క్రెడిట్ కార్డులు అంటే ఏంటి? ప్రయోజనాలు, ఎలా దరఖాస్తు, ఎలా ఎంపిక చేసుకోవాలి.. ఏ టూ జెడ్ అన్ని వివరాలు మీకోసం
మారిన ఆర్థిక అవసరాల నేపథ్యంలో ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరికీ క్రెడిట్ కార్డు వినియోగం అనివార్యంగా మారింది. ఒకప్పుడు నెలఖారులో డబ్బులు అవసరపడితే ఎవరి దగ్గరైనా చేబదులుగా డబ్బులు తీసుకునే వారు. కానీ ప్రస్తుతం ఆ స్థానాన్ని క్రెడిట్ కార్డులు భర్తీ చేస్తున్నాయి. ఖర్చు చేసిన తర్వాత సుమారు నెల నుంచి 45 రోజుల తర్వాత బిల్లు చెల్లించే వెసులుబాటు ఉండడంతో చాలా మంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డులకు సంబంధించి, సమగ్ర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డు అంటే ఏమిటి?
సేవింగ్స్ అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా ఆర్థిక లావాదేవీలు చేసేందుకు క్రెడిట్ కార్డు ఉపయోగపడుతుంది. క్రెడిట్ కార్డు అంటే మనకు అప్పు ఇఛ్చే కార్డు. కాకుంటే సాధారణంగా కొంత వడ్డీ చెల్లిస్తామనో.. లేదా ఫలానా తేదీలోపు తిరిగి ఇచ్చేస్తామనో మనం అప్పు చేస్తూ ఉంటాం. అయితే క్రెడిట్ కార్డులు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేకుండా.. దాదాపు 45 రోజుల లోపు మీరు ఈ కార్డు ద్వారా తీసుకున్న అప్పును చెల్లించే వీలు కల్పిస్తాయి. అయితే ఈ క్రెడిక్ కార్డుల ద్వారా తీసుకొనే అప్పు సాధారణంగా కొనుగోళ్లకు మాత్రమే ఉపయోగపడుతుంది. అంతే కాని.. నగదు రూపంలో తీసుకోడానికి ఉపయోపడదు. ఒకవేళ నగదు రూపంలో తీసుకుంటే.. అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
కనుక నగదు రూపంలో కాకుండా అప్పు ద్వారా కొనుగోలు చేసేందుకు ఉపయోగపడేవే క్రెడిట్ కార్డులు. మెటల్ లేదా ప్లాస్టిక్ కార్డును బ్యాంకు లేదా ఏదైనా ఆర్థిక సంస్థ అందిస్తుంది. నిర్ణీత సమయంలోపు క్రెడిట్ కార్డును చెల్లించడం ద్వారా మీరు రూపాయి కూడా అదనంగా చెల్లించాల్సి అవసరం ఉండదు. ప్రతీసారి నిర్ణీత సమయంలో క్రెడిట్ కార్డు బిల్లును చెల్లించడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్ కూడా మెరుగుపడుతుంది. చాలా వరకు కంపెనీలు, సంస్థలు క్రెడిట్ కార్డు ద్వారా బిల్ పేమెంట్స్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
క్రెడిట్ కార్డు ఉపయోగాలు.
అత్యవసర సమయాల్లో చేతిలో డబ్బులేకపోయినా మన ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు క్రెడిట్ కార్డు బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా క్రెడిట్ కార్డుతో జరిపిన లావాదేవీలపై రివార్డ్ పాయింట్స్, క్యాష్‌బ్యాక్ వంటి బెనిఫిట్స్ పొందొచ్చు. వీటితోపాటు విమానాశ్రయాల్లో ఉండే లాంజ్‌లలో ఉచిత యాక్సెస్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి పొందొచ్చు. ఈ కార్డును సమర్థవంతంగా ఉపయోగించుకుంటే దాదాపు అన్ని సేవలు, వస్తువులు, పరికరాలు, గ్యాడ్జెట్లు, కొనుగోలు చేయొచ్చు. బీమా ప్రీమియం, రకరకాల ఫీజులు ఇలా అదీ ఇదీ అని కాకుండా అన్ని రకాల సేవలు, కొనుగోళ్లకు క్రెడిట్ కార్డులు ఉపయోగపడతాయి.
వెల్‌కమ్ గిఫ్ట్: చాలా బ్యాంకులు కొత్తగా క్రెడిట్ కార్డు అప్లై చేసుకున్న వారికి వెల్‌కమ్ గిఫ్ట్ పేరుతో ఆఫర్లను అందిస్తుంది. దీంతో పలు వోచర్లు, డిస్కౌంట్స్ వంటి బెనిఫిట్స్ పొందొచ్చు.
రివార్డ్స్ ప్రోగ్రామ్: క్రెడిట్ కార్డుతో మీరు చేసే ప్రతీ లావాదేవీకి కంపెనీలు రివార్డ్ పాయింట్స్‌ను అందిస్తాయి. ఈ రివార్డు పాయింట్లతో మీరు మళ్లీ వస్తువులను కొనుగోలు చేయవచ్చు. లేకుంటే బిల్లు చెల్లింపు సమయంలో ఫాయింట్స్ ని నగదుగా మార్చుకోవచ్చు.
పెట్రోల్, డీజిల్: కొన్ని రకాల క్రెడిట కార్డులతో ఇంధనం కొనుగోలు చేస్తే ఫ్యూయల్ సర్‌ఛార్జ్ పేరుతో ప్రతీ నెల మీకు కొంత మొత్తంలో క్యాష్‌బ్యాక్ అందిస్తుంది.
క్యాష్‌బ్యాక్ లాభాలు: చాలా వరకు క్రెడిట్ కార్డు సంస్థలు, షాపింగ్ సంస్థలు, కంపెనీలు కలిసి లావాదేవీలపై క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నాయి. ఇది డబ్బులు ఆదాకు ఎంతో ఉపయోగపడుతుంది.
లైఫ్‌స్టైల్ లాభాలు: క్రెడిట్ కార్డుదారులు డైనింగ్, షాపింగ్, వెల్‌నెస్, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి లైఫ్‌స్టైల్ బెనిఫిట్స్ పొందొచ్చు.
ట్రావెల్ బెనిఫిట్స్: క్రెడట్ కార్డు వినియోగదారులకు ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్, ట్రావెల్ ఇన్సూరెన్స్, హోటల్ ఆఫర్స్ వంటివి ఉచితంగా పొందే అవకాశం కల్పిచారు.
యాడ్ ఆన్ కార్డ్: యాడ్ ఆన్ కార్డు ఫీచర్ సహాయంతో మీ ఇంట్లో కుంటుంబ సభ్యులకు కూడా క్రెడిట్ కార్డు ఇవ్వొచ్చు. ఈ విధానంలో ఒక కార్డులో ఉన్న క్రెడిట్ లిమిట్‌తో మరో కార్డు అందిస్తారు.
ఇన్సూరెన్స్ కవరేజ్: కొన్ని రకాల ప్రీమియం కార్డులు బీమాను కూడా అందిస్తాయి ఎయిర్ యాక్సిడెంట్స్, లైఫ్, సామానులు పోగొట్టుకోవడం వంటి వాటికి ఇన్సూరెన్స్ సేవలను ఉచితంగా పొందొచ్చు.
బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్: ఒకవేళ మీ దగ్గర రెండు క్రెడిట్ కార్డులు ఉంటే. ఒక కార్డులో ఉండే అవుట్ స్టాండింగ్ మొత్తాన్ని మరో క్రెడిట్ కార్డుతో సహాయంతో ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రపంచవ్యాప్తంగా: విదేశీ పర్యాటకులను దృష్టిలో పెట్టుకొని కొన్ని సంస్థలు ఇతర దేశాల్లో కూడా యాక్సెప్ట్ చేసే క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
ఈఎమ్‌ఐ సదుపాయం: క్రెడిట్ కార్డు ద్వారా చేసిన పేమెంట్‌ను ఈఎమ్‌ఐకి కన్వర్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. దీంతో నెలవారీగా సులభ వాయిదాల్లో మీ అవుట్ స్టాండిగ్‌ను (అప్పును తక్కువ వడ్డీతో) తిరిగి చెల్లించవచ్చు.
క్రెడిట్ స్కోర్: క్రెడిట్ కార్డు ఉన్న వారికి సిబిల్ స్కోర్ మెరుగుపడుతుంది. ప్రతీ నెల గడవు తేదీలోపు చెల్లింపులు చేస్తే క్రెడిట్ హిస్టరీ హెల్తీగా ఉంటుంది. ఇది ఇతర రుణాలు పొందడానికి కూడా ఉపయోగపడుతుంది. మీ రుణ పరపతిని బాగా పెంచుతుంది. కాకుంటే క్రెడిట్ కార్డును సరిగ్గా మేనేజ్ చేయలేక.. సకాలంలో చెల్లింపులు చేయకపోతే.. సిబిల్ స్కోర్ తీవ్రంగా ప్రభావితమవుతుంది. అందువల్ల క్రెడిట్ కార్డును ఎంత సమర్థవంతంగా వినియోగిస్తే అంతా మంచిగా సిబిల్ స్కోర్, రుణ పరపతి పెరుగుతుంది.
క్రెడిట్ కార్డులు వాటి రకాలు
కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు: ఇతర కంపెనీల భాగస్వామ్యంతో కొన్ని సంస్థలు క్రెడిట్ కార్డులు అందిస్తుంటాయి. అంటే ఒక ఆన్ లైన్ షాపింగ్ సంస్థ, బ్యాంకు కలిసి ఓ క్రెడిట్ కార్డును అందించ వచ్చు. లేక ఓ చమురు సంస్థ, ఆన్ లైన్ షాపింగ్ సంస్థ, బ్యాంకు కలిసి ఓ క్రెడిట్ కార్డును అందించ వచ్చు. దీని వల్ల సదరు సంస్థకు ఆ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేసినపుడు రివార్డులు లేదా క్యాష్ బ్యాక్ లలో అధిక ప్రయోజనం కలగవచ్చు.
రివార్డ్స్ క్రెడిట్ కార్డులు: కొన్ని రకాల లావాదేవీలపై రివార్డులను అందించే క్రెడిట్ కార్డులు ఉంటాయి.
ట్రావెల్ క్రెడిట్ కార్డులు: ఈ రకమైన క్రెడిట్ కార్డులతో ఎయిర్ లాంజ్ యాక్సెస్‌ను ఉచితంగా పొందొచ్చు.
క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డులు: ఈ కార్డులను ప్రత్యేకంగా క్యాష్‌బ్యాక్ కోసమే తీసుకొచ్చారు. వీటి సహాయంతో లావాదేవీలు చేస్తే చేసిన మొత్తంపై క్యాష్‌బ్యాక్ అందిస్తారు.
షాపింగ్ క్రెడిట్ కార్డులు: షాపింగ్ ప్రియులను దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిన ఈ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోళ్ల సమయంలో డిస్కౌంట్స్, రివార్డు పాయింట్స్ పొందొచ్చు.
ఫ్యూయల్ క్రెడిట్ కార్డులు: ప్రతీనెలా ఫ్యూయల్ కొనుగోలు చేసే వారికి ఈ క్రెడిట్ కార్డు బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొ్ు. దీంతో లావాదేవీలపై క్యాషబ్యాక్ పొందొచచు.
ప్రీమియం క్రెడిట్ కార్డులు: వినియోగదారుల ప్రత్యేక అవసరాల కోసం ఈ క్రెడిట్ కార్డులను తీసుకొచ్చారు.
లైఫ్‌స్టైల్ క్రెడిట్ కార్డులు: సినిమాలు, డైనింగ్ వంటి లైఫ్‌స్టైల్ అవసరాల కోసం ఈ కార్డు ఉపయోగపడుతుంది.
బిజినెస్ క్రెడిట్ కార్డులు: ఈ కార్డులను బిజినెస్ ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చారు.
క్రెడిట్ కార్డు తీసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి?
క్రెడిట్ కార్డు పొందాలంటే ఆ వ్యక్తి కచ్చితంగా భారతీయులై ఉండాలి.
కచ్చితంగా 18 ఏళ్లు నిండి ఉండాలి.
జీతం లేదా ఏదైనా స్థిరమైన ఆదాయ వనరు ఉండాలి.
క్రెడిట్ కార్డుల తీసుకోవాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ సమర్పించాలి.?
గుర్తింపు ధృవీకరణ పత్రం: క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని రకాల డాక్యుమెంట్స్ అవసరపడుతాయి. వీటిలో ప్రధాన మైనది ప్రభుత్వ గుర్తింపు పత్రం. అంటే ఐడెంటిటీ కార్డు అన్న మాట. వీటిలో ప్రధానమైనవి ఆధార్, పాన్, డ్రైవింగ్‌లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ వంటి వాటి నకలు సమర్పించాల్సి ఉంటుంది.
చిరునామా ధృవీకరణ పత్రం : చిరునామా ధ్రువీకరణ కోసం కరెంట్ బిల్లు, ల్యాండ్ లైన్ ఫోన్ బిల్లు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వంటి అడ్రస్ ప్రూఫ్ ఉండాలి.
ఇన్ కం ట్యాక్స్ రిటర్న్: కొన్ని రకాల బ్యాంకులు లేదా కొన్ని రకాల కార్డులకు మీ యాన్యువల్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటరట్న్స్ దాఖలకు సంబంధించిన పత్రాలను వివరాలను అందించాల్సి ఉంటుంది.
శాలరీ స్లిప్స్: ఒకవేళ మీరు ఉద్యోగి అయితే మీ గత నెల లేదా మూడు నెలల శాలరీ స్లిప్స్‌ను అడుగుతారు.
అప్లికేషన్ ఫామ్: బ్యాంకు ఇచ్చే దరఖాస్తు పత్రంలో అన్ని వివరాలను నింపి క్రెడిట్ కార్డు ఇచ్చే బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది.
పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో: కొన్ని బ్యాంకులు మీ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలను అడుగుతాయి.
బ్యాంక్ స్టేట్‌మెంట్: మీ ఆర్థిక నేపథ్యం గురించి తెలుసుకునే ఉద్దేశంతో కొన్ని బ్యాంకులు మీ ఆరు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్స్‌ను అడుగుతాయి.
ఫామ్ 16: జీతం పొందే వారు ఫామ్ 16 చెల్లించాల్సి ఉంటుంది.
పాన్ కార్డు: ప్రతి ఆర్థిక విషయంలోనూ పాన్ కార్డు, పాన్ నంబరును బ్యాంకులు ప్రధానంగా పరిగణిస్తాయి. మీకు క్రెడిట్ కార్డు ఇచ్చే ముందు మీ రుణ పరపతిని సిబిల్ స్కోర్ ద్వారా అంచనా వేస్తాయి. దీనికి పాన్ కార్డు చాలా ప్రధానం.
క్రెడిట్ కార్డ్ ఎలా పనిచేస్తుంది.?
మీరు ఏదైనా లావాదేవి కోసం క్రెడిట్ కార్డును ఉపయోగించిన వెంటనే కార్డు వివరాలు మర్చంట్ బ్యాంకుకు వెళ్తాయి. అంటే కార్డును జారీ చేసిన బ్యాంకుకు అన్నమాట. ఆ వివరాలు బ్యాంకుకు వెళ్లాక ఆ లావాదేవిని ఆ బ్యాంకు అంగీకరిస్తుంది. వెంటనే మీ క్రెడిట్ లిమిట్ నుంచి మీరు కొనుగోలు చేసిన మొత్తం కట్ అవుతాయి. ఇలా కొనుగోలు కోసం ఎన్ని సార్లు కార్డు వాడితే అన్ని సార్లు మీ కొనుగోలు వివరాలు బ్యాంకుకు వెళ్తాయి. బ్యాంకు మీకు జారీ చేసిన అప్పు విలువ నుంచి కొనుగోలు చేసిన విలువను తగ్గించుకుంటూ వస్తుంది. మరోవైపు ఖాతాదారుడికి బిల్ సైకిల్‌ను అందిస్తారు. అంటే అప్పటి వరకు కొనుగోలు చేసిన వాటి తాలూకు అప్పు వివవరాలతో కూడిన బిల్లును పంపుతారు.
ఈ బిల్లు అందుకున్న తర్వాత కనీసం 15 రోజుల్లోపు మనం బిల్లు జనరేట్ అయిన తేదీ వరకు చేసిన మొత్తం అప్పును తిరిగి బ్యాంకుకు చెల్లించాలి. ఒకవేళ పూర్తి బిల్లు చెల్లించకపోతే.. ఆ అప్పుకు వడ్డీ పడుతుంది. ఇందులో మరో ఆప్షన్ మినిమం బిల్ డ్యూ చెల్లించడం. ఇలా కనీసం రుణ మొత్తాన్ని చెల్లించడం వల్ల మన సిబిల్ స్కోర్ ఇంపాక్ట్ కాకుండా ఉంటుంది. బిల్లులో పేర్కొన్న గడువు లోపు అప్పు చెల్లిస్తే.. ఎలాంటి వడ్డీ పడదు. మళ్లీ ఆ మొత్తాన్ని తదుపరి నెలకు వాడుకోవచ్చు. ఇలా బిల్ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక క్రెడిట్ కార్డుతో మరో క్రెడిట్ కార్డుకు బిల్లు చెల్లింపు అవకాశాలు కూడా వచ్చాయి. అయితే వాటిని కాస్త జాగ్రత్తగా స్మార్ట్ గా వినియోగించాలి. లేకుంటే మీకు రుణ భారం పెరిగిపోవచ్చు.
క్రెడిట్ కార్డుల్లో సరైన కార్డును ఎలా ఎంచుకోవాలి.?
క్రెడిట్ కార్డును ఎంచుకునే సమయంలో ఖాతాదారులు కొన్ని రకాల అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* క్రెడిట్ కార్డు తీసుకునే సమయంలో పరిగణలోకి తీసుకోవాల్సి మొదటి అంశం మీరు ఎంత ఖర్చు చేస్తారన్నది. మీ ఖర్చులకు, మీకు వచ్చే ఆదాయానికి అనుగుణంగా కార్డును ఎంచుకోవాలి.
* మీకు ఎలాంటి రివార్డ్ పాయింట్స్, క్యాష్‌బ్యాక్ కావాలన్న దాని ఆధారంగా కార్డును ఎంచుకోవాలి. ఉదాహరణకు మీరు ఎక్కువగా మీ వెహికల్స్ కోసం ఫ్యూయల్ కొనుగోలు చేస్తే ఫ్యూయల్ కార్డును తీసుకుంటే మంచిది.
* ఇక కొన్ని రకాల క్రెడిట్ కార్డులపై వార్షిక ఛార్జీలు వసూలు చేస్తారు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. చాలా బ్యాంకులు క్రెడిట్ కార్డులను ఉచితంగా కూడా ఇస్తుంటాయి.
* కార్డు తీసుకునే సమయంలో ఆఫర్లను కూడా పరిగణలోకి తీసుకోవాలి.
* అత్యుత్తమ వెల్‌కమ్ బోనస్, లేదా గిఫ్ట్ అందించే కార్డులను సెలక్ట్ చేసుకోవాలి.
ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
మీరు ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డు తీసుకోవాలని భావిస్తున్నారో ఆ బ్యాంకు వెబ్ సైట్ కి వెళ్లి.. ఈ కింది స్టెప్స్ ఫాలో అవుతూ క్రెడిట్ కార్డును అప్లై చేసుకోవచ్చు.
స్టెప్ 1: ముందుగా మీ ఎంప్లాయిమెంట్ వివరాలు, పిన్‌కోడ్, మొబైల్ నెంబర్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ వంటి వివరాలు అందించారు.
స్టెప్ 2: మీ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.
స్టెప్ 3: మీ ప్రొఫై్ ఆధారంగా మీకు సూట్ అయ్యే బెస్ట్ క్రెడిట్ కార్డులు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి.
స్టెప్ 4: మీకు నచ్చిన క్రెడిట్ కార్డును సెలక్ట్ చేసుకొని అప్లై చేసుకుంటే సరిపోతుంది.
క్రెడిట్ కార్డు నెంబర్ అంటే ఏంటి.?
క్రెడిట్ కార్డు పై 12 నుంచి 16 అంకెలు ప్రింట్ అయ్యి ఉంటాయి. ఇది మీ కార్డుపై ఉండే యునిక్ నెంబర్. దీన్నే క్రెడిట్ కార్డు నంబరు అని అంటారు. ఇది ఆన్ లైన్ లావాదేవీలకు చాలా కీలకం. ఈ కార్డు నంబరు కార్డు వెనుక ఉండే సీవీవీ నంబరు, ఎక్స్ పియరీ డేటా, మీ మొబైల్ కి వచ్చే ఒటీపీ వివరాలతో ఆన్ లైన్ లావాదేవీలు చేయొచ్చు. ఆప్ లైన్ లో కార్డును స్వైప్ చేసి మీ పిన్ నంబరును ఎంటర్ చేసి బిల్లు చెల్లించవచ్చు.
క్రెడిట్ కార్డుపై లోన్ ఎలా తీసుకోవాలి?
క్రెడిట్ కార్డుపై లోన్ తప్పకుండా తీసుకోవచ్చు. అయితే మీకు నగదు అవసరమైనప్పుడు మాత్రమే లోన్ తీసుకోవాలి. ఎందుకంటే క్రెడిట్ కార్డు ద్వారా నగదు డ్రా చేస్తే.. మనకు నెలకు దాదాపు మూడు శాతం అంటే సంవత్సరానికి 36 నుంచి 40 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి రావొచ్చు. అలాకాకుండా మనం నగదు అవసరమైన సందర్భంలో కార్డుపై లోన్ తీసుకుంటే.. మీకు దాదాపు 15 నుంచి 20 శాతం వరకే వార్షిక వడ్డీ పడుతుంది. అలాగే మీరు తీసుకున్న లోన్ ని వడ్డీతో కలిసి ఈఎంఐ లరూపంలో అంటే నెలసరి వాయిదాల రూపంలో చెల్లించవచ్చు.
క్రెడిట్ కార్డులను గూగుల్ పే, ఫోన్ పే ఇతర యూపీఐ యాప్ లకు కూడా జత చేసి వాడుకోవచ్చు. డెబిట్ కార్డు, లేకుంటే యూపీఐ పే మెంట్లలాగా చెల్లింపులు చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
యూపీఐకి క్రెడిట్ కార్డును ఎలా లింక్ చేసుకోవాలి.?
యూపీఐ యాప్‌కి క్రెడిట్ కార్డును లింక్ చేసి పేమెంట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఇందుకోసం మీ దగ్గర కచ్చితంగా రూపే క్రెడిట్ ఉండాలి. ఇందుకోసం ముందుగా యూపీఐ యాప్ ఓపెన్ చేసి ప్రొఫైల్ ఆప్షన్‌లోకి వెళ్లాలి. అనంతరం అందులో లింక్ క్రెడిట్ కార్డును సెలక్ట్ చేసుకొని. మీ రూపే క్రెడిట్ కార్డ్ నెంబర్‌తో పాటు, సీవీవీ, గడువు తేదీ వంటి సమాచారాన్ని అందించాలి. ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత మీ కార్డు లింక్ అవుతుంది. ఇక ఆ తర్వాత నుంచి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ నుంచి పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డుతో పేమెంట్స్ చేస్తే ఎలాంటి చార్జీలు పడవు. యూపీఐకి క్రెడిట్ కార్డు ఎలా లింక్ చేసుకోవాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
క్రెడిట్ కార్డుకు సంబంధించి చాలా మందిలో ఉండే కొన్ని సందేహలు వాటికి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం..
* క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి.?
ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో డబ్బులు చెల్లించేందుకు ఉపయోగించే ఒక సాధానమే క్రెడిట్ కార్డు. సాధారణంగా డెబిట్ కార్డ్ ఉపయోగిచాలంటే మీ సేవింగ్ ఖాతాలో డబ్బులు ఉండాలి కానీ క్రెడిట్ కార్డుకు ఆ అవసరం ఉండదు. క్రెడిట్ కార్డుకు, డెబిట్ కార్డుకు మధ్య తేడా ఏంటో ఇక్కడ తెలుసుకోండి.
* ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డు పొందొచ్చా.?
అవును ఆయా బ్యాంకులకు చెందిన అధికారిక వెబ్‌సైట్స్‌లో క్రెడిట్ కార్డును అప్లై చేసుకోవచ్చు. ఒకే వేదికపై ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను బ్యాంక్ బజార్ లేదా ఇతర పోర్టళ్లలో కంపేర్ చేసుకోవచ్చు.
* కార్డు ఎక్సపైర్ అయిన తర్వాత కొత్త కార్డు తీసుకుంటే నెంబర్ మారుతుందా.?
ఒకవేళ మీ పాత క్రెడిట్ కార్డు టైమ్ ఎక్స్‌పైర్ అయితే వచ్చే కొత్త క్రెడిట్ కార్డులో కూడా పాత పాత్ కార్డుప ఉన్న నెంబరే ఉంటుంది. అయితే సీవీవీ నెంబర్ మాత్రం మారుతుంది.
* మొదటిసారి క్రెడిట్ కార్డు ఎలా పొందాలి.?
మీకు అంతకు ముందే క్రెడిట్ హిస్టరీ ఉంటే మీరు కార్డు పొందడానికి అర్హులా కాదా అన్న విషయాన్ని తెలుసుకొని, మీ అవసరాలకు అనుగుణంగా కొత్త కార్డును సెలక్ట్ చేసుకోవచ్చు.
* క్రెడిట్ కార్డు ఎలా పనిచేస్తుంది.?
క్రెడిట్ కార్డులో మీకు లైన్ ఆఫ్ క్రెడిట్‌ను అందిస్తారు. దీనినే క్రెడిట్ లిమిట్ అంటారు. కొనుగోలు చేసిన తర్వాత పేమెంట్ తేదీ లోపు బిల్లు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
* క్రెడిట్ కార్డ్ లిమిట్ అంటే.?
మీ క్రెడిట్ కార్డుతో గరిష్టంగా ఎంత కొనుగోలు చేయగలరో అదే మీ క్రెడిట్ కార్డు లిమిట్ అంటారు. క్రెడిట్ లిమిట్ మీ వినియోగం, సిబిల్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది.
* కచ్చితంగా ప్రతీ నెల క్రెడిట్ ఉపయోగించాలా.?
క్రెడిట్ కార్డును కచ్చితంగా ఉపయోగిచాలని ఏం లేదు. అయితే బ్యాంకు వాళ్లు మీ కార్డును ఇన్‌యాక్టివ్ కార్డుగా భావించకూడదంటే అప్పుడప్పుడు లావాదేవీ చేయడం ఉత్తమం.
క్రెడిట్ కార్డు పొందడానికి ఎంత క్రెడిట్ స్కోర్ ఉండాలి.?
మీ క్రెడిట్ స్కోర్ 750కిపైగా ఉంటే మీకు కచ్చితంగా క్రెడిట్ కార్డు వస్తుంది.
ఉద్యోగం లేకపోతే క్రెడిట్ కార్డు ఎలా పొందాలి.?
మీకు ఉద్యోగం లేకపోయినా క్రెడిట్ కార్డు పొందొచ్చు. ప్రతీ నెల మీ సేవింగ్స్ ఖాతాలో కొంత మొత్తంలో లావాదేవీలు జరిగితే చాలు.
ఒక్క రోజులో క్రెడిట్ ఎలా పొందాలి.?
ఆన్‌లైన్ అప్లికేషన్ విధానం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇది సాధ్యమైంది. ఒక్క రోజులో క్రెడిట్ కార్డు మంజూరవుతుంది. అయితే మీకు ఫిజికల్ కార్డు మాత్రం ఒక్క రోజులో రాకపోతుండొచ్చు.
క్రెడిట్ కార్డుల్లో ఎయిర్‌పోర్ట్ లాంజ్ బెనిఫిట్స్ ఉంటాయా.?
అవును చాలా క్రెడిట్ కార్డులు ఈ బెనిఫిట్‌ను కాంప్లిమెంటరీగా అందిస్తున్నారు. దీంతో ఎయిర్‌పోర్టుల్లో ఉండే లాంజ్ సేవలను ఉచితంగా పొందొచచు.
క్రెడిట్ కార్డుతో లాభాలున్నాయా.?
అవును చాలా వరకు క్రెడిట్ కార్డులు రివార్డ్ పాయింట్స్ అందిస్తుంటాయి. ప్రతీ లావాదేవీకి రివార్డ్ పాయింట్స్ పొందొచ్చు. వీటిని రీడీమ్ చేసుకోవచ్చు. అలాగే క్యాష్ బ్యాక్ ఆపర్లు కూడా ఉంటాయి. క్రెడిట్ కార్డుతో అద్దె ఎలా చెల్లించుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
ఎన్ని క్రెడిట్ కార్డులను కలిగి ఉండొచ్చు.?
ఇన్నే క్రెడిట్ కార్డులు ఉండాలని ఎలాంటి నిబంధనలు లేవు. మీకు ఎన్ని క్రెడిట్ కార్డులు ఉండాలన్నది మీ ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అయితే ఎన్ని కార్డులు ఉన్నాయన్న దాని కంటే మీకు కార్డులను ఎంత తెలివిగా ఉపయోగిస్తున్నారన్నది ముఖ్యం. క్రెడిట్ కార్డులను తెలివిగా ఎలా ఉపయోగించుకోవాలో పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సిబిల్ స్కోర్ లేకపోయినా కార్డు పొందొచ్చా.?
750కిపైగా సిబిల్ స్కోర్ ఉంటే దాన్ని సంస్థలు మంచి క్రెడిట్ స్కోర్‌గా పరిగణిస్తాయి. అయితే 750 లోపు ఉంటే మాత్రం మీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై ఆధారపడి కార్డులను అందిస్తారు.
క్రెడిట్ కార్డు దరఖాస్తు సులభమైన మార్గం ఏంటి.?
బ్యాంకు వెబ్ సైట్ లో అప్లై చేసుకోవడమే.
క్రెడిట్ స్టేట్‌మెంట్‌లో మినిమం డ్యూ అంటే ఏంటి.?
క్రెడిట్ కార్డు ద్వారా మీరు చేసిన మొత్తం పేమెంట్‌ను ఒకేసారి తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో మినిమం కొంత మొత్తాన్ని చెల్లించవచ్చు. సాధారణంగా ఇది మీ పూర్తి ఖర్చులో 5శాతం ఉంటుంది.
క్రెడిట్ కార్డు ద్వారా లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలా.?
అవును క్రెడిట్ కార్డు ఆధారంగా లోన్స్ తీసుకుంటే బ్యాంకులు సహజంగా ప్రాసెసింగ్‌ను వసూలు చేస్తాయి. అయితే ఇది నామమాత్రంగానే ఉంటుంది. క్రెడిట్ కార్డుతో లోన్ ఎలా తీసుకోవాలో పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
క్రెడిట్ కార్డును ఇతర దేశాల్లో ఉపయోగించుకోవచ్చా.?
ఇది మీ క్రెడిట్ కార్డు రకంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీ క్రెడిట్ కార్డు గ్లోబల్లీ యాక్సెప్టెన్స్ క్యాటగిరీ కిందికి వస్తే విదేశాల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే విదేశాల్లో చేసే లావాదేవీలకు అధిక మొత్తంలో ఛార్జీలు ఉంటాయి.
బిల్లు ఆలస్యంగా చెల్లిస్తే క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడుతుందా.?
మీరు ఎంత ఆలస్యంగా బిల్లును చెల్లించారు.? ఎంత మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారు? లాంటి అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది.
క్యాష్ విత్‌డ్రా చేస్తే ఛార్జీలు ఎలా ఉంటాయి.?
అది మీరు కార్డు ఉపయోగిస్తున్న బ్యాంకుపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా రూ. 250 నుంచి రూ. 500 వరకు తీసుకుంటే 2.5 శాతం నుంచి 3 శాతం వరకు వసూలు చేస్తాయి.
క్రెడిట్ కార్డు పోతే ఏం చేయాలి.?
మీ క్రెడిట్ కార్డు పోయిన వెంటనే బ్యాంకుకు ఆ వివరాలను తెలియజేసి కార్డు బ్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది.
క్రెడిట్ స్కోర్ లేకుండా క్రెడిట్ కార్డు పొందొచ్చా.?
క్రెడిట్ స్కోర్ లేకపోయినా క్రెడిట్ కార్డు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఇందుకోసం బ్యాంకులు అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంటుంది.
క్రెడిట్ లిమిట్‌ను ఎలా నిర్ణయిస్తారు.?
మీ నెలవారి ఆదాయం మీ క్రెడిట్ స్కోర్, మీరు తిరిగి చెల్లిస్తున్న అంశాల ఆధారంగా మీ క్రెడిట్ లిమిట్‌ను నిర్ణయిస్తారు.
విదేశాల్లో కొనుగోలు చేస్తే ఛార్జీలు పడతాయా?
విదేశీ లావాదేవీలకు మీ క్రెడిట్ కార్డుపై 1 నుంచి 4 శాతం వరకు బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తారు.

