ఆర్‌కామ్ ఆస్తుల రేసులో జియో.. ఎయిర్‌టెల్ కూడా
అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) ఆస్తుల కొనుగోలు చేయడానికి ఆయన అన్న రిలయన్స్ జియో పోటీ పడుతున్నది.
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) ఆస్తుల కొనుగోలు చేయడానికి ఆయన అన్న రిలయన్స్ జియో పోటీ పడుతున్నది. అయితే ఆర్-కామ్ ఆస్తుల కోసం దాఖలైన దాదాపు రూ.25,000 కోట్ల బిడ్లలో రిలయన్స్ జియో, యూవీ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ (యూవీఏఆర్‌సీ) కంపెనీలు పోటీ పడుతున్నాయి.
Also read:ఫ్లిప్‌కార్ట్ లో స్మార్ట్ ఫోన్స్ పై కళ్ళు చెదిరే ఆఫర్...కేవలం కొద్ది రోజులు మాత్రమే
‘జియో, యూవీఏఆర్‌సీ సంస్థలు.. ఆర్‌కామ్ ఆస్తుల కోసం సోమవారం జరిగిన రుణదాతల కమిటీ సమావేశంలో అత్యధిక బిడ్లను దాఖలు చేశాయి’ అని పీటీఐకి సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్‌కామ్ అనుబంధ సంస్థ రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ లిమిటెడ్ మొబైల్ టవర్, ఫైబర్ ఆస్తుల కోసం జియో రూ.4,700 కోట్ల బిడ్లను దాఖలు చేసింది.
ఇక యూవీఏఆర్‌సీ.. ఆర్‌కామ్, రిలయన్స్ టెలికం లిమిటెడ్‌ల డేటా సెంటర్ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ ఆస్తులు, స్పెక్ట్రం కోసం సుమారు రూ.16,000 కోట్ల బిడ్లను సమర్పించింది. ఈ బిడ్డర్లు 90 రోజుల్లోగా సుమారు రూ.7,500 కోట్ల ప్రొసీడ్స్‌లో 30 శాతం చెల్లిస్తామని ముందుకు వచ్చినట్లు రుణదాతలు తెలిపారు. ఎయిర్ టెల్ అండ్ వర్డే పార్టనర్స్ కూడా రూ.25 వేల కోట్లకు బిడ్ వేశాయి.
ఆర్‌కామ్ రుణ భారం దాదాపు రూ.33 వేల కోట్లు ఉండగా, ఈ బిడ్లతో 75 శాతం అప్పులు తీరిపోనున్నాయి. 38 రుణదాతలకు ఆర్‌కామ్ బకాయిపడింది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఆర్‌కామ్.. టెలికం సేవలకు ఎప్పుడో గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.
అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్ సంస్థ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో దాఖలు చేసిన పిటిషన్ వచ్చే నెల మూడో తేదీలోగా విచారణకు వచ్చేలోగా బిడ్డర్లు తుది నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. ఈ నెల 31లోగా బిడ్లు దాఖలు చేసిన సంబంధిత సంస్థల డైరెక్టర్ల బోర్డులు తమ ప్రణాళికలను వెల్లడించాల్సి ఉంటుంది.
రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థకు 122 ఎంహెచ్జ్ స్పెక్ట్రంతోపాటు టవర్ బిజినెస్, ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్, డాటా సెంటర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ పవర్ సంస్థలో 30 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు యస్ బ్యాంక్ మంగళవారం ప్రకటించింది.
అనిల్ అంబానీ సారథ్యంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ ఇటలీకి చెందిన టెలీ కమ్యూనికేషన్స్ సంస్థ సోనీకి సకాలంలో బకాయిలు చెల్లించలేకపోయింది. గడువులన్నీ పూర్తయినా చెల్లింపులు జరుగనందుకు సోనీ సుప్రీంకోర్టు మెట్లెక్కింది.
కోర్టు ఆదేశాలను పాటించనందుకు సుప్రీంకోర్టు జైలుకు వెళ్లాల్సి వస్తుందని అనిల్ అంబానీని హెచ్చరించింది. కానీ అన్న ముకేశ్ అంబానీ చివరి క్షణంలో ఆదుకుని తమ్ముడు జైలు పాలు కాకుండా కాపాడారు.
అంతకుముందే రిలయన్స్ జియోకు రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆస్తులను విక్రయించాలని నిర్ణయానికి వచ్చినా.. దాదాపు ఒప్పందం ఖరారయ్యే దశలో టెలికం శాఖ అడ్డు పడటంతో కథ అడ్డం తిరిగింది.