క్రెడిట్ కార్డ్‌తో ఇంటి అద్దె కట్టడం లాభమా? నష్టమా?
క్రెడిట్ కార్డు ఉపయోగించే చాలా మంది రెంట్, కరెంట్ బిల్ లాంటివి చెల్లించి తర్వాత క్రెడిట్ బిల్ కడుతుంటారు. దీని వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. అలాగే ఇబ్బందులు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకోవడానికి ఈ స్టోరీ పూర్తిగా చదవండి.
సిటీస్ లో పనిచేసే ప్రతి ఉద్యోగికి ఇంటి అద్దె పెద్ద సమస్య. సమయానికి కట్టకపోతే ఓనర్ ఒప్పుకోడు. కడదామంటే జీతం టైం కి అకౌంట్ లోకి రాదు. ఈ సమస్యకు ఇన్ స్టంట్ సొల్యూషన్ క్రెడిట్ కార్డు ఉపయోగించడమే. క్రెడిట్ కార్డు ఉపయోగించి ఇంటి అద్దె మాత్రమే కాకుండా కరెంట్ బిల్, ఇన్సూరెన్స్, ఆన్ లైన్ షాపింగ్ వంటి అనేక పేమెంట్స్ చేయొచ్చు.
అద్దె చెల్లించడానికి క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించడం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య మధ్యవర్తిగా థర్డ్ పార్టీ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించడమే. మరి ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించడం వల్ల కలిగే లాభ, నష్టాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లించడం వల్ల కలిగే ప్రయోజనాలు
క్రెడిట్ కార్డ్ ద్వారా అద్దె చెల్లిస్తే థర్డ్ పార్టీ యాప్స్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఇస్తాయి. ప్రయాణ టిక్కెట్లపై డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్స్ ప్రకటిస్తాయి. రెంట్ అమౌంట్ ఎక్కువగా ఉంటే ఇంకా ఆఫర్లు ఎక్కువ ఇస్తాయి. ఉదాహరణకు రూ. 25,000 రెంట్ పే చేస్తే 2% క్యాష్‌బ్యాక్ కార్డ్ నెలవారీ రూ. 500 క్యాష్‌బ్యాక్‌ను లభిస్తుంది. ఇలాంటి ఆఫర్లు థర్డ్ పార్టీ ప్లాట్‌ఫారమ్ లపై ఆధారపడి ఉంటాయి.
క్రెడిట్ కార్డ్ బిల్లు తిరిగి చెల్లించడానికి గ్రేస్ పీరియడ్ 20 నుంచి 45 రోజుల వరకు లభిస్తుంది. ఇది మీరు ఫైనాన్సియల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు ఈ గ్రేస్ పీరియడ్ ఎంతో ఉపయోగపడుతుంది.
క్రెడిట్ కార్డ్ ద్వారా సకాలంలో అద్దె చెల్లింపులు చేస్తే మీ క్రెడిట్ హిస్టరీ స్ట్రాంగ్ గా మారుతుంది. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుస్తుంది.
నగదు చెల్లించడం, UPI బదిలీలు లేదా చెక్కుల ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయడం లాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. మీరు ముందుగానే షెడ్యూల్ చేస్తే ఆటోమేటిక్ గా పేమెంట్స్ జరిగిపోతాయి. మీకు బర్డెన్ తగ్గుతుంది. చివరిగా క్రెడిట్ కార్డు బిల్లు కట్టుకుంటే సరిపోతుంది.
డబ్బు ఇబ్బందులు ఉన్నప్పుడు క్రెడిక్ కార్డు మీ సమస్యకు తాత్కాలిక పరిష్కారాన్ని చూపిస్తుంది. పేమెంట్స్ చేయడంలో ఆలస్యం లేకుండా, గొడవలకు ఆస్కారం లేకుండా చేస్తాయి.
క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లించడం వల్ల కలిగే నష్టాలు
థర్డ్ పార్టీ ప్లాట్‌ఫారమ్‌లు తరచుగా 1.5%, 3% మధ్య ఛార్జ్ వసూలు చేస్తాయి. ఇది మీరు సంపాదించిన రివార్డ్‌లతో దాదాపు సమానంగా ఉంటుంది. అంటే మీకు వచ్చే లాభం ఏమీ లేదన్నమాట. ఉదాహరణకు రూ. 25,000 అద్దె చెల్లింపుపై 2% ఛార్జ్ వసూలు చేస్తే నెలకు రూ. 500 లేదా సంవత్సరానికి రూ. 6,000కి మీరు కట్టాల్సి ఉంటుంది.
గ్రేస్ పీరియడ్ లోపు క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే సంవత్సరానికి 30 % నుండి 42 % వరకు ఉన్న వడ్డీ రేట్లు వసూలు చేస్తారు.
క్రెడిట్ కార్డు వాడటం వల్ల మీకు తెలియకుండా ఖర్చులు పెరిగిపోతాయి. తిరిగి చెల్లించలేని పరిస్థితి వచ్చేస్తుంది. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది.
కొందరు ఇంటి యజమానులు థర్డ్ పార్టీ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా రెంట్ తీసుకోవడానికి ఇష్టపడరు. వారి డీటైల్స్ ఇవ్వడానికి అంగీకరించరు. ఒక్కోసారి ఇవి మిస్ యూజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.
అందువల్ల మీ క్రెడిట్ కార్డును చాలా జాగ్రత్తగా అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తే ఇంటి అద్దె లాంటి ఖర్చులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.