బ్యాంకింగ్ రంగంలో మరో విలీనానికి కేంద్ర ప్రభుత్వం తెర తీసింది. దేశంలో రుణ వితరణ, ఆర్థిక వృద్ధి పునరుద్ధరణ ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ), విజయా బ్యాంక్‌, దేనా బ్యాంక్‌లను విలీనం చేస్తామని ప్రకటించింది. తద్వారా ఏర్పడే సంస్థ దేశంలో మూడో అతిపెద్ద బ్యాంక్‌గా అవతరించనున్నది. కానీ ఆ మూడు బ్యాంకుల నుంచి వివిధ సంస్థలు తీసుకున్న రూ.80 వేల కోట్ల మొండి బాకీలు, వాటిల్లో పని చేస్తున్న సిబ్బంది భవితవ్యం మాటేమిటని బ్యాంకింగ్ ఉద్యోగుల సంఘం ప్రశ్నిస్తోంది.

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్బీఐ గత ఏడాది ఏప్రిల్‌లో 5 అనుబంధ బ్యాంకులతోపాటు భారతీయ మహిళా బ్యాంక్‌(బీఎంబీ)ను విలీనం చేసుకున్నది. ప్రస్తుతం దేశంలో 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. బీఓబీ, దేనా, విజయా బ్యాంక్‌ల విలీనం తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 19కి తగ్గనుంది.

విలీనం తర్వాత ఏర్పడే బ్యాంక్‌కు కూడా ప్రభుత్వం మూలధన మద్దతు ఉండనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికల్లా విలీనం పూర్తయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అంటోంది. అప్పటివరకు ఈ మూడు బ్యాంకులు స్వతంత్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తాయి.

విలీనంతో బ్యాంకులు మరింత పటిష్ఠం కావడంతోపాటు వాటి రుణ వితరణ సామర్థ్యం కూడా మెరుగవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పేర్కొన్నారు. బ్యాంకుల విలీనాలు కూడా ప్రభుత్వ ఎజెండాలో ఒకటని, అందులో భాగంగానే తాజా ప్రకటన చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ బ్యాంకుల విలీన ప్రతిపాదన ఉద్దేశాలను ప్రస్తావించారు. బ్యాంకుల రుణ మంజూరు సామర్థ్యం బలహీనపడిందని, దాంతో కార్పొరేట్‌ రంగంలో పెట్టుబడులపై ప్రభావం పడుతోందన్నారు.

గతంలో ఎడాపెడా రుణాలు మంజూరు చేసిన ఫలితంగా మొండి బకాయిలు భారీగా పేరుకుపోయి చాలా వరకు ప్రభుత్వ బ్యాంకులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. తాజా విలీనం తర్వాత బ్యాంకింగ్‌ కార్యకలాపాలు పుంజుకోనున్నాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బ్యాంకింగ్‌ రంగంలో విలీనాలను వేగవంతం చేసేందుకు గత ఏడాది ఆగస్టులో కేంద్రం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది.
 
ఆ మూడు బ్యాంకుల విలీన ప్రతిపాదనను త్వరలోనే బ్యాంకుల బోర్డులకు పంపనున్నట్లు ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. విలీనంతో బ్యాంకుల కార్యకలాపాల నిర్వహణ సామర్థ్యంతోపాటు ఖాతాదారులకు సేవలు మరింత మెరుగపడతాయని పేర్కొన్నారు. విలీనం సందర్భంగా ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించడం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఏ ఉద్యోగి సర్వీసుపై ప్రభావం పడనీయబోమని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.
 
ప్రస్తుతం ప్రభుత్వరంగంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) దేశంలో అతిపెద్ద బ్యాంకుగా ఉంది. రెండో స్థానంలో ప్రైవేట్ రంగంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మూడో స్థానంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఉన్నాయి. దేశ బ్యాంకింగ్‌ ఆస్తుల్లో ఈ బ్యాంకుల వాటాయే మూడింట రెండు వంతులు ఉంటుంది. ఇక మొండి పద్దుల్లో (ఎన్‌పిఎ) ప్రభుత్వ బ్యాంకుల వాటాయే అత్యధికంగా ఉంది. 

ప్రస్తుతం బ్యాంకుల మొత్తం మొండి బాకీలు రూ.8.99 లక్షల కోట్లు ఉన్నాయి.
బాసెల్‌-3 నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ బ్యాంకులకు వచ్చే రెండేళ్ల కాలంలో కోట్లాది రూపాయల మూలధన అవసరం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ బ్యాంకులకు రూ.88,139 కోట్ల మూలధనం సమకూర్చనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

బ్యాంకుల విలీనం వద్ద ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న బ్యాంకుల మధ్య పోటీతత్వం మరింతగా పెరుగుతుంది. కస్టమర్ల సంఖ్య భారీగా పెరుగుతుంది. బ్యాంకింగ్‌ సేవలను మరింత ఎక్కువ మందికి అందుబాటులోకి తెచ్చే అవకాశం లభిస్తుంది. నిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది. విభిన్న రకాల ఉత్పత్తులు, సర్వీసులను కస్టమర్లకు అందించే ఆస్కారం ఉంటుంది.
 
మూడు బ్యాంకులను విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈ) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ బ్యాంకుల విలీనం అవసరం లేదని అంటోంది. ‘ప్రభుత్వ బ్యాంకుల విలీనమనేది సర్కార్ అజెండాలోనే ఉంది కాబట్టి తాజాగా చేసిన ప్రకటనేమీ ఆశ్చర్యం కలిగించడం లేదు.

మన దేశంలో బ్యాంకుల కన్సాలిడేషన్‌, విలీనానికి బదులుగా బ్యాంకుల విస్తరణ అవసరం ఉంది. విలీనం ద్వారానే బ్యాంకులు మరింత బలోపేతమై,  వాటి సామర్థ్యం పెరుగుతుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాల్లేవని ఏఐబీఐ పేర్కొంది. 
 
‘ఇప్పటికే ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం జరిగింది. దీని వల్ల ఎలాంటి అద్భుతాలు జరగలేదు. విలీనంతోపాటు పలు శాఖలను మూసివేశారు. మొండి పద్దులు భారీగా పెరిగాయి. సిబ్బందిని తగ్గించారు. వ్యాపారం కూడా తగ్గింది. ప్రతిపాదిత మూడు ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి పద్దులు రూ.80 వేల కోట్ల వరకు ఉన్నాయి. ఈ విలీనం మొండి బాకీల రికవరీకి దోహదపడదు. అందుకే ఈ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’ అని ఏఐబీఈ జనరల్‌ సెక్రటరీ సిహెచ్‌ వెంకటాచలం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఐడీబీఐ బ్యాంక్‌ విషయంలోనూ ఉద్యోగులకు పూర్తి భద్రతనిస్తామని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ సంస్థ భారంగా మారి నష్టాల బాట పట్టడంతో అందులో కీలక వాటాను బీమా దిగ్గజం ఎల్‌ఐసీ అప్పగించే ప్రయత్నాలను మొదలు పెట్టింది. వేతన సవరణల్లో కూడా వీరికి ఇప్పటికీ అన్యాయమే జరుగుతోంది.

ఈ నేపథ్యంలో కొత్తగా చేపట్టిన బ్యాంకుల విలీనం వల్ల ఆయా బ్యాంకులలో ఉద్యోగులకు ఎంత వరకు మెరుగైన భద్రత లభిస్తుందన్నది ప్రశ్నార్థకమేనని ఆయా బ్యాంకుల సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొండి బాకీలతో సతమతమవుతున్న బ్యాంకుల విలీనంతో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న బ్యాంకులపై ప్రభావం ఉంటుందని ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు.