న్యూఢిల్లీ : దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) కనీసం మూడేళ్లు అన్ని రకాల నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) పేర్కొంది. అప్పుడే అవి పునరుజ్జీవం సాధించి ఆర్థిక పురోగతికి తమ వంతు వాటా అందించగలుగుతాయని ప్రభుత్వానికి సూచించింది. 

ఎంఎస్ఎంఈలకు మరింతగా ప్రత్యేక సాయం అందించాల్సిన అవసరం ఉన్నదని సీఐఐ నొక్కి చెప్పింది పలు రకాల అనుమతులు, తనిఖీల నుంచి  వాటికి విముక్తి కల్పించాలని అభ్యర్ధించింది. దేశంలో వ్యాపార అనుకూలతను (ఈఓడీబీ) మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన కీలక విభాగాలను గుర్తించినట్లు సీఐఐ తెలిపింది. 

దేశం స్వయంసమృద్ధిని సాధించేందుకు ఈ చర్యలు ఎంతో ఉపయోగ పడతాయని తెలిపింది. మనం స్వయంసమృద్ధి ద్వారా మరింత శక్తివంతం కావాలని కోరుతున్న ప్రస్తుత తరుణంలో దేశ విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షించేందుకు ఫలితాల ఆధారిత ఈఓడీబీ కార్యాచరణ చేపట్టడం అవసరమని నివేదికలో సీఐఐ తెలిపింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భిన్న రంగాల్లో పలు విప్లవాత్మక సంస్కరణలు ప్రకటించిన ఫలితంగానే ప్రపంచబ్యాంకు 190 దేశాలకు ప్రకటించే ఈఓడీబీ ర్యాంకింగ్‌లో భారత్‌ 2014లో ఒక్కసారిగా 79 స్థానాలను దాటుకుంటూ 142 నుంచి 63వ స్థానానికి దూసుకుపోయిందని సీఐఐ గుర్తు చేసింది. 

సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘పెట్టుబడుల సానుకూలతకు పలు విధానాలు ప్రకటిస్తున్న నేపథ్యంలో మదుపరిలో విశ్వాసాన్ని ఇనుమడింప చేయడానికి క్షేత్రస్థాయిలో ఫలితాల ఆధారిత వ్యూహాలు సానుకూల ఫలితాలనిస్తాయి.

ప్రపంచం యావత్తు భారీగా కొత్త పెట్టుబడులను ఆశిస్తున్న ప్రస్తుత వాతావరణంలో ఈఓడీబీ మార్గాన్ని అనుసరించడం వల్ల మన సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి’ అని పేర్కొన్నారు.

also read ఐటీఆర్ దాఖలు తొమ్మిది రోజులే టైం.. చేయాల్సినవీ ఇవీ

లాక్‌డౌన్‌ తొలగింపు తర్వాత కూడా వినియోగదారుల సెంటిమెంట్‌ బలహీనంగానే ఉండడం వల్ల జూన్‌ ప్రథమార్ధంలో మాల్స్‌, వ్యవస్థీకృత భారీ రిటైల్‌ స్టోర్ల వ్యాపారాల్లో భారీ క్షీణత నమోదైంది. ఏడాది క్రితంతో పోల్చితే జూన్‌ ప్రథమార్ధంలో మాల్స్‌ 77 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయని, భారీ రిటైల్‌ దుకాణాల  వ్యాపారాలు 61 శాతం క్షీణించాయని భారత రిటైలర్స్‌ అసోసియేషన్‌ (ఆర్‌ఏఐ) నిర్వహించిన సర్వేలో తేలింది. 


కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా 70 రోజుల మూసివేత అనంతరం మార్గదర్శకాల సడలింపులు ప్రకటించడంతో మాల్స్‌, భారీ రిటైల్‌ దుకాణాలు తిరిగి తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. అయినా ప్రతీ ఐదుగురు వినియోగదారుల్లో నలుగురు వ్యయాలను తగ్గించుకునేందుకే మొగ్గు చూపారని తమ సర్వేలో తేలిందని ఆర్‌ఏఐ తెలిపింది.

క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్లు (క్యూఎస్ఆర్‌), రెస్టారెంట్లు 70 శాతం, దుస్తులు, వస్ర్తాల దుకాణాలు 69 శాతం, ఆభరణాలు, వాచీలు, ఇతర వ్యక్తిగత యాక్సెసరీలు 65 శాతం క్షీణతను నమోదు చేశాయని పేర్కొంది.

రిటైల్‌ విభాగం క్రమంగా తెరుచుకుంటున్నా ఇంకా భారీగా దుకాణాలు మూతపడే ఉన్నందు వల్ల వ్యాపారాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయని, ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కూడా ఉన్నదని ఆర్‌ఏఐ సీఈఓ కుమార్‌ రాజగోపాలన్‌ అన్నారు. పైగా దేశమంతటా లాక్‌డౌన్‌ సడలింపులు ఒకేలా లేవంటూ భవిష్యత్‌లో ఈ సడలింపులు ఒకేలా ఉండగలవని భావిస్తున్నామన్నారు.