ముంబై: మహారాష్ట్రలోని వలూజ్‌లో ఉన్న బజాజ్ ఆటో యూనిట్‌లో సుమారు 300 మంది ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. దీంతో ప్రొడక్షన్ యూనిట్‌ను తాత్కాలికంగా మూసివేయాలని బజాజ్ ఆటో వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తోంది. మహారాష్ట్రలో అత్యధిక కేసులు ఉన్న పశ్చిమ మహారాష్ట్రలో ఈ యూనిట్ ఉండడం గమనార్హం. 

ఇదిలా ఉంటే విధులకు హాజరు కాని వారికి డబ్బులు చెల్లించబోమని ఉద్యోగులకు రాసిన లేఖలో బజాజ్ ఆటో కంపెనీ పేర్కొంది. కార్మికులు విధులకు రావాలంటే భయపడుతున్నారని, కొందరు వస్తున్నా, మరికొందరు సెలవు తీసుకుంటున్నట్టు బజాజ్ ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు తెంగాడె బాజీరావు తెలిపారు.

మొత్తం 8,000 మంది పనిచేస్తున్న ఈ యూనిట్‌లో 140 మంది కరోనా బారినపడినట్టు జూన్ 26వ తేదీన కంపెనీ పేర్కొంది. అయితే, పని ఆపేది లేదని, ‘వైరస్‌తో కలిసి జీవించడం నేర్చుకోవాలని’ కంపెనీ కోరుకుంటోందని వెల్లడించింది. 

కాగా, బజాజ్ ఆటోమొబైల్ కంపెనీలో కరోనా బారినపడిన వారి సంఖ్య 300 మందికి చేరువలో ఉన్నదని ఔరంగాబాద్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. కంపెనీని 10-15 రోజులపాటు తాత్కాలికంగా మూసి వేయాలని కోరుతున్నట్టు బాజీరావు తెలిపారు. కరోనా వైరస్‌ చైన్‌ను తెంచాలంటే మూయక తప్పదని అన్నారు.    

కరోనా మహమ్మారి వ్యాపించకుండా ఉద్యోగులు ప్రొడక్షన్ యూనిట్‌ను మూసివేయాలని కొన్ని రోజులుగా తాము కోరుతున్నా యాజమాన్యం మాత్రం ప్రొడక్షన్ యూనిట్ కొనసాగించాలని నిర్ణయించిందని తెలిపారు. టూ వీలర్స్, త్రీ వీలర్ వెహికల్స్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించిందని అన్నారు.

also read:లాక్‌డౌన్ తర్వాత కార్ల జోరు.. ఈ నెలలో విపణిలోకి వచ్చే కార్లివే

దేశీయంగా విక్రయించడంతోపాటు విదేశాలకూ ఎగుమతి చేయాలని బజాజ్ ఆటోమొబైల్ తీర్మానించింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి 50 శాతం సిబ్బంది హాజరు కావాలని నిర్ణయించింది బజాజ్ ఆటో. ఇంతకుముందు 30 శాతం సిబ్బంది మాత్రమే పని చేయాలని నిర్ణయించింది. 

విధులకు హజరైన వారికి 100 శాతం, హాజరు కాని వారికి 50 శాతం వేతనం కోత విధించాలని నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం ఉదయం 6.30 గంటల నుంచి, మధ్యాహ్నం 12.30 గంటలకు రెండు షిప్టుల్లో ఉత్పత్తి జరుగుతున్నదని బజాజ్ ఆటో తెలిపింది. కరోనాతో మరణించిన వారికి రూ.50 లక్షల పరిహారం విధించలని యూనియన్ డిమాండ్ చేసింది.