న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థ ‘కియా మోటార్స్’ తమ సెల్టోస్ మోడల్ కార్ల బుకింగ్స్ జూలైలో ప్రారంభం అవుతాయని ప్రకటించింది. కార్ల బుకింగ్స్ తేదీని తమ కస్టమర్లకు ముందే వెల్లడిస్తామని పేర్కొంది. ఈ నెల 20వ తేదీన భారత విపణిలో ఆవిష్కరించిన సెల్టోస్ ఎస్ యూవీ కంపాక్ట్ మోడల్ కారును ఆగస్టులో విపణిలోకి ప్రవేశపెడతామని తెలిపింది. కనుక సెల్టోస్ బుకింగ్స్ విషయమై మోసపూరిత వెబ్ సైట్లలో ప్రకటనలకు దూరంగా ఉండాలని సూచించింది. 

అనధికారికంగా కియామోటార్స్ ‘సెల్టోస్’ బుకింగ్స్ పలు డీలర్ షిప్ ల వద్ద ప్రారంభమయ్యాయని, బుకింగ్ కోసం రూ.25 వేలు చెల్లించాల్సి ఉంటుందని బాలీవుడ్ యాక్టర్ టైగర్ షరాఫ్ పాల్గొన్న తొలి ప్రమోషనల్ వీడియోను కూడా వెబ్ సైట్లు విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో కియా మోటార్స్ స్పందిస్తూ.. అధికారికంగా బుకింగ్స్ ప్రారంభం గురించి ప్రకటిస్తామని తెలిపింది. 

హ్యుండాయ్ క్రెటా, టాటా హరియర్, రెనాల్ట్ కాప్చర్, ఎంజీ హెక్టార్ మోడల్ కార్లకు పోటీగా కియా సెల్టోస్ నిలువనున్నది. దీని ధర రూ.10 లక్షల నుంచి రూ.16 లక్షల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

బీఎస్ -6 ప్రమాణాలతో రూపుదిద్దుకున్న 1.4 లీటర్ల టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజిన్ 140 హెచ్పీ, 242 ఎన్ఎం టార్చి సామర్థ్యం గలిగి ఉంటుంది. 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ 115 హెచ్పీ, 144 ఎన్ఎం టార్చి సామర్థ్యం, 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్ వేరియంట్ 115 హెచ్పీ, 250 ఎన్ఎం టార్చి సామర్థ్యం గలిగి ఉంటుంది. 

ఈ మూడు ఇంజిన్లలో స్టాండర్డ్ 6 -స్పీడ్ గేర్ బాక్స్, ఆటోమేటిక్ ఆప్షన్లు ఉన్నాయి. టర్బో జీడీఐ పవర్ ట్రైన్ 7 - స్పీడ్ డీసీటీ, 1.5 పెట్రోల్ ఇంజిన్ సీవీటీ, 1.5 లీటర్ల డీజిల్ వేరియంట్ కారు 6- స్పీడ్ టార్చ్ కన్వర్టర్‌గా వ్యవహరిస్తుంది.