Asianet News TeluguAsianet News Telugu

ఏటీఎంకెళుతున్నారా?! బీకేర్ పూల్.. 74 శాతం ఏటీఎంలు సేఫ్ కాదు మరి

సులువుగా నగదు లావాదేవీలు జరిపేందుకు బ్యాంకులు ఏర్పాటు చేస్తున్న ఏటీఎంలు మోసాలకు నిలయంగా మారాయని సాక్షాత్ కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ సాక్షిగా ఒప్పుకున్నది. గత ఏడాది కాలంలో ఎటీఎం కేంద్రాల్లో మోసాలపై భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ), కేంద్రం ద్రుష్టికి వచ్చిన ఫిర్యాదులే 25 వేలంటే పరిస్థితి తీవ్రత ఏమిటో అవగతమవుతోంది.

Close to 74% PSU Bank ATMs Operating on Outdated Software, At Risk of Fraud: Govt

న్యూఢిల్లీ: నగదు అవసరాల నిమిత్తం నిత్యం ఏటీఎంలను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య మన దేశంలో ఇటీవల అంతకంతకు పెరుగుతోంది. సాధారణ అక్షరాస్యులు కూడా హాయిగా నగదు లావాదేవీలు జరిపేలా బ్యాంకులు ఎటీఎంలను విస్తరిస్తున్నాయి. బ్యాంక్‌ శాఖల్లో వెతలు తట్టుకోలేక ప్రజలు ఎక్కువగా ఏటీఎంలపై ఆధారపడుతుడడం కనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఏటీఎంలను విస్తృతంగా వినియోగిస్తున్న దేశ ప్రజలను కలవర పెట్టేలా సర్కార్ తాజాగా ఒక విషయం బయటపెట్టింది. 

పీఎస్బీ ఎటీఎంల్లో నాలుగోవంతు మోసాలకు చాన్స్


దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) ఏటీఎంలలో దాదాపు నాలుగోవంతు ఏటీఎంల్లో మోసాలకు అవకాశం పొంచి ఉన్నదన్నదే దాని సారాంశం.సర్కార్ బ్యాంకుల కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఏటీఎంలలో దాదాపు 74 శాతం ఏటీఎంలు కాలం చెల్లిన, అవసరాలకు సరి పడని సాఫ్ట్‌వేర్లపై పని చేస్తున్నట్టు పార్లమెంట్‌ సాక్షిగా ప్రభుత్వం చెప్పింది. ఏటీఎంల భద్రతపై పార్లమెంట్‌ సభ్యులు అడిగిన ప్రశ్నకు సర్కార్ ఇచ్చిన సమాధానంలో వెల్లడించిన భయంకర నిజాలివి. దీనిబట్టి మన దేశంలో ఏటీఎంల యంత్రాలు ఎంత భద్రంగా ఉన్నాయో అవగతమవుతోంది.

89% ఏటీఎంలు ప్రభుత్వ రంగ బ్యాంకులవే


భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) వద్ద అందుబాటులో ఉన్న సమాచారం మేరకు దేశంలో దాదాపు 2,49,800 ఏటీఎంలు నిత్యం ప్రజలకు సేవలందిస్తున్నాయి. ఇందులో దాదాపు 89% అంటే దాదాపు 2,25,500 వరకు ఏటీఎంలు ప్రభుత్వ రంగ బ్యాంకులవే. వీటి నిర్వహణను బ్యాంకులు వివిధ ఏటీఎం నిర్వహణ సంస్థలకు అప్పగిస్తున్నాయి. ఈ సంస్థలు ఎక్కువగా ఏటీఎం యంత్రాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. ఆయా దేశాల్లో ఔట్‌డేటెడ్ టెక్నాలజీలతో తయారైన యంత్రాలను కూడా ఏటీఎం నిర్వహణ సంస్థలు తక్కువ ధరలకు కొనుగోలు చేసి.. పీఎస్‌బీ ఏటీఎంలుగా దేశంలోని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నాయి. 

శివారు, మారుమూల ప్రాంతాల్లో ఔట్ డేటెడ్ ఎటీఎంలు


ఏటీఎంల నిర్వహణ సంస్థలు చాలా తెలివిగా ఇలాంటి ఔట్‌డేటెడ్‌ ఏటీఎంలను పట్టణాల శివారు ప్రాంతాల్లోనూ, గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తుండడంతో అమాయకులు నిత్యం మోసాల పాలవుతూ తన సొమ్మును పోగొట్టుకుంటున్నారు. యంత్రాలను ఏర్పాటు చేసిన తరువాత వాటిలో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేషన్‌ అంశాన్ని ఆయా సంస్థలు పట్టించుకోవడమే మానేశాయి. ఇంది వ్యయంతో కూడుకున్నది కావడమే ఇందుకు కారణం. 

ఏడాదిలో 25 వేల ఫిర్యాదులు..


ఎక్కువ విస్తృతి కలిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశంలో అత్యధికంగా ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నాయి. లెక్కకు చూస్తే దేశంలోని 72% మంది బ్యాంక్‌ ఖాతాదారులు ప్రభుత్వ రంగ బ్యాంకుల లోనే తమ ఖాతాలను కలిగి ఉన్నారు. బ్యాంకులు తమ కార్యకలాపాలకు ప్రత్యామ్నాయంగా ఏటీఎం వ్యవస్థను తీర్చిదిద్దాలని.. తమ పని భారాన్ని వీలైనంత ఎక్కువగా తగ్గించుకోవాలని చూస్తున్నాయి కానీ కనీసం సెక్యూరిటీ చర్యలు కూడా చేపట్టకపోవడంతో ఏటీఎం యంత్రాల్లో మోసాలు అంతకంతకు పెరుగుతున్నాయని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. 2017 జులై నుంచి 2018 జూన్‌ మధ్య కాలానికి ఏటీఎంల వద్ద డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల వినియోగం విషయమై దాదాపు నమోదైన 25వేల మోసాల్లో సుమారు రూ.860 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి.

వెలుగు చూడని ఫిర్యాదులు రెట్టింపు


ఆర్బీఐ, కేంద్రం ద్రుష్టికి వచ్చిన ఫిర్యాదులు పాతిక వేలుగా కనిపిస్తున్నా.. వెలుగు చూడని మోసాల సంఖ్య ఇందుకు రెట్టింపు ఉండొచ్చని బ్యాంకింగ్‌ కార్యకలాపాల నిపుణలు చెబుతున్నారు. ఈ ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఎటీఎం సెంటర్లను అప్ గ్రేడ్ చేయాలని సంబంధిత బ్యాంకర్లను ఆదేశించినా పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. వచ్చే ఏడాది జూన్ నెలాఖరు నాటికి ఎటీఎంల్లో అప్ డేట్ చేసిన సాఫ్ట్ వేర్ అందుబాటులో ఉంటుందని అధికార వర్గాల కథనం. 

బ్యాంకుల పర్యవేక్షణా లోపం వల్లేనని విమర్శలు


కనీస విషయ పరిజ్ఞానం లేని సామాన్యులు.. ఏటీఎంలలో మోసాల గురించి ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియక సొమ్ము పోగొట్టుకొని మిన్నకుండిపోతున్నారు. బ్యాంకుల పర్యవేక్షణ లోపం కారణంగా సామాన్య ప్రజలు అధిక మొత్తంలో ఏటీంఎ మోసాలకు గురవుతున్నా సర్కారు మొద్దునిద్రను వీడకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. దేశంలో ఈ తరహా మోసాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకుంటున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఏడాది కాలంలొ దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏటీఎంలలో 861 కోట్ల లావాదేవీలు జరిగాయి. మోసాలు మాత్రం పాతిక వేలుగా మాత్రమే నమోదు కావడం సాధారణమేనంటూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ప్రకటించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios