న్యూఢిల్లీః ప్రముఖ కార్ల తయారీ సంస్థలు టయోటా కిర్లోస్కర్, మారుతీ సుజుకి సంయుక్తంగా తయారు చేసిన తొలి క్రాస్-బ్యాడ్జ్ హ్యాచ్బ్యాక్ ప్రీమియం కారు ‘టయోటా గ్లాంజా’ గురువారం భారత విపణి విడుదల అయింది. దీని ప్రారంభ ధర రూ. 7.22 లక్షలుగా నిర్ణయించారు.

మారుతి సుజుకి బదిలీ చేసిన టెక్నాలజీతో అభివ్రుద్ధి చేసిన మోడల్ కారు ‘గ్లాంజా’ను పూర్తిగా భారత్ స్టేజ్-6 ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసినట్లు టయోటా పేర్కొంది. 

నాలుగు ధరల్లో లభించే గ్లాంజా – జీ ఎంటీ స్మార్ట్ హైబ్రీడ్ కారు ధర రూ.7.22 లక్షలకు ప్రారంభం అవుతుండగా, జీ –సీవీటీ ధర రూ.8.30 లక్షలు, వీ –ఎంటీ ధర రూ.7.58 లక్షలకు, వీ సీవీటీ మోడల్ కారు ధర రూ.8.90 లక్షలు పలుకుతుంది.

మారుతి సుజుకి బాలెనో మోడల్ కారును టయోటా రూపొందించిన  గ్లాంజా ‘వి’, గ్లాంజా ‘జి’ వేరియంట్లలో రూపొందించింది. గురువారం నుంచి ఈ మోడల్ బుకింగ్‪లు అధికారికంగా ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. 

గ్లాంజా మోడల్ కారును భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టడంతో హ్యాచ్ బ్యాక్ ప్రీమియం సెగ్మెంట్లోకి సరికొత్త టయోటా ప్రవేశించింది. వినియోగదారుల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ మోడల్ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దామని టయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టీకేఎం) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. రాజా పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ మోడల్ పెట్రోల్ వెర్షన్ కారు మాత్రమే టయోటా మార్కెట్లోకి విడుదల చేసింది. మైల్డ్ హైబ్రిడ్ వ్యవస్థతో అనుసంధానించిన 1.2 లీటర్ కె12ఎన్ పెట్రోల్ ఇంజిన్, 89 బీహెచ్పీ శక్తి, 113 ఎన్ఎం టార్క్ శక్తిగతో టయోటా గ్లాంజా ‘జి’ వేరియంట్ విడుదల చేస్తుంది.

మరోవైపు టయోటా గ్లాంజా ‘వి’ వేరియంట్లో మైల్డ్ హైబ్రిడ్ వ్యవస్థతో కూడిన రూపుదిద్దుకున్న రెగ్యులర్ 1.2 లీటర్ కె12ఎం ఇంజిన్, 82 బీహెచ్పీ శక్తి, 113 ఎన్ఎం టార్క్ శక్తిని కలిగి ఉంటుంది. ఈ మోడల్లో ‘టయోటా స్మార్ట్ ప్లేకాస్ట్’ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. 

యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో లాంటి అధునాతన వ్యవస్థలతో టయోటాకు చెందిన మోడల్ను భారత్లో విడుదల చేయడం ఇదే మొదటిసారి అని సంస్థ వెల్లడించింది. గ్లాంజా మోడల్ కారు డ్రైవర్ సీటు హైట్ అడ్జస్టబుల్‌గా ఉంటుంది. 

7.0 – ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, బ్లూ టూత్ కనెక్టివిటీ, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, రేర్ పార్కింగ్ సెన్సర్లు, ప్రిషిసియన్ కట్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, పుష్ బటన్ స్టార్ట్ – స్టాప్ సిస్టమ్ తదితర ఫీచర్లు కలిగి ఉంఉటంది.

అదనంగా టయోటా గ్లాంజా వీ వేరియంట్లో యూవీ –కట్ గ్లాస్, హెడ్ లైట్స్ కోసం ఎల్ఈడీ డీఆర్ఎల్స్, లెథర్ రాప్డ్ స్టీరింగ్ వీల్, రివర్స్ కెమెరాతో ఆటో హెడ్ లైట్స్ ఫీచర్లు చేర్చారు. టయోటా, మారుతి జాయింట్ వెంచర్‌లో విపణిలోకి అడుగు పెట్టిన గ్లాంజా దారిలోనే మారుతి తన విటారా బ్రెజ్జా, సియాజ్, ఎర్టిగా మోడల్ కార్ల డిజైన్లను కూడా టయోటాకు అందజేనున్నది. 

రెండు జపాన్ ఆటోమొబైల్ దిగ్గజాలు దేశీయ విపణిలోకి విద్యుత్ కార్లను భారీ స్థాయిలో తేవాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇక గ్లాంజా కారుకు మూడేళ్లు గానీ, లక్ష కిలోమీటర్ల వరకు గానీ వారంటీ అందుబాటులో ఉంది.  అంతే కాదు టయోటా గ్లాంజా.. తన ప్రత్యర్థి సంస్థలు హోండా జాజ్, హ్యుండాయ్ ఐ20, త్వరలో రానున్న టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్లకు పోటీ కానున్నది.