న్యూఢిల్లీ: కూరగాయల ధరలు మార్కెట్లో జనాన్ని ఠారెత్తిస్తున్నాయి.. ద్రవ్యోల్బణాన్ని ప్రమాదకరంగా మార్చేస్తున్నాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గతేడాది డిసెంబర్‌లో ఎనిమిది నెలల గరిష్ఠాన్ని తాకింది. 

Also read:ద్రవ్యోల్బణం ఎఫెక్ట్: ఫిబ్రవరిలోనూ రెపో రేటు యథాతథమే!

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు కార్యాలయం మంగళవారం విడుదల చేసిన వివరాల ప్రకారం గత నెల టోకు ద్రవ్యోల్బణం 2.59 శాతంగా నమోదైంది. అంతకుముందు 2019 నవంబర్‌లో 0.58 శాతంగా ఉన్న టోకు ద్రవ్యోల్బణం, 2018 డిసెంబర్‌లో 3.46 శాతంగా రికార్డైంది. 

Also read:టోకు ధరల సూచీలో కూర‘గాయాలే’.. 8 నెలల గరిష్ఠానికి డబ్ల్యూపీఐ

నిరుడు  అంటే 2019 ఏప్రిల్‌లో 3.24 శాతంగా ఉన్న టోకు ధరల సూచీ, మళ్లీ డిసెంబర్‌లోనే ఆ స్థాయి గణాంకాలు నమోదైయ్యాయి. ఉల్లి, బంగాళాదుంప వంటి ఆహారోత్పత్తుల ధరలు భగ్గుమనడంతో ద్రవ్యోల్బణం ఒక్కసారిగా ఆందోళనకర స్థాయికి ఎగిసింది.

Also read:ఆర్‌కామ్‌ ఆస్తుల రేసులో జియో.. ఎయిర్‌టెల్ కూడా

సోమవారం వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా ఎగబాకిన సంగతి తెలిసిందే. ఐదున్నరేళ్ల గరిష్ఠాన్ని చేరిన డిసెంబర్‌ సీపీఐ ద్రవ్యోల్బణం 7.35 శాతంగా ఉన్నది. ఆహార ఉత్పత్తుల అధిక ధరలే ఇందుకు కారణమని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) స్పష్టం చేసిన సంగతి విదితమే.

క్రమేణా పెరుగుతున్న ఆహారోత్పత్తుల ధరలు.. అటు రిటైల్‌, ఇటు హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణం గణాంకాలను పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తున్నాయి. డిసెంబర్‌లో ఆహారోత్పత్తుల ధరలు 13.12 శాతం పెరుగగా, ఉల్లిగడ్డ, బంగాళదుంప ధరలు ఇందుకు ప్రధాన కారకాలుగా నిలుస్తున్నాయి. 

కూరగాయల ధరలు 69.69 శాతం పెరుగగా, ఉల్లిగడ్డ వాటా 455.83 శాతంగా ఉన్నది. ఆలుగడ్డ ధర 44.97 శాతం ప్రియమైనట్లు తేలింది. కాగా, దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భారీ స్థాయిలో పెరుగగా, పలు మార్కెట్లలో కిలో రూ.100కుపైగా పలికింది. 

అధిక వర్షాల కారణంగా ఉల్లి పంట దెబ్బతిన్నది. దీంతో మార్కెట్‌లో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక ధరలు పరుగులు తీశాయి. చివరకు విదేశాల నుంచి ఉల్లి దిగుమతుల్ని కేంద్రం చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

ఈ నెల విడుదలయ్యే ద్రవ్యోల్బణం గణాంకాలు మరింత పెరుగవచ్చని ఎస్బీఐ రిసెర్చ్‌ రిపోర్ట్‌-ఎకోరాప్‌ అంచనా వేసింది. జనవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 8 శాతానికిపైగానే ఉంటుందని అంటున్నది. పెరుగుతున్న రిటైల్‌ ద్రవ్యోల్బణం వల్ల ఇప్పటికే డిసెంబర్‌ ద్రవ్యసమీక్షలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్ల జోలికి వెళ్లలేకపోయింది.

ఈ క్రమంలో మరో ఆరు నెలలు ద్రవ్యోల్బణం గణాంకాలు పెరిగిపోయే వీలుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది ద్వితీయార్ధంలోనే తగ్గవచ్చని మెజారిటీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

దీంతో ఆర్బీఐ వరుస వడ్డీరేట్ల కోతలకు బ్రేక్‌లు తప్పేలా లేవని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో చివరి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షను ప్రకటించనున్నది.