టాటా సన్స్ నుంచి యస్ బ్యాంక్ వరకు తప్పని కార్పొరేట్ ఆధిపత్య పోరు

Boardroom battles not limited to Tata-Mistry
Highlights

సైరస్ మిస్త్రీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ తోసిపుచ్చడంతో టాటా సన్స్ యాజమాన్యం ఆనంద డోలికల్లో మునిగి తేలుతోంది.

న్యూఢిల్లీ: సైరస్ మిస్త్రీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ తోసిపుచ్చడంతో టాటా సన్స్ యాజమాన్యం ఆనంద డోలికల్లో మునిగి తేలుతోంది. విశ్వాసం లేకపోవడంతోనే సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా సైరస్ మిస్త్రీని టాటా సన్స్ పాలకమండలి తొలగించివేసిందని ఎన్సీఎల్టీ స్పష్టం చేసింది. ఎన్సీఎల్టీ తీర్పుపై టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా మాట్లాడుతూ 2016 అక్టోబర్ నెలలో తమ సంస్థ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని తీర్పు సమర్థించిందన్నారు. మన న్యాయవ్యవస్థ గర్వ పడేలా చేసిందన్నారు. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ కంపెనీలు, వాటాదార్లు, ప్రజల ప్రయోజనాలపై ఉన్న ఆందోళనలన్నిటినీ ఎన్‌సీఎల్‌టీ తీర్పు తొలగించి వేసిందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కార్పొరేట్‌ పాలన, పారదర్శకతకు ఎపుడూ టాటా గ్రూప్‌ కట్టుబడి ఉంటుందని తెలిపారు. అప్పీల్ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. 


2016 అక్టోబర్ నెలలో అకస్మాత్‌గా టాటా సన్స్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తొలగిస్తూ భారతదేశంలోని కార్పొరేట్ రంగ సంస్థల అత్యున్నత స్థాయి పాలక మండళ్ల బోర్డు రూమ్ యుద్ధాలు సర్వసాధారణమేనని పరిస్థితులు చెబుతున్నాయి. టాటా గ్రూప్, సైరస్‌ మిస్త్రీల మధ్య వివాదంతో కంపెనీలపై ఆధిపత్యం కోసం బోర్డు రూమ్‌ వేదికగా జరిగే వ్యూహాలు, యుద్ధాలు మరోసారి తెరపైకి వచ్చాయి. రిలయన్స్‌ నుంచి ఇన్ఫోసిస్‌ దాకా పలు దిగ్గజ సంస్థల్లోనూ ఇలాంటి బోర్డు రూమ్‌ యుద్ధాలు చోటుచేసుకున్నాయి. 

ఇలా రతన్ టాటాకు తప్పని కార్పొరేట్ ఘర్షణ


టాటా గ్రూప్‌ అధినేతగా రతన్‌ టాటా కూడా స్వయంగా ఇలాంటివి ఎదుర్కొన్నారు. 2016 అక్టోబర్ నుంచి 2017లో టీసీఎస్ ఎండీగా ఉన్న చంద్రశేఖరన్‌ను టాటాసన్స్ చైర్మన్‌గా నియమించే వరకూ టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పని చేసిన రతన్ టాటా వాస్తవంగా 2012 డిసెంబర్ నెలలో రిటైరయ్యారు. ప్రస్తుతం 78వ పడిలో పడ్డ రతన్ టాటా 1990వ దశకంలో యువకుడిగా టాటా సన్స్ చైర్మన్‌గా అనుబంధ సంస్థ టాటా స్టీల్స్ కు చెందిన రూసీ మోదీ, టాటా కెమికల్స్ అధినేత దర్బారి సేథ్, ఇండియన్ హోటల్స్ సీఎండీ అజిత్ కేర్కర్, వోల్టాస్ చీఫ్ ఏహఎచ్ టొబాకోవాలాతో ఘర్షణలకు దిగారు. 

ధీరుబాయి మరణంతో అంబానీ కుటుంబంలో బయటపడ్డ విభేదాలు


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకుడు ధీరూభాయ్‌ అంబానీ మరణానంతరం 2002లో ఆయన ఇద్దరు కుమారులు ముకేశ్, అనిల్‌ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. గ్రూప్‌ యాజమాన్య అంశంపై విభేదాలు ఉన్న మాట వాస్తవమేనంటూ పెద్ద కుమారుడు ముకేశ్‌ 2004 నవంబర్‌లో ఒక టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించడం వీటికి ఊతమిచ్చింది. ఆ తర్వాత మీడియా వేదికగా ఇరు వర్గాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం జరిగింది. చివరికి 2005 జూన్‌లో గ్రూప్‌ ఆస్తులు పంచుకుని సోదరులిద్దరూ సెటిల్మెంట్‌ చేసుకున్నారు. 

కొకిలాబెన్ మధ్యవర్తిత్వంతో రిలయన్స్ పంపకాలు


ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ మధ్య మధ్యవర్తిత్వం వహించిందీ వారి తల్లి కొకిలాబెన్. ముకేశ్ అంబానీకి రిలయన్స్ ఫ్లాగ్ షిప్ పరిశ్రమలు ఐపీసీఎల్, ఆయిల్ అండ్ గ్యాస్, టెక్స్ టైల్ రంగాల బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు అనిల్ అంబానీ రిలయన్స్ ఇన్ఫో కాం, రిలయన్స్ ఎనర్జీ, రిలయన్స్ కేపిటల్, టెలికం, పవర్, ఆర్థిక, వినోద రంగ సేవల సంస్థలకు సారథ్యం వహించారు. విభజన తర్వాత కూడా గ్యాస్ అండ్ టెలికం రంగాల విషయమై ఇరువురి మధ్య విభేదాలు కొనసాగుతూనే వచ్చాయి. కానీ 2010 మేలో వారు తమ విభేదాలను పక్కనబెట్టాలని నిర్ణయించారు. సామరస్య పూరిత వాతావరణం, సహకారం అందించుకోవాలని ప్రతిపాదించారు. తద్వారా రెండు గ్రూపుల మధ్య వివాదాల పరిష్కారానికి మార్గం సుగమమైంది. 

ఇన్ఫోసిస్‌ కార్పొరేట్ సుపరిపాలనపై వ్యవస్థాపకులు ఇలా


దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ గతేడాది వివాదాల్లో చిక్కుకుంది. ఒకనాటి భారత ఐటీ రంగ పరిశ్రమకు పోస్టర్ బాయ్ ‘ఇన్ఫోసిస్’. గత ఫిబ్రవరిలో సంస్థలో కార్పొరేట్‌ గవర్నెన్స్‌ లోపించిందంటూ సంస్థ సహ వ్యవస్థాపకులు నారాయణ్ మూర్తి, నందన్ నీలేకని, క్రిస్‌ గోపాలకృష్ణన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఇన్ఫోసిస్ పాలక మండలికి, వస్థాపకులకు మధ్య వార్‌ మొదలైంది. మాజీ ఉద్యోగులు రాజీవ్‌ బన్సల్, డేవిడ్‌ కెనెడీలకు భారీ వీడ్కోలు ప్యాకేజీనివ్వడం, అప్పటి సీఈవో విశాల్‌ సిక్కాకు భారీగా జీతభత్యాలు పెంచడం, పనయా సంస్థ కొనుగోలుపై వ్యవస్థాపకులు ప్రశ్నలు లేవనెత్తారు. కానీ ఆర్ శేషసాయి అధ్యక్షతన జరిగిన ఇన్ఫోసిస్ పాలక మండలి.. సంస్థ సహ వ్యవస్థాపకులు ప్రత్యేకించి నారాయణ్ మూర్తి విమర్శలకు చెక్ పెట్టింది.

మూర్తి విమర్శలతో సిక్కా ఇలా రాజీనామా


ఇన్ఫోసిస్ వ్యవస్థాపక అధినేత నారాయణ మూర్తి అదేపనిగా విమర్శలు గుప్పించడంతో తట్టుకోలేక ఇన్ఫోసిస్ సీఈఓగా సిక్కా గతేడాది ఆగస్టులో రాజీనామా చేశారు. తర్వాతీ క్రమంలో ఆర్ శేషశాయి, జెఫ్ లెహ్మాన్, జాన్ ఎచెమెండీ కూడా ఇన్ఫోసిస్ పాలక మండలికి రాం రాం చెప్పారు. దాని కొనసాగింపుగా సంస్థ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని సంస్థ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నందన్ నిలేకని బాధ్యతలు స్వీకరించారు. జనవరిలో సలీల్ ఎస్ పరేఖ్‌ను ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కం మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 

యస్‌ బ్యాంక్‌లో డైరెక్టర్ నియామకంపై ఇలా..  


2008 ముంబై టెర్రరిస్టు దాడుల్లో యస్ బ్యాంకు సహ వ్యవస్థాపకుడు అశోక్‌ కపూర్‌ మరణించారు. ఆ తర్వాత ఏడాదికి కంపెనీ బోర్డులో డైరెక్టర్‌ నియామకం విషయంలో అశోక్‌ కపూర్‌ కుటుంబం, మరో సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది.అశోక్‌ సతీమణి మధు కపూర్ తమ కుమార్తె షగున్‌ కపూర్‌ గోగియాను డైరెక్టర్‌గా నియమించాలనుకున్నారు. 

ఆర్బీఐ సాకుతో డైరెక్టర్‌గా షగున్ కపూర్ గోగియా అనుమతి నిరాకరణ


యస్‌ బ్యాంక్‌ పాలక మండలి బోర్డు ఆర్బీఐ నిబంధనలతో షగున్ కపూర్ గోగియాను డైరెక్టర్‌గా నియమించడానికి అర్హతలు లేవని పేర్కొంది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత 2015 జూన్‌లో మధు కపూర్‌ కుటుంబానికి అనుకూలంగా బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. అంతే కాదు బోర్డు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఎమ్మార్ శ్రీనివాసన్, దివాన్ అరుణ్ నందాలను నియమించడాన్ని కూడా మధు కపూర్ కుటుంబం సవాల్ చేస్తోంది.

loader