Asianet News Telugu

2 వారాల్లో ‘ఎలక్ట్రిక్‌’కు మారే ప్రణాళికలివ్వండి: ఆటో సంస్థలకు నీతి ఆయోగ్

విద్యుత్ వాహనాల ఉత్పత్తిపై కేంద్రం పూర్తిగా ద్రుష్టిని సారించింది. విద్యుత్ వాహనాల తయారీ దిశగా మారేందుకు అమలు చేసే ప్రణాళికలను రెండు వారాల్లో సమర్పించాలని టూ వీలర్, ట్రీ వీలర్ సంస్థలను నీతి ఆయోగ్ కోరింది. ఆటోమొబైల్ సంస్థలు సకాలంలో స్పందించకపోతే న్యాయస్థానాలు జోక్యం చేసుకునే పరిస్థితి నెలకొన్నదని హెచ్చరించింది.

Niti asks 2-, 3-wheeler makers to present EV conversion plan in 2 weeks
Author
New Delhi, First Published Jun 22, 2019, 10:57 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


న్యూఢిల్లీ: సంప్రదాయ వాహనాల తయారీ నుంచి ఎలక్ట్రిక్‌ మోడళ్లకు మారేందుకు అమలు చేసే ప్రణాళికలను రెండు వారాల్లో సమర్పించాలని ద్వి, త్రిచక్ర వాహన కంపెనీలను నీతి ఆయోగ్‌ కోరింది. కాలుష్య నియంత్రణకు కంపెనీలు చర్యలు చేపట్టకపోతే కోర్టులు కలుగజేసుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీని నీతి ఆయోగ్‌ హెచ్చరించింది. శుక్రవారం ఆటో కంపెనీలు, ఎలక్ట్రిక్‌ వాహన స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో నీతి ఆయోగ్‌ సమావేశం జరిగింది. 

నీతి ఆయోగ్ నిర్వహించిన ఈ సమావేశానికి బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌, టీవీఎస్‌ మోటార్‌ కో-చైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌, హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా ప్రెసిడెంట్‌, సీఈఓ మినోరు కతో, భారత వాహన తయారీదారుల సంఘం (సియామ్‌) ప్రెసిడెంట్‌ విష్ణు మాథుర్‌, ఆటోమోటివ్‌ కాంపోనెంట్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ విన్నీ మెహతా తదితరులు పాల్గొన్నారు.
 
ఈ సమావేశానికి నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌, సీఈఓ అమితాబ్‌ కాంత్‌ సారథ్యం  వహించారు. ‘స్పష్టమైన విధానం, రోడ్‌మ్యాప్‌ లేకుం డా పూర్తిగా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి మారడం జరిగే పనికాదు. భవిష్యత్‌ విధానాలపై అస్పష్టత వద్దు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత కాలుష్య కారకమైన 15 నగరాల్లో 14 భారత్‌కు చెందినవే’ అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు అన్నారు. 

2023కల్లా త్రిచక్ర వాహన విభాగంలో, 150సీసీ లోపు ఇంజన్‌ సామర్థ్యం కలిగిన టూవీలర్ల విభాగంలో 2025కల్లా పూర్తిగా ఎలక్ట్రిక్‌ మోడళ్లకు మారాలని నీతి ఆయోగ్‌ వాహన రంగాన్ని కోరుతోంది.
 
వాహనాలు కాలుష్య ఉద్గార ప్రమాణాలైన బీఎస్‌-4 నుంచి బీఎస్- 6కు మారడం వాహన తయారీ రంగం పాలిట సవాలేనని టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) ద్వితీయార్ధంలో వాహన డిమాండ్‌పై అనిశ్చితి మరింత పెరగవచ్చని అంటోంది. 

గత ఆర్థిక సంవత్సరం (2018-19)తో పోలిస్తే 2019-20లో ద్విచక్ర వాహన విక్రయాల వృద్ధి 6-8 శాతానికి పరిమితం కావచ్చని టీవీఎస్‌ మోటార్‌ అంచనా వేసింది. ఈ ఏడాది వర్షపాతం సాధారణ స్థాయికంటే తగ్గితే టూవీలర్‌ విక్రయాలపై ప్రభావం చూపవచ్చని గత ఆర్థిక సంవత్సర నివేదికలో కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది.

బజాజ్‌ ఆటో, హీరో మోటోకార్ప్‌, హెచ్‌ఎమ్‌ఎస్‌ఐ, టీవీఎస్‌లు ఒక వైపు.. ఈవీలకు త్వరగా మారాలని కోరుకుంటున్న రెవోల్ట్‌ ఇంటెలికార్ప్‌, ఆథర్‌ ఎనర్జీ, కైనటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ, పవర్‌ సొల్యూషన్స్‌, టార్క్‌ మోటార్స్‌ వంటివి మరో వైపు చేరి.. పరిశ్రమను రెండు వర్గాలుగా మార్చాయని విశ్వసనీయ వర్గాలు అంటున్నారు.

మరోవైపు ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాడీ ‘సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) జీఎస్టీ రేటు తగ్గించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. తమ సంస్థలో సభ్యులంతా ఉమ్మడిగా ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంపై విధించిన జీఎస్టీ 28 శాతాన్ని 18 శాతానికి తగ్గించాలని కోరింది. కొందరు ఆటోమొబైల్ దిగ్గజాల సంస్థల అధినేతలు జీఎస్టీ తగ్గించవద్దని అంటున్న వార్తలపై సియామ్ అధ్యక్షుడు రాజన్ వధేరా వివరణ ఇచ్చారు. 

ప్రయాణికుల కార్లు, వాణిజ్య వాహనాలు, టూ వీలర్స్, త్రీ వీలర్స్ మాన్యుఫాక్చరర్స్ ఉమ్మడి కోరుతున్నామని రాజన్ వధేరా తెలిపారు. మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ జీఎస్టీ రేట్లు తగ్గించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఆటోమొబైల్ పరిశ్రమ పలు రకాల సవాళ్లను ఎదుర్కొంటున్నదని రాజన్ వధేరా తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios