ఉల్లిగడ్డల రుచి భిన్నంగా ఉంటున్నదని, రిటైల్‌ మార్కెట్లలో దేశీయ ఉల్లిగడ్డలు కూడా అదే ధరకు లభిస్తుండటంతో వినియోగదారులు విదేశీ ఉల్లిగడ్డలను కొనుగోలు చేయడంలేదని అధికారవర్గాలు చెప్తున్నాయి.