న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రపంచం అంతా స్మార్ట్ ఫోన్లు.. మొబైల్ ఫోన్ల మయం. స్మార్ట్ లేదా మొబైల్ ఫోన్లు లేకుండా పిసరంత పని కూడా జరుగడం లేదంటే అతిశయోక్తి కాదు. కానీ కొందరు వినియోగదారులు దీపావళి పండుగ నాటికో.. అంతకుముందు విజయదశమి నాటికి మొబైల్, స్మార్ట్ ఫోన్లు కొనాలని ఆశలు పెట్టుకున్న వారు ఉన్నారు. కానీ సెప్టెంబర్ నాటికి మొబైల్ ఫోన్ల రేట్లు ఒకింత పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి.

టర్కీ కరెన్సీ ‘లీరా’ సంక్షోభం నేపథ్యంలో డాలర్ పై రూపాయి మారకం విలువ 70.08 స్థాయికి పతనం కావడంతో మొబైల్ ఫోన్ల విడి భాగాలు విదేశాల నుంచి.. ఆఖరుకు మన పొరుగు దేశం చైనా నుంచి దిగుమతి చేసుకున్నా దిగుమతి సుంకం పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.

విదేశాల నుంచి దిగుమతి చేసుకుని మొబైల్ ఫోన్ల విడి బాగాల సుంకం పెరుగుదలతో ఇన్ ఫుట్ వ్యయం నాలుగు నుంచి ఆరు శాతం పెరుగుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చేనెల మధ్యలోగా మొబైల్ ఫోన్లను కొనుగోలు చేస్తే సబబుగా ఉంటుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. 

ఇండియా సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రూ మాట్లాడుతూ రూపాయి విలువ 70 స్థాయికి పతనం కావడంతో మానసికంగా తమపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో మొబైల్ ఫోన్ల ధరలు పెంచాలని సంస్థలు పరిశీలిస్తున్నాయని తెలిపారు. దిగుమతులు భారీగా తగ్గుముఖం పడతాయని చెప్పారు. ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ జియామీ మాత్రం ప్రస్తుతానికి ధరలను పెంచే ప్రణాళికేదీ లేదని పేర్కొంది. 

డాలర్‌పై రూపాయి పతనంతో ప్రత్యేకించి ముడి చమురు ధరలపై ప్రధానంగా ప్రభావం పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ మూడోదిగా ఉన్నది. ప్రతి రంగానికి ముడి చమురు ధర పెరుగుదలపై ప్రభావం పడుతుంది. దాని కొనసాగింపుగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. ముడి చమురు దిగుమతి చేసుకోవడంతో లాభాలు తగ్గుముఖం పడతాయి. కేపిటల్ గూడ్స్ దిగుమతిపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది.

కాకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), చేనేత తదితర ఎగుమతుల వల్ల ఆయా రంగాలు లబ్ది పొందుతాయి. ఇక ఇప్పటికే జెమ్స్ అండ్ జ్యువెల్లరీ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. తాత్కాలికంగా రూపాయి మారకం విలువ పతనం కాకుండా ఆర్బీఐ జోక్యం కొంత మేరకే పని చేస్తుంది. దీర్ఘ కాలంలో మాత్రం దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవడంతోపాటు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో స్నేహపూర్వక విధానాలతో రూపాయి పతనం ప్రభావం తగ్గించొచ్చు. 

ఇదిలా ఉంటే జూలై నాటికే బంగారం దిగుమతులు పెరిగాయి. ముడి చమురు ధరల పెరుగుదలతో జూలై వాణిజ్యలోటు ఐదేళ్లకు పైగా గరిష్ఠ స్థాయి 1,802 కోట్ల డాలర్లకు ఎగబాకింది. గత ఏడాది జూలైలో లోటు 1,145 కోట్ల డాలర్లుగా నమోదైంది. ఈ ఏడాది జూలైలో వాణిజ్య లోటు 1,660 కోట్ల డాలర్లుగా ఉంది. ఎగుమతుల ద్వారా సమకూరే విదేశీ మారక ఆదాయం కంటే దేశంలోకి వస్తు, సేవల దిగుమతి కోసం చెల్లింపులు అధికంగా ఉండటాన్ని వాణిజ్య లోటుగా వ్యవహరిస్తారు. 

జూలై నెలలో భారత్‌ నుంచి ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 14.32 శాతం వృద్ధి చెంది 2,577 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. జెమ్స్‌ అండ్‌ జువెలరీ, పెట్రోలియం ఉత్పత్తులకు విదేశాల నుంచి ఆర్డర్లు పెరగడం ఎగుమతుల పెరుగుదలకు దోహదపడిందని కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. గత ఏడాది జూలైలో ఎగుమతులు 2,254 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి.

మంగళవారం విడుదలైన విదేశీ వాణిజ్య గణాంకాల ప్రకారం.. గత ఏడాది జూలైలో 3,399 కోట్ల డాలర్ల స్థాయిలో ఉన్న దిగుమతులు వార్షిక ప్రాతిపదికన 28.81 శాతం ఎగబాకి ఈ జూలైలో 4,379 కోట్ల డాలర్లకు పెరిగాయి. దీంతో వాణిజ్యలోటు ఐదేళ్లకు పైగా గరిష్ఠ స్థాయి 1,802 కోట్ల డాలర్లకు ఎగబాకింది. గత ఏడాది జూలైలో లోటు 1,145 కోట్ల డాలర్లుగా నమోదైంది. ఈ ఏడాది జూన్‌లో వాణిజ్య లోటు 1,660 కోట్ల డాలర్లుగా ఉంది.